logo

అధ్వాన రోడ్లు.. తప్పని అవస్థలు

కోరుట్ల పట్టణంలోని సిమెంట్‌రోడ్లు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారాయి.

Published : 21 May 2024 02:58 IST

ఇందిరారోడ్‌లో దెబ్బతిన్న సిమెంట్‌రోడ్‌

న్యూస్‌టుడే, కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని సిమెంట్‌రోడ్లు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారాయి. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన సీసీరోడ్లు కావడం, మూడేళ్ల క్రితం మిషన్‌ భగీరథ ప్రధాన పైపులైన్, ఇంటింటికి కుళాయిల ఏర్పాటు కోసం రోడ్లను తవ్వారు. పైపులైన్‌ నిర్మాణం తర్వాత సిమెంట్‌రోడ్లకు మరమ్మతు చేయకుండా వదిలేశారు. పట్టణంలోని 28, 29వ వార్డుల్లో అత్యంత రద్దీగల ఇందిరారోడ్, టిచర్స్‌క్లబ్‌రోడ్, ప్రసాద్‌ సెలక్షన్‌రోడ్‌లు పూర్తిగా చెడిపోయాయి. ఈరోడ్లలో బ్యాంక్‌లు, వస్త్ర వ్యాపారం, స్టీల్‌ దుకాణాలు, ఆసుపత్రులు, ఏజెన్సీలు, ఇలా అన్ని రకాల దుకాణ సముదాయాలున్నాయి. కూరగాయల మార్కెట్‌కు, పట్టణంలోని చాలా కాలనీలకు వెళ్లే ప్రధాన దారులు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. దెబ్బతిన్న రోడ్లపై వాహనాలు వెళ్లడం ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి.
చాలా ఏళ్ల కిందట నిర్మించిన కాలువలు దెబ్బతిని అందులో మురుగు నీరు ముందుకు సాగక వారాల తరబడి నిల్వ చేరి దుర్గంధం వ్యాపిస్తోంది. దారులకు అడ్డుగా ఉన్న మురుగు కాలువల మరమ్మతుల సమయంలో సమాంతరం పాటించకుండా ఇష్టం వచ్చినట్లు ఎత్తులో నిర్మించడంతో వాహనాల రాకపోకలకు ఇక్కట్లు తలెత్తుతున్నాయి. పట్టణంలో వ్యాపారానికి నిలమయమైన కాలనీలో నూతన సిమెంట్‌రోడ్లు నిర్మించాలని బల్దియా అధికారులకు, పాలకులకు ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా పట్టించునే వారే కరవయ్యారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాలువలో నిలిచిన మురుగు


అదుపు తప్పి ప్రమాదాలు

సిమెంట్‌రోడ్లు దెబ్బతినడంతో ద్విచక్ర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నూతనంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని బల్దియా పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోడ్లపై వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. 

బెజ్జారపు హరికృష్ణ, మెకానిక్‌


రద్దీ ఎక్కువగా ఉంటుంది..

చాలా ఏళ్ల కిందట నిర్మించిన సిమెంట్‌రోడ్లు కావడంతో పూర్తిగా చెడిపోయాయి. నూతన సీసీరోడ్ల నిర్మాణం చేపట్టి వాహనాల, ప్రజల రాకపోకలకు ఇక్కట్లు లేకుండా చూడాలి. వ్యాపార సముదాయాలు, దుకాణాలు, కూరగాయల మార్కెట్‌కు వెళ్లే దారులు కావడంతో నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలనీలు కావడంతో బల్దియాకు పన్నుల రూపకంగా అధిక ఆదాయం సమకూరుతుంది. 

అల్లె ధనుంజయ్, విశ్రాంత ఉద్యోగి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని