logo

మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం అంతంతే

పార్లమెంటు ఎన్నికల్లో మద్యం విక్రయాలు ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికలు అనగానే మద్యం ఏరులై పారుతుంది. కానీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం సాధారణంగా జరిగాయి. ఇందుకు ఆబ్కారీశాఖ అధికారుల లెక్కలే ఉదాహరణ. ఎన్నికల కోడ్‌ మార్చి 16న ప్రారంభమైంది.

Updated : 20 May 2024 05:24 IST

కోడ్‌ సమయంలో రూ.85.22 కోట్ల విక్రయాలు
న్యూస్‌టుడే, సిరిసిల్ల కలెక్టరేట్‌

పార్లమెంటు ఎన్నికల్లో మద్యం విక్రయాలు ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికలు అనగానే మద్యం ఏరులై పారుతుంది. కానీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం సాధారణంగా జరిగాయి. ఇందుకు ఆబ్కారీశాఖ అధికారుల లెక్కలే ఉదాహరణ. ఎన్నికల కోడ్‌ మార్చి 16న ప్రారంభమైంది. అప్పటి నుంచి జిల్లాలో ఆబ్కారీశాఖ అధికారులు బెల్టుషాపులు మూసివేసినప్పటికీ ఎన్నికల కోడ్‌ రాకముందు సాగిన మాదిరిగానే అమ్మకాలు జరగడం గమనార్హం. గడిచిన రెండు నెలల్లో రూ. 85,22,08,804 విక్రయాలు సాగినట్లు అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో 48 మద్యం దుకాణాలు, 8 బార్లు ఉన్నాయి. వీటిపై ఆబ్కారీశాఖ అధికారులు నిఘా పెట్టారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో అధికారులు, సిబ్బంది రోజూ గ్రామాలు, పట్టణాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిని పట్టుకొని కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో మద్యంతో పాటు సారా, బెల్లం స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో గుడుంబా 4,826 లీటర్లు, మద్యం 193.695 లీటర్లు, బీర్లు 228.94 లీటర్లు పట్టుకున్నారు. వీటి విలువ రూ.22.69 లక్షలు ఉంటుంది. ఇప్పటి వరకు 52 మందిపై 133 కేసులు నమోదు చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేశారు.

చల్లని బీర్లకే మొగ్గు

పార్లమెంటు ఎన్నికలు మద్యం అమ్మకాల్లో ఎలాంటి ప్రభావం చూపలేదు. వేసవి తీవ్రత నేపథ్యంలో మద్యం కంటే ఎక్కువగా బీర్ల విక్రయాలే సాగాయి. రోజు రోజుకు ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో మద్యం ప్రియులు చల్లని బీర్లను ఎక్కువగా వినియోగించారు. దీంతో పరిమిత సంఖ్యలో స్టాకు రావడంతో సాయంత్రం వేళల్లో వాటిని చల్లబరిచే వరకు కూడా వినియోగదారులు ఆగని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా ఒక వ్యక్తి 5 బాటిళ్ల మద్యంతో పాటు 6 బీర్లు తీసుకెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంది. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు గ్రామాల్లో బెల్టుషాపుల్లో మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేయనున్నారు.


విస్తృతంగా తనిఖీలు

ఎన్నికల కోడ్‌ ప్రారంభమైనప్పటి నుంచి మద్యం అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. సాధారణ రోజుల మాదిరిగానే సాగాయి. జనవరిలో రూ. 43.96 కోట్ల ఆదాయం రాగా, ఫిబ్రవరిలో రూ. 45.96 కోట్లు వచ్చింది. ఎన్నికల కోడ్‌ మార్చి 16న ప్రారంభమైనప్పటి నుంచి మే 17 నాటికి మొత్తం రూ.85,22,08,804 ఆదాయం వచ్చింది. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. గుడుంబా తయారీదారులతోపాటు బెల్టుషాపుల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తే ఆబ్కారీ శాఖకు సమాచారం అందించాలి. తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేస్తాం.

పంచాక్షరి, జిల్లా ఆబ్కారీ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని