logo

సా..గుతున్న అభివృద్ధి పనులు

రోజు రోజుకు జనాభా పెరుగుతుండటంతో మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్‌ను గత ప్రభుత్వం పురపాలక సంఘం హోదా కల్పించి అభివృద్ధి కోసం రూ.25 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లోంచి పెద్ద చెరువుపై మినీ ట్యాంక్‌బండ్, సమీపంలో ఉద్యానవనం ఏర్పాటుకు రూ.1.5 కోట్లు కేటాయించింది.

Published : 20 May 2024 05:57 IST

న్యూస్‌టుడే, రాయికల్‌ పట్టణం

అసంపూర్తిగా రివిట్‌మెంట్‌ పనులు

రోజు రోజుకు జనాభా పెరుగుతుండటంతో మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్‌ను గత ప్రభుత్వం పురపాలక సంఘం హోదా కల్పించి అభివృద్ధి కోసం రూ.25 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లోంచి పెద్ద చెరువుపై మినీ ట్యాంక్‌బండ్, సమీపంలో ఉద్యానవనం ఏర్పాటుకు రూ.1.5 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో కట్ట వెడల్పు, రివిట్‌మెంట్, పార్క్‌ అభివృద్ధి, కర్బాస్‌ వాల్, రెయిలింగ్, మెట్ల నిర్మాణం, రిటర్నింగ్‌ వాల్‌ వంటి పనులు చేపట్టాల్సి ఉంది. 2018లో నిధులు మంజూరు కాగా 2022లో టెండర్‌ ప్రక్రియ ముగించుకొని పనులు ప్రారంభమయ్యాయి. కాగా రెండు సంవత్సరాలుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. వర్షాకాలంలో వర్షాలకు చెరువు నిండుతుండటంతో వేసవిలోనే పనులు చేయాల్సి ఉంటుంది. కాగా గుత్తేదారులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందాన పనులు చేపడుతున్నారు.

మెట్ల నిర్మాణం, రిటర్నింగ్‌ వాల్‌ పనులు గతంలో పూర్తయినా పనుల్లో నాణ్యత లోపించి కంకర తేలడంతో పైపై పూతలు పూసి మరమ్మతులు చేశారు. వర్షాకాలంలో భారీ వర్షాలకు చెరువు కట్ట వెడల్పు కోసం పోసిన మట్టి కోతకు గురికాగా ఇటీవల మళ్లీ మొరం పోసి చదును చేశారు. ప్రస్తుతం చెరువు కట్టకు రివిట్‌మెంట్‌ పనులు ప్రారంభించినా మధ్యలోనే నిలిచిపోయాయి. యాంత్రిక జీవనంలో కాస్త ఉపశమనం పొందేందుకు అహ్లాదరక వాతావరణం లేక పట్టణ ప్రజలు అల్లాడుతుండగా ఉద్యానవనం ఏర్పాటు చేయాల్సిన స్థలం అభివృద్ధి చేయడం మినహా మొక్కలు నాటేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పార్క్‌ ఏర్పాటు చేయాల్సిన స్థలంలో పెద్ద పెద్ద బండరాళ్లు తొలగించాల్సి ఉంది. పనుల పర్యవేక్షణ సజావుగా జరిపి నాణ్యతతో పనులు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


80 శాతం పనులు పూర్తి

వర్షాకాలంలో కురిసిన వర్షాలకు పెద్ద చెరువు నిండుకుండలా మారడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం చెరువులో నీరు లేకపోవడంతో ఇటీవలే రివిట్‌మెంట్‌ పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 70-80 శాతం పనులు పూర్తయ్యాయి. వర్షాలు కురిసి చెరువు నిండేలోపు మిగతా పనులు పూర్తవుతాయి. పనుల్లో నాణ్యత కోసం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఉద్యానవనం ఏర్పాటు కోసం స్థలం అభివృద్ధి చేయడం మాత్రమే గుత్తేదారు పని. మొక్కలు నాటడం, పార్క్‌లో ఇతర అభివృద్ధి పనులు కాంట్రాక్టులో లేవు.

భాస్కర్, ఇరిగేషన్‌ డీఈ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు