logo

సమయం సమీపిస్తున్నా ఏర్పాట్లేవీ!

కొండగట్టులో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్‌ 1న హనుమాన్‌ పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మరో పది రోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నా ఆలయంలో ఇంకా ఏర్పాట్లు ప్రారంభంకాలేదు.

Updated : 20 May 2024 05:19 IST

29 నుంచి కొండగట్టులో హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు  
న్యూస్‌టుడే, మల్యాల

కొండగట్టు ఆంజనేయ ఆలయం

కొండగట్టులో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్‌ 1న హనుమాన్‌ పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మరో పది రోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నా ఆలయంలో ఇంకా ఏర్పాట్లు ప్రారంభంకాలేదు. ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు నిర్వహించలేదు. హనుమాన్‌ చిన్న జయంతి సందర్భంగా తలెత్తిన సమస్యలు, అసౌకర్యాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. 

ఏటా హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా అధికారులు ఆలయానికి రంగులు వేయిస్తుంటారు. పది రోజుల్లో ఉత్సవాలు జరగనున్నప్పటికీ ఆలయానికి రంగులు వేసే పనులు చేపట్టలేదు. హనుమాన్‌ చిన్న, పెద్ద జయంతి ఉత్సవాలకు రూ.76.50 లక్షలతో ఏర్పాట్లు చేపట్టనున్నట్లు ఆలయ అధికారులు గతంలో వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రంగులు వేసేందుకు టెండర్లు పిలిచే అవకాశం లేనందున ఆలయ పరిధిలోని వ్యాపారుల నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయంతో పనులు ప్రారంభించినట్లు ఈవో తెలిపారు. కొండపైన పుష్కరిణిలో నీటిని ఎప్పటికప్పుడు తొలగించి కొత్త నీటిని నింపాలి, మెట్లపక్కన జల్లు స్నానాల కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉంది. దీక్షాపరులు వదిలేసే దుస్తులను ఎప్పటికప్పుడు తొలగించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. చిన్న జయంతి ఉత్సవాల చివరి రోజు మాత్రమే అధికారులు కొండపైకి ఆర్టీసీ బస్సును నడిపించారు. ఈనెల 29 నుంచి జూన్‌ 1 వరకు కొండగట్టు స్టేజి నుంచి దొంగలమర్రి, జేఎన్టీయూ మీదుగా కొండపైన ‘వై’జంక్షన్‌ వరకు మినీ బస్సులను నడిపిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఘాట్‌రోడ్డు, బొజ్జపోతన్న సమీపంలో రహదారులకు ఇరువైపులా చలివేంద్రాలను ఏర్పాటు చేసి రక్షిత నీటిని సరఫరా చేయాలి. సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన ఎండలో నడిచి వచ్చే దీక్షాపరుల కోసం ప్రధాన రహదారి పక్కన పలుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. తలనీలాలు సమర్పించే చోట ఘర్షణ సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగు చర్యలు, అక్రమ వసూళ్లపై కూడా దృష్టి సారించాలి. వాహన పార్కింగు స్థలాల్లో కూడా నీడ, నీటి వసతి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆలయ పరిసరాల్లో వేసిన చలువపందిళ్లను సరిచేసి, ఇతర ప్రాంతాల్లో కూడా పందిళ్లు నిర్మిస్తే దీక్షాపరులు సేదతీరే అవకాశం ఉంది. జయంతి రోజుకు ముందు అర్ధరాత్రి భక్తుల తోపులాట జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బందోబస్తు, బారికేడ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.


అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు

హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మంగళవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయించాం. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఎన్నికల కోడ్‌ కారణంగా ఆలయానికి రంగులు వేసేందుకు టెండర్లు నిర్వహించే ప్రక్రియకు పాలనాపరమైన మంజూరు అవకాశం లేకపోవడంతో వర్తకం సంఘం సభ్యులు అందజేసే రూ.2 లక్షలతో రంగులు వేయిస్తున్నాం.

చంద్రశేఖర్, ఈవో  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని