logo

ప్రధాన రహదారి.. ప్రమాదాలకు నెలవు

గౌతమినగర్‌ నుంచి రాజీవ్‌ రహదారిని కలిపే ప్రధాన రహదారి నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వెరసి ప్రమాదానికి నెలవుగా మారింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఎరువులను తీసుకెళ్లే భారీ వాహనాలతో పాటు గోదావరిఖని ప్రాంతం నుంచి ఎన్టీపీసీ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి దగ్గరి దారి కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది.

Updated : 20 May 2024 05:23 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

వీధి దీపాలు లేకపోవడంతో ప్రధాన రహదారిలో గౌతమినగర్‌ వద్ద నెలకొన్న అంధకారం

గౌతమినగర్‌ నుంచి రాజీవ్‌ రహదారిని కలిపే ప్రధాన రహదారి నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వెరసి ప్రమాదానికి నెలవుగా మారింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఎరువులను తీసుకెళ్లే భారీ వాహనాలతో పాటు గోదావరిఖని ప్రాంతం నుంచి ఎన్టీపీసీ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి దగ్గరి దారి కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఇదే రోడ్డులో వారాంతపు సంతతో పాటు వివిధ మతాలకు చెందిన దేవాలయాలు ఉండటంతో భక్తులతో రద్దీగా ఉంటుంది. 

ప్రధాని వస్తున్నారని...

రామగుండం ఎరువుల కర్మాగారానికి అత్యంత ఉపయోగపడే ఈ రోడ్డును ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌. నిధులతోనే నిర్మించాల్సి ఉన్నప్పటికీ సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని రూ.2.62 కోట్లు రామగుండం నగరపాలిక నిధులతో ప్రగతినగర్‌ నుంచి ఎన్టీపీసీ టౌన్‌షిప్‌ వరకు హడావుడిగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. నగరంలోని ఐదు డివిజన్లలో వివిధ డివిజన్లలో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం కోసం కేటాయించిన నిధులు రూ.2.62 కోట్లు మళ్లించి ప్రగతి నగర్‌ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రధాని వస్తున్నందున అత్యవసరంగా నగరపాలిక నిధులతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నప్పటికీ తిరిగి రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఈ నిధులను నగరపాలికకు చెల్లించాలనే షరతుతో రోడ్డు నిర్మించినప్పటికీ నిధులు తిరిగి రాబట్టుకోవడాన్ని నగరపాలిక విస్మరించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, రామగుండం నగరపాలిక, రామగుండం ఎరువుల కర్మాగారం సమన్వయంతో వ్యవహరిస్తేనే ఈ సమస్య పరిష్కారానికి నోచుకోనుంది.

పరిశ్రమకు ప్రోత్సాహకంగా...

మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారం స్థానంలో ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌. ఆధ్వర్యంలో కర్మాగారం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తన వంతు ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల రవాణా కోసం రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి రాజీవ్‌ రహదారిని కలిపేలా ప్రధాన రహదారి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎరువుల కర్మాగారం నుంచి రాజీవ్‌ రహదారి వరకు రోడ్డు నిర్మించాల్సి ఉండగా ఎరువుల కర్మాగారం, ఫెర్టిలైజర్‌ సిటీ అంతర్గత, ప్రధాన రహదారులను నిర్మించారు. మిగిలిన నిధులతో గౌతమినగర్‌ రైల్వే ట్రాకు నుంచి ప్రగతినగర్‌ వరకు రోడ్డు, డివైడర్లు నిర్మించారు. ఫెర్టిలైజర్‌ సిటీ టౌన్‌షిప్‌తో పాటు ఎరవుల కర్మాగారం ప్రధాన, అంతర్గత రహదారుల్లో విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేసినప్పటికీ గౌతమినగర్‌ నుంచి ప్రగతినగర్‌ వరకు వీధి దీపాలు ఏర్పాటు చేయలేదు. రామగుండం నగరపాలక నిధులు రూ.2.62 కోట్లతో ప్రగతి నగర్‌ నుంచి ఎన్టీపీసీ టౌన్‌షిప్‌ రింగ్‌ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టినప్పటికీ డివైడర్లు, వీధి దీపాలు లేకపోవడంతో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని