logo

స్కాన్‌ చేయండి.. నమోదు చేసుకోండి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపడటం, వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రోజురోజుకు చికిత్సకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఓపీ నమోదు కోసమే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Updated : 19 May 2024 04:29 IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

ఆసుపత్రిలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌తో ఓపీ నమోదు చేసుకుంటున్న వ్యక్తి 

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపడటం, వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రోజురోజుకు చికిత్సకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఓపీ నమోదు కోసమే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో నిత్యం సుమారుగా 800 నుంచి వెయ్యి మంది వరకు ఓపీ వైద్య సేవల కోసం వస్తుంటారు. ఓపీ నమోదుకు ఆసుపత్రిలో ప్రత్యేకంగా రెండు కౌంటర్లను ఏర్పాటు చేసినా అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఓపీ నమోదు కాగితం ఇచ్చేందుకు సమయం ఎక్కువ పడుతుంది. దీంతో రోగులు, గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నింటినీ అధిగమించి కేవలం ఆండ్రాయిడ్‌ చరవాణి ఉంటే చాలు క్యూలైనులో గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేకుండా ఎవరికి వారుగా ఓపీ నమోదు చేసుకునేలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...

ఆండ్రాయిడ్‌ చరవాణిలోని ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఎ.బి.హెచ్‌.ఎ.(ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్) యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ ఇన్‌స్టాల్‌ కాగానే ఆసుపత్రిలో ఓపీ నమోదుకు ఏర్పాటు చేసిన ‘క్యూఆర్‌’ కోడ్‌ స్కాన్‌ చేయాలి. అందులో పేర్కొన్న కాలమ్‌లో చరవాణి నంబరు లేదా ఆధార్‌ నంబర్‌ టైప్‌ చేసి సబ్‌మిట్ చేయాలి. వెంటనే ఈ వివరాలన్నీ ఆసుపత్రిలోని ఓపీ నమోదు కేంద్రం సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్తాయి. కొద్ది క్షణాల్లో ఒక టోకెన్‌ నంబరు మీ చరవాణికి వస్తుంది. ఈ నంబరును ఓపీ నమోదు కౌంటర్‌లో చూపించగానే ఓపీ చిట్టీ డౌన్‌లోడ్‌ చేసి ఇస్తారు.

అవగాహన కలిగించేందుకు చర్యలు

ఆన్‌లైన్‌ ద్వారా ఓపీ నమోదు చేసుకోవడంపై అవగాహన పెంచడానికి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాం. చరవాణి వినియోగించే వారిని క్యూఆర్‌ కోడ్‌ ద్వారా నమోదు చేసుకునేలా అవగాహన కల్గిస్తున్నాం. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగించుకోవాలి. ఈ విధానంతో రద్దీ భారీగా తగ్గనుంది.

డాక్టర్‌ దయాల్‌సింగ్, సూపరింటెండెంట్, ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని