logo

ప్రజా పంపిణీలో నిత్యావసర సరకులు

రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు నిత్యావసర సరకులు సైతం అదించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Updated : 21 May 2024 05:25 IST

బియ్యంతో పాటే అందజేయాలని ప్రభుత్వ యోచన
పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రయోజనం

న్యూస్‌టుడే, గోదావరిఖని: రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు నిత్యావసర సరకులు సైతం అదించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగిన నేపథ్యంలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా పంపిణీ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శితో పాటు పౌరసరఫరాలు, మార్కెటింగ్‌ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్‌ కార్డుల జారీతో పాటు బియ్యం, మరో తొమ్మిది రకాల సరకుల పంపిణీ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం నివేదిక కోరినట్లు సమాచారం. ఈ అంశం కార్యరూపం దాలిస్తే జిల్లాలోని పేదలకు బియ్యంతో పాటు నిత్యావసర సరకులు అందే అవకాశం ఏర్పడనుంది. జిల్లాలో 413 రేషన్‌ దుకాణాలుండగా 1,21,950 తెల్ల కార్డులున్నాయి. వీరికి ప్రతి నెలా 3,500 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు.

తెరపైకి ‘అమ్మహస్తం’

రేషన్‌ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర సరకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రూపాయికి కిలో చొప్పున బియ్యం అందజేస్తుండగా పప్పు, నూనె, చింతపండు, కారంపొడి, పసుపు, ఉల్లిగడ్డ, పంచదార వంటి సరకులు పంపిణీ చేసే అవకాశం ఉంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్‌ హయాంలో 2012లో ఉగాది సందర్భంగా ‘అమ్మహస్తం’ పేరిట నిత్యావసర సరకుల పంపిణీని ప్రారంభించారు. ఆ సమయంలో తక్కువ ధరకు బియ్యంతో పాటు కిలో చొప్పున ఉల్లిగడ్డ, వంట నూనె, కారంపొడి, ఉప్పు, కందిపప్పు, చింతపండు, పంచదార, పసుపు ప్యాకెట్ల ద్వారా పంపిణీ చేశారు. అలా పంపిణీ చేసిన సరకులు పేద కుటుంబాలకు నెల రోజులకు సరిపోయేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమ్మహస్తం పథకాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి కేవలం రూపాయికి కిలో బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. దీంతో నిత్యావసరాలను బయటి మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి వస్తుండటంతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది.

తగ్గనున్న ఆర్థిక భారం

రాష్ట్రంలో అయిదు నెలల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గతంలో మాదిరిగా తిరిగి రేషన్‌ దుకాణాల ద్వారా నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని భావిస్తోంది. దీంతో నిరుపేదలపై ఆర్థిక భారం పడకుండా ఉంటుందని ఆలోచిస్తున్న ప్రభుత్వం అమ్మహస్తం పథకం పునఃప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో బియ్యంతో పాటు గోధుమలు కూడా పంపిణీ చేసే వారు. నిత్యావసరాలతో పాటు ఇంకా ఏమైనా సరకులు పంపిణీ చేయవచ్చా? అన్న కోణంలోనూ ప్రభుత్వం ఆలోచిస్తోంది. మార్కెట్‌లో నిత్యావసర సరకుల ధరలు మండిపోతుండటంతో పేద కుటుంబాలపై ప్రతి నెలా రూ.1000 నుంచి రూ.2000 వరకు ఆర్థిక భారం పడుతోంది. ఈ భారాన్ని తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు