logo

హైరిస్క్‌లో 52 శాతం మంది

జీవనశైలిలో మార్పులతో కుటుంబంలో ఎవరూ ఏ వ్యాధితో బాధపడుతున్నారో తెలియని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం. ఆహారపు అలవాట్లలో మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

Published : 19 May 2024 03:13 IST

ఆరోగ్య  శాఖ సర్వేలో గుర్తింపు

రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు 

న్యూస్‌టుడే, సారంగాపూర్‌: జీవనశైలిలో మార్పులతో కుటుంబంలో ఎవరూ ఏ వ్యాధితో బాధపడుతున్నారో తెలియని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం. ఆహారపు అలవాట్లలో మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ తమ సిబ్బంది ద్వారా ప్రతి కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య వివరాలు నమోదు చేశారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 11 లక్షలకు పైగా ఉండగా ఇందులో 30 ఏళ్లు దాటిన వారిలో 52 శాతం మంది ఏదో ఒక రకమైన వ్యాధికి దగ్గరగా ఉంటూ హైరిస్క్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో రక్తపోటుతో 26 శాతం, మధుమేహంతో 13 శాతం, క్యాన్సర్‌తో 0.03 శాతం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో 31,141 మంది రక్తపోటు, 13,523 మంది మధుమేహం, క్యాన్సర్‌తో 501 మంది, మధుమేహం, రక్తపోటు కలిపి ఉన్న వారు 4,270 మంది ఉండగా, వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. వాస్తవంగా అంతకంటే ఎక్కువగానే ఆయా వ్యాధులతో బాధపడుతూ ప్రైవేట్‌ ఆస్పత్రులలో చికిత్స తీసుకుంటున్నారు. 

సమగ్ర సమాచారం 

రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, గుండెపోటు, హృద్రోగ, నరాల సమస్యలు, ఫిట్స్, వైకల్యం, దీర్ఘకాలిక తలనొప్పి, కండరాల నొప్పులతో ఇంకేమైనా సమస్యలతో బాధపడుతున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా మద్య, దూమపానంతో చెడు అలవాట్లపై ఆరా తీశారు. దీని ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, సాధారణ లక్షణాలతో బాధపడుతున్న వారిని రెండు విభాగాలుగా వర్గీకరించారు. ప్రతి ఇంటికి సంబంధించిన ఆరోగ్య సమాచార వివరాలను వైద్యశాఖ నమోదు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే రోగాలపై ముందుగానే అంచనాలు వేసుకోవచ్చని వైద్యశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ప్రభుత్వం పట్టణాల్లో బస్తీ, గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసింది. పల్లె దవాఖానాల్లో ప్రస్తుతం సాధారణ ఓపీ, గర్భిణులకు పరీక్షలు, చిన్నపిల్లలకు టీకాలు, అసాంక్రమిక వ్యాధుల నిర్ధారణ, మందుల పంపిణీ సేవలు అందుతున్నాయి. రక్త, మూత్ర నమూనాలను సేకరించి, సమీపంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌ కేంద్రానికి పంపించి, ఫలితాల నివేదికలను ఆన్‌లైన్‌లో పొందుపరిచి బాధితులకు పరీక్షల రిపోర్టు ప్రింట్‌ రూపంలో అందజేస్తున్నారు.

మెరుగైన వైద్యం

ప్రతి కుటుంబ వివరాలను ఆరోగ్య శాఖ వద్ద ఉండడంతో మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశముంది. జిల్లాలో కుటుంబాల వారీగా ఆరోగ్య వివరాలు సేకరించాం. జిల్లాలో 30 ఏళ్లు దాటిన వారు 52 శాతం హైరిస్క్‌లోనే ఉన్నారు. ఉప కేంద్రాల ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు మందుల పంపిణీ కొనసాగిస్తున్నాం. ప్రత్యేక హెల్త్‌ ప్రొఫైల్‌ ద్వారా మున్ముందు మరింత వైద్య సేవలు అందనున్నాయి.

షమీయోద్దిన్, దీర్ఘకాలిక వ్యాధుల జిల్లా ప్రోగ్రాం అధికారి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని