logo

కొత్త రేషన్‌ కార్డులపై ఆశలు

‘రేషన్‌ దుకాణాలు కేవలం దొడ్డు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యంతో సహా నిత్యావసరాలను పేదలకు తక్కువ ధరలకే అందిస్తాం. రైతుల నుంచి పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి సహ ఉత్పత్తులు తయారు చేసి పేదలకు పంపిణీ చేస్తాం.

Updated : 20 May 2024 05:21 IST

ఈనాడు, పెద్దపల్లి

రేషన్‌ దుకాణాల్లో బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారులు

‘రేషన్‌ దుకాణాలు కేవలం దొడ్డు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యంతో సహా నిత్యావసరాలను పేదలకు తక్కువ ధరలకే అందిస్తాం. రైతుల నుంచి పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి సహ ఉత్పత్తులు తయారు చేసి పేదలకు పంపిణీ చేస్తాం. కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ ఇక నిరంతర ప్రక్రియగా మారుస్తాం. గ్రామసభల్లో ఇచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరించాం. వాటి ప్రకారం రేషన్‌ కార్డులు ఇస్తాం.’

ఈ నెల 14న విలేకరులతో సీఎం రేవంత్‌రెడ్డి

ప్రస్తుతం నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. విపణిలో సన్న బియ్యం ధర కిలో గరిష్ఠంగా రూ.75 వరకు పలుకుతోంది. అన్ని పప్పుల ధరలూ రూ.200 వరకు చేరాయి. వంట నూనె, ఇతర నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పేద, మధ్య తరగతి, వేతన జీవులకు ఇది అశనిపాతంలా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం చేసిన ప్రకటన పేద, మధ్యతరగతి, వేతన జీవులకు ఊరట కలిగించింది. ప్రతినెల ఒక్కో కుటుంబం ఆదాయంలో సింహ భాగాన్ని నిత్యావసరాలకే కేటాయిస్తుండగా రేషన్‌ కార్డులున్న ప్రతి ఒక్కరికీ రేషన్‌ సరకులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ముందుకు రావడంపై హర్షం వ్యక్తమవుతోంది.

ఇకపై నిరంతర ప్రక్రియ

పదేళ్లుగా కొత్త ఆహార భద్రత (రేషన్‌) కార్డుల మంజూరు ఊసే లేకుండా పోయింది. ఏటా కుటుంబాల సంఖ్య పెరుగుతున్నా ఆ మేరకు కార్డుల సంఖ్య పెరగడం లేదు. పదేళ్లుగా మీ సేవ ద్వారా దరఖాస్తులు కూడా తీసుకోకపోవడంతో పథకాల ప్రయోజనాలకు ప్రతిబంధకంగా మారింది. గత ప్రభుత్వం హుజూరాబాద్, మునుగోడు, ఇతర ఉప ఎన్నికల వేళ.. అప్పటికే దరఖాస్తులు చేసి కొన్ని ఏళ్లు వేచిచూసిన లబ్ధిదారులకే ఆహార భద్రత కార్డులను అందించి ఆ తర్వాత వెబ్‌సైట్‌లో జారీ, మార్పులు చేర్పుల ప్రక్రియను నిలిపివేసింది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనతో మళ్లీ కొత్త రేషన్‌ కార్డుల జారీకి మోక్షం లభించనుంది. గతంలో కాకుండా నిరంతర ప్రక్రియగా రేషన్‌కార్డులు జారీ చేస్తామని చెప్పడంతో లబ్ధిదారులకు ఊరట లభించింది. త్వరలో దీనికి సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

పెండింగ్‌లో 49,498 దరఖాస్తులు 

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రేషన్‌ దుకాణాలు 1,947 ఉన్నాయి. మొత్తం 9,80,261 ఆహార భద్రత కార్డులుండగా 28,24,897 మంది కుటుంబ సభ్యులు రాయితీతో కూడిన నిత్యావసర వస్తువులతో లబ్ధిపొందుతున్నారు. ఉప ఎన్నికలను పురస్కరించుకుని రెండేళ్ల క్రితం మొత్తం 30,747 కొత్త కార్డులు పంపిణీ చేశారు. మార్పులు, చేర్పులు, ఇతరత్రా మ్యూటేషన్లు, కొత్త దరఖాస్తులు అన్ని కలిపి 49,498 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయా శాఖాధికారులు చెబుతున్నారు. వెబ్‌సైట్‌ సేవలు నిలిపివేయడంతో దరఖాస్తుల స్వీకరణ లేదు. ఒకవేళ సేవలు పునరుద్ధరిస్తే లక్షల్లో దరఖాస్తులు పెరిగే అవకాశాలున్నాయని మీసేవ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు.
ః కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించినా, వివాహం జరిగి అత్తగారింటికి వెళ్లిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు, అక్రమంగా రేషన్‌ కార్డును పొందినవారు ఇలా విభాగాల వారీగా అత్యాధునిక 4జీ/5జీ సాంకేతిక పరిజ్ఞానంతో 360 డిగ్రీస్‌ అనే కొత్త సాఫ్ట్‌వేర్‌తో తొలగింపు ప్రక్రియ చేపట్టింది.

కార్డుల్లో ఎవరైనా మరణించినా, కొత్తగా జన్మించినా, పెళ్లై ఇతర జిల్లాలకు వెళ్లినా, చిరునామాలు మార్చాల్సి వచ్చినా ఇలా.. ఎలాంటి మార్పులు చేర్పులకు గత ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి వారికి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంటుంది.


ప్రభుత్వ మార్గదర్శకాలు రాలేదు

సీఎం రేవంత్‌రెడ్డి మే 14న ప్రకటించినప్పటికి రేషన్‌దుకాణాల్లో నిత్యావసరాల పంపిణీకి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. గతంలో పలుమార్లు రేషన్‌ డీలర్ల వద్ద ప్రజలు డిమాండ్‌ చేసిన నిత్యావసరాల పంపిణీ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఈ ప్రకటన చేశారు. త్వరలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తే అందుకు అనుగుణంగా దుకాణాల్లో పంపిణీ చేపడతాం.

ప్రేమ్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి, పెద్దపల్లి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని