logo

మహిళలకు రక్షణ... వేధింపులకు అడ్డుకట్ట

‘ఇటీవల ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వైద్యాధికారిణీలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు.

Updated : 20 May 2024 06:15 IST

ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు పురపాలక సంచాలకుల ఆదేశాలు
న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం, కరీంనగర్‌ సుభాష్‌నగర్‌

రామగుండం నగరపాలక కార్యాలయం

‘ఇటీవల ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వైద్యాధికారిణీలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. ఇదే తరహాలో ఓ ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయినీలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రధానోపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. గతంలో ఓ ప్రజాప్రతినిధి తనను మరో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి లైంగికంగా వేధిస్తున్నాడంటూ’ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ నేపథ్యంలో పురపాలక నిర్వహణ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పుర, నగరపాలికల్లో పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నియంత్రణకు ప్రత్యేకంగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పురపాలక సంచాలకులు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయా పుర, నగరపాలికల్లో కమిటీల ఏర్పాటునకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని పట్టణ, స్థానిక సంస్థల్లో పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు 2013లో రూపొందించిన చట్టం ప్రకారం అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

కమిటీల ఏర్పాటు ఇలా...

నగర, పురపాలికల్లో పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపుల బారిన పడకుండా ఏర్పాటు చేయనున్న అంతర్గత కమిటీల్లో మహిళలే ప్రిసైడింగ్‌ అధికారిణిగా, సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఆ స్థాయిలో ఆయా పురపాలక, నగరపాలికల్లో మహిళా ఉద్యోగినులు లేనట్లయితే ఇతర శాఖల్లోని ఉద్యోగినులతో కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా పురపాలక సంచాలకులు తమ ఉత్తర్వుల్లో మార్గదర్శనం చేశారు. సీనియర్‌ ఉద్యోగినిని ప్రిసైడింగ్‌ అధికారిణిగా, మరో ఇద్దరు ఉద్యోగినీలను సభ్యులుగా నియమిస్తారు. మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఒక మహిళను పుర, నగరపాలిక అంతర్గత ఫిర్యాదుల కమిటీలో సభ్యురాలిగా నియమిస్తారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికలతో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, జగిత్యాల, సిరిసిల్ల, మెట్పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి, చొప్పదండి, హుజూరాబాద్, హుస్నాబాద్, కొత్తపల్లి, జమ్మికుంట, వేములవాడ తదితర పురపాలికల్లో ఈ కమిటీల ఏర్పాటునకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తికానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని