logo

జంట హత్యల కేసులో నిందితుల అరెస్టు

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని గోపులాపూర్‌లో ఈ నెల 16న అర్ధరాత్రి జంట హత్య కేసులో ఏడుగురు నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ తెలిపారు.

Published : 21 May 2024 02:41 IST

నిందితుల అరెస్టు చూపుతున్న జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, సీఐ రాంనర్సింహారెడ్డి

ధర్మపురి, న్యూస్‌టుడే:  జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని గోపులాపూర్‌లో ఈ నెల 16న అర్ధరాత్రి జంట హత్య కేసులో ఏడుగురు నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ తెలిపారు. ధర్మపురి పట్టణంలోని పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఆయన కథనం మేరకు... గోపులాపూర్‌కు చెందిన బుర్ర నవీన్, దీటి శ్రీనివాస్‌ కుటుంబాల మధ్య ఇంటి కొనుగోలు విషయంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో నవీన్‌ జగిత్యాలకు చెందిన తన స్నేహితులు జికూరి పవన్, మొగిలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేష్, నాచుపల్లి గంగరాజం అలియాస్‌ మనోజ్, చింతల శేషు, చొప్పరి అజయ్‌లతో పథకం రూపొందించాడు. దీటి శ్రీనివాస్, అతని సోదరుడు దీటి మహేష్‌లపై ఇనుప పైపులు, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీనివాస్‌ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మహేష్‌ను చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీనివాస్‌ సోదరి ఫిర్యాదు మేరకు బుగ్గారం ఎస్సై ఎం శ్రీధర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. ఏడురుగు నిందితులు కారులో వెళుతుండగా బుగ్గారం అడ్డరోడ్డు వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి ఇనుపరాడ్లు, కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఏడు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వివాదానికి కారణమైన వారిపై సైతం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి, బుగ్గారం, ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లి ఎస్సైలు శ్రీధర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, ఉమాసాగర్, సతీష్‌లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని