logo

పెరిగిన మామిడి దిగుబడి.. తగ్గిన ధర

రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులకు మామిడి ధర తగ్గింది. ఏడాది పొడవునా కంటికి రెప్పలా చూసుకునే చెట్లు... సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కాతకు సైతం ధర పడిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.

Published : 20 May 2024 05:46 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ మంకమ్మతోట

మార్కెట్‌ యార్డులో మామిడి కాయలు

రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులకు మామిడి ధర తగ్గింది. ఏడాది పొడవునా కంటికి రెప్పలా చూసుకునే చెట్లు... సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కాతకు సైతం ధర పడిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. నిన్న మొన్నటి వరకు మార్కెట్‌లో సగటున కిలో ధర రూ.30 పలికిన మామిడి రెండు రోజులుగా రూ.20కు పడిపోయింది.

కరీంనగర్‌ మార్కెట్‌ యార్డులో గత నెల 7న మామిడి మార్కెట్‌ ప్రారంభమైంది. అప్పుడు బరువు ఎక్కువగా ఉండే కాయలకు సైతం సగటున కిలోకు రూ.45 ధర పలికింది. ఈదురుగాలులు, వర్షాలకు తోడు కాత చివరి దశకు రావడంతో శుక్రవారం కనిష్ఠ ధర కిలో రూ.5 మాత్రమే పలకగా, గరిష్ఠంగా రూ.30 పలికింది. మార్కెట్‌ ప్రారంభమైన కొత్తలో బంగినపల్లి, దసేరి, తోతాపురి మామిడి రకాలను రైతులు తీసుకురాగా, గడిచిన పది రోజులుగా కేవలం బంగినపల్లి రకం మాత్రమే మార్కెట్‌కు వస్తోంది. గతేడాది అన్ని రకాల మామిడి కలిపి 6,117 మెట్రిక్‌ టన్నులను రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చారు. ఈ సంవత్సరం అన్ని రకాల మామిడి కలిపి ఇప్పటి వరకు 6,619 మె.ట కొనుగోలు జరిగింది. దీనిలో 5,960 మె.ట బంగినపల్లి రకమే ఉంది. మిగిలినవి దసేరి, తోతాపురి రకాలున్నాయి. ఈ నెలాఖరు వరకు కూడా ఇంకా కొన్ని మెట్రిక్‌ టన్నులు వచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెటింగ్‌ శాఖ సిబ్బంది తెలిపారు.

నష్టపోతున్న రైతులు..

వరి, మొక్కజొన్న తదితర పంటల మాదిరిగా మామిడి పంటకు కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని సందర్భాల్లో మార్కెట్‌కు అధిక సంఖ్యలో సరకు రావడంతో కమీషన్‌ ఏజెంట్లు ధర తగ్గించి కొంటున్నారని రైతులు వాపోతున్నారు. రవాణా ఖర్చులతో మార్కెట్‌కు మామిడిని తీసుకొచ్చిన రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో విక్రయించాల్సి వస్తోందని తెలిపారు.

క్రయ విక్రయాలు ఇలా..

మార్కెట్‌లో రైతుల దగ్గరి నుంచి మామిడి నాణ్యతను బట్టి గరిష్ఠ, కనిష్ఠ ధరలకు కమీషన్‌ ఏజెంట్లు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన ధరలో ఒక శాతం కమీషన్‌ను మార్కెట్‌ కమిటీకి చెల్లిస్తారు. కమీషన్‌ ఏజెంట్లు కొనుగోలు చేసిన మామిడికాయలు, పండ్లను వాటి తీరును బట్టి గ్రేడింగ్‌ చేసి ప్యాకింగ్‌ చేస్తారు. ట్రెడర్స్‌తో ధర కుదుర్చుకొని ఎగుమతి చేస్తారు. మార్కెట్‌కు వచ్చే మామిడిలో అధిక శాతం ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నారు. మన దగ్గరి నుంచి ముఖ్యంగా దిల్లీ, హరియాణ, రాజస్థాన్‌ తదితర ప్రాంతాలకు వెళ్తున్నట్లు సమాచారం.

కూలీలు సైతం ఇతర రాష్ట్రాల వారే..

మామిడి సీజన్‌ నడిచినన్ని రోజులు ఇక్కడ పని చేయడానికి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో కూలీలు వస్తారు. కొనుగోలు చేసిన మామిడి గ్రేడింగ్, ప్యాకింగ్, లోడింగ్‌ తదితర పనులన్నీ వారే చేస్తారు. ఈ నెలాఖరుతో మామిడి సీజన్‌ ముగియగానే వారు స్వస్థలాలకు వెళ్లిపోతారు.


కనీస వసతులు కల్పిస్తాం

మామిడి మార్కెట్‌ నడిచినన్ని రోజులు ఇక్కడికి వచ్చిన వారందరికీ కనీస వసతులైౖన తాగునీరు, విద్యుత్తు తదితర కనీస సదుపాయాలు కల్పిస్తాం. ఈసారి మామిడి దిగుబడి అధికంగా వచ్చింది.

పురుషోత్తం, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి           

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని