logo

అర చేతిలోనే కథలు చదివేద్దాం!

వేసవి సెలవులను పిల్లలు ఆనందంగా గడుపుతుంటారు. రోజులో కొంత సమయాన్ని నైపుణ్య పెంపు, లేదా వికాస వృద్ధికి కేటాయిస్తే వారి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఇంటింటా కంప్యూటర్, ట్యాబ్, స్మార్ట్‌ఫోన్‌ ఏదో ఒకటి ఉంటున్న నేపథ్యంలో పఠనా నైపుణ్యాలు పెంచే వెబ్‌సైట్లు రూపుదిద్దుకున్నాయి.

Updated : 19 May 2024 04:17 IST

వేసవి సెలవుల్లో చిన్నారులకు ప్రయోజనం

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం: వేసవి సెలవులను పిల్లలు ఆనందంగా గడుపుతుంటారు. రోజులో కొంత సమయాన్ని నైపుణ్య పెంపు, లేదా వికాస వృద్ధికి కేటాయిస్తే వారి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఇంటింటా కంప్యూటర్, ట్యాబ్, స్మార్ట్‌ఫోన్‌ ఏదో ఒకటి ఉంటున్న నేపథ్యంలో పఠనా నైపుణ్యాలు పెంచే వెబ్‌సైట్లు రూపుదిద్దుకున్నాయి. ఆన్‌లైన్‌ గేములకు అత్తుకుపోవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను కథలు చదివేలా ప్రోత్సహించాలి. పాఠ్య పుస్తకాలలోని పాఠాలను కూడా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసుకొని చదువుకోవచ్చు. పఠానాసక్తి పెంచాలనే రూమ్‌ టు రీడ్‌ సంస్థ లిటరసీ క్లౌడ్‌ వెబ్‌సైట్‌ రూపొందించింది. ఇందులో ఎనిమిది భాషల్లో ఉన్న కథలను పొందుపర్చింది. ఈ కథలను చదవడంతో ప్రాథమిక దశలో విద్యార్థుల్లో మౌఖిక భాషా వికాసం, అభ్యసనా సామర్థ్యం వృద్ధి చెందుతుంది.

ఆడియో పాఠాలకు శ్రీకారం

కరోనా సమయంలో పాఠశాలలు మూతపడి పిల్లలు చదువుకు దూరమవుతున్న నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లా విద్యావంతులు వినూత్న ఆలోచన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతోపాటు శతక పద్యాలను ఆడియో రికార్డింగ్‌ చేసి కృత్య పత్రాలు తయారు చేశారు. విద్యా శాఖ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్‌ఈఆర్‌టీ) ఆధ్వర్యంలో పుస్తకాలలోని పాఠాలను రికార్డింగ్‌ చేసి విద్యార్థులకు అందుబాటులో వెబ్‌సైట్‌లో పెట్టారు. కేబీ.శర్మతోపాటు గాజుల రవీందర్, నంది శ్రీనివాస్‌తోపాటు కొందరు తెలుగు పండితులు, ఉపాధ్యాయులతో పాఠ్యాంశాలను ఆడియో రికార్డింగ్‌ చేశారు. పాఠ్య పుస్తకంపై ఉండే క్యూఆర్‌ కోడ్‌ సహాయంతో పాఠాలను వినవచ్చు. 

లిటరసీ క్లౌడ్‌ సహాయంతో..

‘రూమ్‌ టు రీడ్‌’ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ సమన్వయంతో వేసవి సెలవుల్లో నచ్చిన కథలు చదివేందుకు లిటరసీ క్లౌడ్‌ వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేశారు. మౌఖిక భాషాభివృద్ధి, అభ్యసన సామర్థ్యాల పెంపు, విషయ అవగాహన శక్తి పెంపొందించుకోవడానికి ఇది దోహదపడుతుంది. పిల్లల స్థాయిని బట్టి ఆకర్షణీయ బొమ్మలతో హిందీ, ఆంగ్లంతోపాటు ఎనిమిది భాషల్లో 1200 పైచిలుకు పుస్తకాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఆంగ్లంలో 406, తెలుగులో 117, మరాఠీ, హిందీ, గుజరాతీ, కన్నడ భాషల్లోనూ కథలను ఉంచారు.

వెబ్‌సైట్‌ను ఇలా వినియోగించుకోవాలి

గూగుల్‌ సెర్చ్‌లో www.literacycloud.orgtories/language/ అనే వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాలి. ఇందులో కోరిన భాషలో కథల పుస్తకాలను ఎంచుకొని చదువుకోవచ్చు. అనంతరం సంబంధిత కథను ఇతరులకు చెప్పడం, బొమ్మలు గీయడం, వ్యాక్యాల్లో రాయడం ద్వారా విద్యార్థి భాషా నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. జిల్లాలో అన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పిల్లల వాట్సాప్‌ గ్రూపులో ఈ వెబ్‌సైట్‌పై అవగాహన కల్పించి ఉపయోగించుకునేలా చూడాలి. తల్లిదండ్రులు కూడా ఈ కథలను వినడానికి మొబైల్‌ ఫోన్లను పిల్లలకు ఇచ్చి పర్యవేక్షించాలి. ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి కూడా కథలు వినవచ్చు.

నాలుగు లక్షల మంది విద్యార్థులు

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలో 1,19,680, జగిత్యాలలో 1,31,948, పెద్దపల్లిలో 84,089 మంది, రాజన్న సిరిసిల్లలో 65,466 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వేసవిలో బాలల అభ్యసనా సామర్థ్యం పెంచేందుకు.. ఆసక్తి ఉన్న కథలను చదివించడం.. వినేలా చూడాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 

ప్రతిరోజు కొత్త కథలు

విద్యార్థులు ఏ రోజుకారోజు కొత్త కథను వినేందుకు రూమ్‌ టు రీడ్‌ సంస్థ టోల్‌ ఫ్రీ నంబర్‌ను ప్రకటించింది. 040-4520-9722 నంబర్‌కు డయల్‌ చేయడం ద్వారా విద్యార్థులకు అభిరుచి కల్గించే తెలుగు కథలు వినవచ్చు. లిటరసీ క్లౌడ్‌ వెబ్‌సైట్, క్యూఆర్‌ కోడ్‌ను ఉపయోగించుకొని శ్రవణ, పఠనా నైపుణ్యాలను పెంచుకోవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని