logo

సెలవులు ముగిసేలోగా పనులు పూర్తయ్యేనా!

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత పీడిస్తోంది. విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ ప్రగతిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది.

Published : 21 May 2024 02:53 IST

పాఠశాలల్లో వేధిస్తున్న మౌలిక వసతుల కొరత

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత పీడిస్తోంది. విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ ప్రగతిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. మరుగుదొడ్లు, మూత్రశాలల వసతి లేక ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. విద్యార్థులు శిథిలమైన గదిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. విద్యుత్తు సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ప్రహరీ లేక విద్యార్థులకు రక్షణ కొరవడింది. పైకప్పు పెచ్చులూడిన గదులకు మరమ్మతు చర్యలు శూన్యమయ్యాయి. విద్యార్థుల సంఖ్యకు సరిపడా మౌలిక వసతులు కల్పించడంలేదు. జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో 191 పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయి. వీటిలో పావలా వంతు మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగతా పనులకు నిధుల గ్రహణం వీడటంలేదు. ఇటీవల అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల పనులను ప్రతిపాదించారు. కిటికీలు, తలుపుల మరమ్మతు, విద్యుత్తు ఆధునికీకరించడం వంటి పనులు చేస్తున్నారు. స్వశక్తి సంఘాల మహిళలకు నిర్వహణ బాధ్యతలు ఇచ్చారు. మరో ఇరవై రోజుల్లో సెలవులు ముగియడంతో గడువులోపు పనుల ప్రగతి ప్రశ్నార్థకంగా మారింది.


అసంపూర్తి నిర్మాణాలతో అవస్థలు

ధర్మారం : సాయంపేట ప్రాథమిక పాఠశాలలో రెండు తరగతి గదులు శిథిలస్థితికి చేరడంతో వాటి నిర్మాణానికి మన ఊరు- మన బడి కార్యక్రమంలో రూ. 27 లక్షలు మంజూరయ్యాయి. ఇక్కడ 30 మంది విద్యార్థులుండగా ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. ఉపాధిహామీ పథకంలో మరుగుదొడ్లకు రూ.13.60 లక్షలు, ప్రహరీకి రూ.12.55 లక్షలు, వంటగదికి రూ.4.50 లక్షలు మంజూరయ్యాయి. ప్రహరీ, తరగతి గదులు పూర్తికావచ్చాయి. తరగతి గదుల్లో విద్యుద్దీకరణ, తలుపులు, ఫ్లోరింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. చేసిన పనులకు బిల్లులు కాక పనులు నిలిచిపోయాయి.


పునర్నిర్మాణం చేపట్టినా ఫలితం లేదు

గోపాల్‌పూర్‌లో అసంపూర్తిగా పెద్ద ఓదాల పాఠశాల భవన నిర్మాణాలు

మంథని గ్రామీణం : మండల వ్యాప్తంగా 59 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 50 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా మరమ్మతు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు-మన బడి పథకం ద్వారా గోపాల్‌పూర్‌లో ఎంపీపీఎస్‌(పెద్ద ఓదాల) పాఠశాలను పూర్తిగా తొలగించారు. పునర్‌ నిర్మాణం చేపట్టినా, నేటికి అసంపూర్తి నిర్మాణంతో వెక్కిరిస్తుంది. ఈ పాఠశాల నిర్మాణానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పథకం వర్తింపజేయకపోవడంతో నిర్మాణం నిలిచిపోయింది.


శిథిలావస్థలో మడిపల్లి పాఠశాల

కాల్వశ్రీరాంపూర్‌: మడిపల్లి ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. పాఠశాల పైకప్పు పెచ్చులూడుతోంది. వర్షాకాలంలో వర్షపు నీరు స్లాబ్, గోడ నుంచి రావడంతో భవన నిర్మాణం దెబ్బతింటోంది. చలికాలం, ఎండాకాలంలో పరిస్థితిలు కాస్త మెరుగ్గా ఉన్నా వర్షాకాలంలో మాత్రం విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 28 మంది విద్యార్థులున్నారు. పాఠశాలకు ప్రహరీ నిర్మాణం లేదు.


వర్షాకాలంలో ఇబ్బందులే

రాజాపూర్‌ ప్రాథమిక పాఠశాల 

కమాన్‌పూర్‌ : కమాన్‌పూర్‌ మండలం గుండారం పరిధి రాజాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో 42 మంది విద్యార్థులు ఉన్నారు. శిథిలమైన రెండు గదుల్లోనే ఇక్కడ బోధన చేస్తున్నారు. రహదారి కంటే పాఠశాల కిందకు ఉండటంతో వర్షాకాలంలో వరద తరగతి గదుల్లోకి వస్తోంది. వర్షాలకు గదుల పైపెచ్చులు రాలిపడుతున్నాయి. సమీపంలో మరో భవనం ఉన్నా వినియోగంలోకి తీసుకురావడం లేదు. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా మొదటి విడతలో రూ.లక్షతో తాగునీటి, ఫ్లోరింగ్‌ వంటి పనులు చేస్తున్నారు.


నిధులు కేటాయించాం

జిల్లాలో ప్రతి పాఠశాలలో తాగునీరు, విద్యుత్తు, చిన్న చిన్న మరమ్మతు పనులు చేస్తున్నాం. మన ఊరు-మన బడిలో చాలా పాఠశాలల్లో పూర్తి చేశాం. ఎన్నికల కోడ్‌ ఉండటంతో బిల్లుల చెల్లింపులో కొంత జాప్యం ఉంది. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలకు నిధులు కేటాయించారు. 

మాధవి, జిల్లా విద్యాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని