logo

పాఠ్య పుస్తకాలు వస్తున్నాయ్‌!

వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు త్వరగా అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గతేడాది పంపిణీలో కొంత జాప్యం జరిగింది.

Published : 20 May 2024 05:48 IST

జూన్‌ మొదటి వారంలోగా బడులకు చేరవేత
న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం

కొత్తపల్లిలోని గోదాంలో నిల్వ చేసిన పాఠ్యపుస్తకాలు

వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు త్వరగా అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గతేడాది పంపిణీలో కొంత జాప్యం జరిగింది. ఈసారి జిల్లాలోని సర్కారు పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను తెప్పించేందుకు జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కరీంనగర్‌ సమీపంలోని కొత్తపల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోదాంకు ఇప్పటికే కొన్నింటిని చేరవేయగా.. మిగిలిన వాటిని త్వరలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

3.12 లక్షలు అవసరం..

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలతోపాటు సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేయనున్నారు. మొత్తం 3,12,930 పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి తెలిపింది. ఇప్పటికే 1,95,350 పాఠ్యపుస్తకాలు రాగా.. ఇంకా 1,16,580 రావాల్సి ఉంది. మరికొన్ని కిందటి ఏడాది మిగిలి ఉన్నాయి. పుస్తకాలు పక్కదారి పట్టకుండా ఈసారి కూడా వాటిపై వరుస నంబర్లను ముద్రించారు. వీటి ఆధారంగా ఆయా పాఠశాలలకు పుస్తకాలు సరఫరా చేయనున్నారు. ప్రాథమిక పాఠశాలల బాలలకు వర్క్‌బుక్కులు, 6-10 తరగతుల వారికి రాత పుస్తకాలను కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇవి కూడా జిల్లాకు చేరుతున్నాయి.

తగ్గిన బరువు..

విద్యార్థులకు పాఠ్యపుస్తకాల బరువు మోతను తగ్గించేందుకు వాటిని ముద్రించే కాగితాల మందం తగ్గించారు. ఫలితంగా విద్యార్థులకు భారం తగ్గనుంది. 3-10వ తరగతి విద్యార్థులకు ఒక్కో మాధ్యమ, సబ్జెక్టు పుస్తకాలను పార్ట్‌-1, పార్ట్‌-2లుగా విభజించి అందిస్తున్నారు. ఈ విధానంతో కూడా బడి పిల్లలకు పుస్తకాల బరువు సమస్య ఉండదు.


40 శాతం వచ్చాయి

విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాలు సరఫరా చేస్తాం. ఇప్పటికే జిల్లాకు 40 శాతం గోదాంకు చేరుకున్నాయి. మిగిలినవి కూడా వారం రోజుల్లో రానున్నాయి. మొత్తం రాగానే వచ్చే నెల మొదటి వారం నుంచి పాఠశాలలకు సరఫరా చేస్తాం.

జనార్దన్‌రావు, జిల్లా విద్యాశాఖాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని