logo

రాయితీల్లో కోత.. నేతన్నల వెత

వస్త్రపరిశ్రమకు ఇప్పటికీ సరైన ఆర్డర్లులేక.. వచ్చిన అరకొర ఉత్పత్తులతో సరైన ఉపాధిలేక నేతన్నలు భారంగా కాలం వెల్లదీస్తున్నారు.

Published : 21 May 2024 02:46 IST

మారిన విధానంతో ఏటా రూ.2 కోట్ల మేర నష్టం

భీములు చుట్టేందుకు ఉపయోగించే నూలు కండెలు

ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: వస్త్రపరిశ్రమకు ఇప్పటికీ సరైన ఆర్డర్లులేక.. వచ్చిన అరకొర ఉత్పత్తులతో సరైన ఉపాధిలేక నేతన్నలు భారంగా కాలం వెల్లదీస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉత్పత్తి చేసిన వస్త్రాలకు చెల్లింపులు.. రాయితీలు విడుదలపైనే ఆశలు పెట్టుకున్నవారికీ నిరాశే ఎదురవుతోంది. బతుకమ్మ చీరల్లో పదిశాతం నూలు రాయితీ చెల్లింపులకు బదులు.. పనిచేసిన కూలీ చెల్లింపులపై లెక్కగట్టి ఇవ్వడంతో కార్మికులు నష్టపోతున్నారు. తమ శ్రమకు తగ్గ ఫలితం దక్కడంలేదంటూ ప్రభుత్వం రాయితీ చెల్లింపుల విధానాన్ని మార్చాలని కార్మికులు ఆందోళన బాటపడుతున్నారు.

ఇదీ పరిస్థితి

బతుకమ్మ చీరల ఉత్పత్తిలో భాగస్వాములైన కార్మికులకు కూలీ సర్దుబాటు కింద పదిశాతం నూలు రాయితీ బోనస్‌గా అందేది. ఇలా జిల్లాలోని అయిదువేలకు పైగా కార్మికులకు 2018 నుంచి 2021 వరకు చెల్లించారు. కార్మికులు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరలకు పదిశాతం రాయితీతో మీటరుకు రూ.1.42 చొప్పున ఏటా సుమారు రూ.8.50 కోట్ల మేరకు చెల్లింపులు జరిగేవి. జిల్లాలోని కార్మికులందరికీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుండేది. నూలు రాయితీ చెల్లింపులు పూర్తిగా టెస్కో నుంచి జరుగుతాయి. దీనికి అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులేవీ విడుదల చేయలేదు. వీటితోపాటు మరికొన్ని రకాల చెల్లింపులకు సైతం సరైన ఉత్తర్వులేకుండా జరిగినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. చెల్లింపులు జరిగిన తర్వాత ప్రభుత్వం నుంచి టెస్కోకు ఎలాంటి నిధుల విడుదల కాలేదు. కాగా ప్రభుత్వం మారడంతో చేనేత, జౌళీశాఖ ఇలాంటివి పూర్తిగా పక్కన పెట్టింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జిల్లాలోని వివిధ వర్గాల నేతన్నలు, కార్మిక సంఘాలు రాష్ట్ర చేనేత, జౌళీశాఖ కమిషనర్‌ను కలిసి ప్రభుత్వ ఆర్డర్ల ఉత్పత్తులకు సంబంధించిన బకాయిలు, కార్మికులకు రావాల్సిన రాయితీలను విడుదల చేయాలని మొర పెట్టుకున్నారు. వస్త్రోత్పత్తులకు సంబంధించిన బకాయిలను విడతల వారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 2022కి సంబంధించిన కార్మికుల నూలు రాయితీని పోలింగ్‌కు రెండ్రోజుల ముందు 170 మంది ఖాతాలో నేరుగా జమ చేశారు. కార్మికులు వారు ఉత్పత్తిచేసిన వస్త్రానికి.. ప్రభుత్వం విడుదల చేసిన మొత్తానికి సరిచూసుకుంటే తేడా ఉంది. ఈ విషయమై రాష్ట్ర చేనేత, జౌళీశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు వారు పదిశాతం నూలు రాయితీ రూపకంగా కాకుండా ఆ సంవత్సరం కార్మికుడు బతుకమ్మ చీరల ఉత్పత్తిచేసిన మీటర్లతో పొందిన వేతనం నుంచి 20 శాతం చెల్లించినట్లు లెక్కచెప్పారు. దీంతో మీటరుకు రూ.1.42 రావాల్సింది. సగటున రూ.1.05 మాత్రమే వస్తుంది. ఈ విధానంతో ప్రతి కార్మికుడు సుమారు 42 పైసలు నష్టపోతున్నారు. ఇలా చెల్లించడం వలన జిల్లాలోని కార్మికులు ఏటా సుమారు రూ.2.కోట్ల మేరకు నష్టపోవాల్సిన పరిస్థితి. దీనిపై గత నాలుగు రోజులుగా కార్మికులు ఆందోళనలు చేపడుతున్నారు.

టెక్స్‌టైల్‌ పార్కులో మరోలా..

టెక్స్‌టైల్‌ పార్కులో బతుకమ్మ చీరల ఉత్పత్తికి సంబంధించి 2022, 2023లో జాకెట్‌ వస్త్రం ఆర్డర్లు ఇచ్చారు. ఇక్కడి మరమగ్గాలపై రెండు పన్నాలు ఉత్పత్తి అవుతాయి. మీటరుకు రూ.1.50 చొప్పున రెండు పన్నాలకు కలిపి రూ.3 చెల్లిస్తారు. ఇక్కడ కూడా కూలీ సర్దుబాటు కింద రెండు పన్నాలకు కలిపి నూలు రాయితీ చెల్లిస్తామని కార్మిక సంఘాలకు చేనేత, జౌళీశాఖ, పార్కు యాజమాన్యం నచ్చజెప్పారు. పదిశాతం నూలు రాయితీలో 30 పైసల చొప్పున రెండు పన్నాలకు రూ.60 పైసలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో ఇక్కడ పనిచేసిన కార్మికులు తాము కష్టపడిన దానిలో సగానికిపైగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితోపాటు నేతన్నలకు చేయూత (త్రిఫ్ట్‌) పథకానికి సంబంధించి కార్మికులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు బ్యాంకులకు జమ కావడం లేదు. పరోక్షంగా కార్మికులు ప్రతినెలా వడ్డీని నష్టపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని