logo

కనిపిస్తే కరుస్తున్నాయ్‌!

జిల్లాలో వీధి కుక్కలు బెంబేలేత్తిస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చేవారిపై దాడికి పాల్పడుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వీధుల్లో గుంపులుగా తిరుగుతూ బయట ఆడుకునే చిన్నారులతో పాటు వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. రాయికల్‌ పట్టణంలోని ఓ కాలనీలో ఒకే రోజు 11 మందిపై కుక్కలు దాడి చేశాయి.

Published : 20 May 2024 06:00 IST

జిల్లాలో పెరుగుతున్న కుక్కకాటు బాధితులు
న్యూస్‌టుడే, జగిత్యాల, రాయికల్‌

జిల్లాలో వీధి కుక్కలు బెంబేలేత్తిస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చేవారిపై దాడికి పాల్పడుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వీధుల్లో గుంపులుగా తిరుగుతూ బయట ఆడుకునే చిన్నారులతో పాటు వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. రాయికల్‌ పట్టణంలోని ఓ కాలనీలో ఒకే రోజు 11 మందిపై కుక్కలు దాడి చేశాయి. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి పట్టణాలతో పాటు పల్లెల్లో సైతం ఇటీవల కుక్కలు అనేక మందిని గాయపరిచాయి. రాయికల్‌ ఆసుపత్రిలో జనవరి నుంచి ఇప్పటి వరకు కుక్కల దాడులకు గురై 360 మంది చికిత్స పొందారు. జిల్లాలో గత అయిదు నెలల్లో సుమారు 2200 మందికి పైగా చికిత్స తీసుకున్నారు. వీధుల్లో విచ్చలవిడిగా బయట పడివేసిన మాంసం, కోళ్ల వ్యర్థాలకు కుక్కలు రావడం వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి తాగునీరు దొరక్క పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తూ దాడులు చేస్తున్నాయి. కుక్కల దాడుల నియంత్రణపై పంచాయతీ, మున్సిపల్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో అవస్థలు తప్పడం లేదు.

లెక్కలు లేవు..

జిల్లాలో పెంపుడు కుక్కలకు యజమానులు ఎప్పటికప్పుడు వైద్యం చేయిస్తుండడంతో పట్టణాలు, గ్రామాల్లో పశు వైద్యాధికారులకు తెలిసినప్పటికీ వీధికుక్కలకు మాత్రం లెక్కలు లేవు. పట్టణాల్లో వందల సంఖ్యలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ వీధికుక్కల సంఖ్య అధికంగానే ఉంది. పెంపుడు కుక్కలకు యజమానులు వైద్యుల సూచనల మేరకు టీకాలు వేయిస్తుంటారు. ఆహార నియంత్రణ, యజమాని పర్యవేక్షణ ఉండటంతో ఎవరినైనా గాయపర్చినా ఎలాంటి ప్రమాదం ఉండదు. వీధి కుక్కలకు ఎలాంటి టీకాలు వేయకపోవడంతో దాడి చేస్తే ప్రమాదకరంగా మారవచ్చు. వీధి కుక్కల్లో ఎక్కువగా రేబిస్‌ లక్షణాలు ఉంటాయి. అవి కరిస్తే వెంటనే వైద్యం చేయించుకోకపోతే ప్రాణాపాయం తప్పదు. రేబిస్‌ సోకిన కుక్కలు గాయపర్చితే సమీపంలోని ఆసుపత్రులలో యాంటీ రేబిస్‌ టీకాలు కచ్చితంగా వేసుకోవాలి. 

రాయికల్‌లో కుక్కకాటుతో అయిన గాయాలు

ప్రభుత్వ ఆసుపత్రులకు...

జిల్లాలో 20 మండలాలు, అయిదు పట్టణాల్లో సుమారు 10.50 లక్షలకు పైగా జనాభా ఉంది. జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు ధర్మపురి, రాయికల్, కోరుట్ల, మెట్‌పల్లి సామాజిక ఆసుపత్రులు, మండల, అర్బన్‌ కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. కుక్క కాటుకు గురైతే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే చికిత్స అందిస్తున్నారు. దాడి చేసిన కుక్కల పరిస్థితి, గాయం తీరును బట్టి కుక్క కాటుకు చికిత్స అందించాల్సి ఉంటుంది. కుక్కలు లేదా ఇతర జంతువులు గాయపర్చినా దాడి చేసినా యాంటీ రేబిస్‌ టీకాలు వేసుకోవాలి. పిచ్చి కుక్కల దాడులు గాయం తీవ్రంగా ఉంటే యాంటి రేబిస్‌ వ్యాక్సిన్‌తో పాటు ఇమ్యూనోగ్లోబిన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కుక్కల గాయాలకు సంబంధించిన మందుల ధరలు అధికంగా ఉండటంతో ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కుక్కకాటు చికిత్సకు కనీసం రూ.10వేలకు పైగానే ఖర్చవుతుంది.


అందుబాటులో టీకాలు

జిల్లాలోని అన్ని ప్రాథమిక, అర్బన్‌ ఆసుపత్రుల్లో కుక్కలు ఇతర జంతువులు దాడులు చేస్తే ఏ.ఆర్‌.వి.టీకాలు అందుబాటులో ఉన్నాయి. కుక్కలు దాడులు చేస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలి. అన్ని ఆసుపత్రులలో చికిత్స అందించడానికి సిబ్బందికి సూచనలు అందించాం. జిల్లాలో యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ కొరత లేదు.

ఎన్‌.శ్రీనివాస్, జిల్లా ఉపవైద్యాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు