logo

పేరుకే పెద్ద ఆసుపత్రి!

వైద్య విధాన పరిషత్‌లో నడుస్తున్న కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని వైద్య కళాశాలకు అనుసంధానం చేసి  ఆరు నెలలైంది. ఇప్పటికీ బడ్జెట్‌ మంజూరు చేయకపోవడంతో పాలనపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Published : 20 May 2024 05:44 IST

నిధులు లేక సేవలకు ఆటంకం
న్యూస్‌టుడే, కరీంనగర్‌ సంక్షేమ విభాగం

ఆసుపత్రిలోని ఓపీ కేంద్రం వద్ద రోగులు

వైద్య విధాన పరిషత్‌లో నడుస్తున్న కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని వైద్య కళాశాలకు అనుసంధానం చేసి  ఆరు నెలలైంది. ఇప్పటికీ బడ్జెట్‌ మంజూరు చేయకపోవడంతో పాలనపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెయింగ్‌ రూం, దాతల సహకారంతో నిర్వహణను నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిగా మారితే అత్యాధునిక వైద్య సేవలందుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. వైద్యులు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నా.. పరికరాలు లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి. వార్డులలో కూలర్లు, పంకాలు, ఐసీయూలో ఏసీలు లేకపోవడంతో దాతల  సహాయంతో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి స్పందించి కొంతవరకు ఇబ్బందులు తీర్చారు.

ఎలా నడుస్తుందంటే..

కరీంనగర్‌ మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో 33 పెయింగ్‌ రూంలున్నాయి. శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేసిన తర్వాత ఆసుపత్రిలో ఏడు రోజులుండాలి. రెండు రోజుల తర్వాత వారికి రూ.2500 తీసుకొని పెయింగ్‌ రూం ఇస్తారు. వీటి ద్వారా ప్రతి రోజు రూ.8 వేల నుంచి రూ.10 వేలు వస్తాయి. ఈ డబ్బులను శస్త్రచికిత్సలకు, ఇతర ఖర్చులకు వాడుతున్నారు. ఇవి కాకుండా దాతల సహాయంతో నెట్టుకొస్తున్నారు. ఇటీవల దాతలు మాతా, శిశుతోపాటు జిల్లా ఆసుపత్రిలో 21 కూలర్లు అందజేయగా కలెక్టర్‌ పమేలా సత్పతి స్పందించి మూడు ఏసీలతోపాటు ఐసీయూలో 6 ఏసీల మరమ్మతుకు రూ.50 వేలు అందజేశారు.

ప్రతి నెలా రూ.40 లక్షలు రావాలి

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా దవాఖానాలకు ప్రతి నెల ఒక్కో మంచానికి రూ.7500 చొప్పున ప్రభుత్వం మంజూరు చేయాల్సి  ఉంటుంది. కరీంనగర్‌ జనరల్‌ ఆసుపత్రి సామర్థ్యం 540 మంచాలు. ఈ లెక్కన ప్రతినెల రూ.40 లక్షలపైగా నిధులు రావాలి. కనీసం వైద్య పరికరాలైనా ఇవ్వాలి. ఆరు నెలలుగా ఒక్క రూపాయి రాలేదు. ఏ అభివృద్ధి పని చేయాలన్నా వైద్యాధికారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. రోగులకు సరైన వైద్య సేవలందక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

వైద్యులున్నా.. పరికరాలు లేవు..

సేవలందించడానికి ఒక్కో విభాగంలో ముగ్గురు, నలుగురు వైద్యులున్నారు. వారు సిద్ధంగా ఉన్నా సరైన పరికరాలు లేక  ఏం చేయలేకపోతున్నారు. దంత, కన్ను, చర్మం, ఆర్థో, గైనిక్, జనరల్‌ సర్జరీలో వారికి కావాల్సిన పరికరాలు లేకపోవడంతో పలు శస్త్రచికిత్సలకు అవసరమైన వాటిని అప్పటికప్పుడు తెప్పిస్తున్నారు. మరికొన్ని చికిత్సలను వాయిదా వేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రిలో చేసిన శస్త్రచికిత్సలకు సంబంధించి.. రూ.2 కోట్ల బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. వాటిలో కొంత మంజూరైనా రోగులకు మెరుగైన సేవలందుతాయి.


సమస్యలు పరిష్కరిస్తున్నాం

వైద్య విధాన పరిషత్‌ నుంచి మాకు ఒక్క రూపాయి మంజూరు కాలేదు. ప్రస్తుతానికి ఆసుపత్రిలో ఉన్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నాం. త్వరలోనే బడ్జెట్‌ మంజూరవుతుంది.

వీరారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని