logo

మహాలక్ష్ములతో ఆర్టీసీ కళకళ

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులన్నీ కళకళలాడుతుండటంతో ఆదాయమూ పెరిగింది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అయిదు నెలల పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ కథనం.

Updated : 20 May 2024 05:35 IST

అయిదు నెలల్లో 3 కోట్ల మంది ప్రయాణం
న్యూస్‌టుడే, కరీంనగర్‌ రవాణావిభాగం

కరీంనగర్‌ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులన్నీ కళకళలాడుతుండటంతో ఆదాయమూ పెరిగింది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అయిదు నెలల పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ కథనం.

కరీంనగర్‌ రీజియన్‌లో..

రీజియన్‌లో కరీంనగర్‌-1, కరీంనగర్‌-2, హుస్నాబాద్, హుజూరాబాద్, కోరుట్ల, గోదావరిఖని, మంథని, రాజన్న సిరిసిల్ల, వేములవాడ, మెట్‌పల్లి, జగిత్యాల డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల పరిధిలో నిత్యం 2.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య 4.5 లక్షలకు చేరింది. ఇందులో మహిళలే అధికంగా ఉండటం విశేషం. ఒకప్పుడు ప్రయాణికుల కోసం బస్సు డ్రైవర్లు గంటల కొద్ది ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులు నిమిషాల్లో ప్రయాణికులతో నిండిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో పరిమితికి మించి ప్రయాణికులను బస్సుల్లో తరలిస్తున్నారు.

మార్చిలో అత్యధికం..

రాష్ట్రంలో గతేడాది డిసెంబరు 9న మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో రాష్ట్ర పరిధిలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే వెసులుబాటు ఉంది. ప్రయాణ సమయంలో ఆధార్‌ కార్డు చూపిస్తే సరిపోతుంది. జీరో టికెట్‌ జారీ మాత్రం డిసెంబరు 15 నుంచి అందుబాటులోకి తెచ్చారు. గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది మే 15  వరకు రీజియన్‌ వ్యాప్తంగా 3.41 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. అయిదు నెలల్లో మార్చిలో అధికంగా 93.25 లక్షలు, అత్యల్పంగా డిసెంబరు(2023)లో 41.42 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు.

రద్దీకి అనుగుణంగా బస్సులు..

మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. బస్సుల కొరత ఉన్నా అధికారులు రద్దీకి అనుగుణంగా ఆయా రూట్లలో నడుపుతూ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. రీజినల్‌ మేనేజర్‌ ఎన్‌.సుచరిత పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. డిప్యూటీ ఆర్‌ఎం ఎస్‌.భూపతిరెడ్డి రద్దీని స్వయంగా పరిశీలిస్తూ అందుకు అనుగుణంగా బస్సులు నడిపించే విధంగా అధికారులు, సిబ్బందికి సూచనలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని