logo

సకాలంలో అందేనా!

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఇప్పటికే పలు పథకాలలో భాగస్వామ్యం చేయగా ప్రస్తుతం ఏకరూప దుస్తుల తయారీ బాధ్యతలను అప్పగించారు.

Published : 21 May 2024 02:59 IST

మహిళా సంఘాలకు ఏకరూప దుస్తుల తయారీ బాధ్యతలు

ఏకరూప దుస్తుల తయారీపై అవగాహన కల్పిస్తున్న అధికారులు 

న్యూస్‌టుడే, సారంగాపూర్‌: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఇప్పటికే పలు పథకాలలో భాగస్వామ్యం చేయగా ప్రస్తుతం ఏకరూప దుస్తుల తయారీ బాధ్యతలను అప్పగించారు. ఇటీవల ప్రభుత్వం మహిళలకు వడ్డీలేకుండా రూ.కోటి రుణాలు అందిస్తామని ప్రకటించడమే కాకుండా అన్ని శాఖల దుస్తుల తయారీ, ప్రభుత్వ పాఠశాలల ఏకరూప దుస్తుల తయారీ చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్, కస్తూర్బా, ఆదర్శ తదితర పాఠశాలలు దాదాపు 853 వరకు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో చదివే బాలబాలికలకు ప్రభుత్వం ఏకరూప దుస్తులను పంపిణీ చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 72 కేంద్రాలను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసి 1,61,763 ఏకరూప దుస్తుల తయారీకి అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా వచ్చేనెల 11లోపు దుస్తుల తయారీ పూర్తి చేయాలని భావిస్తున్నప్పటికీ వస్త్రం ఆదివారం జిల్లాకు చేరుకోవడంతో మహిళా సంఘాలపై ఒత్తిడి పెరిగే అవకాశముందని వాపోతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభానికి విద్యార్థులకు అందుతాయా? లేదా? అని ప్రశ్నార్థకంగా మారింది. కుట్టు కేంద్రాలలో అధికారులు పర్యవేక్షణ పెంచి తయారీని వేగవంతం చేయాల్సిన అవసరముంది.  

జిల్లాలో 72 కేంద్రాల్లో..

జిల్లాలో 380 గ్రామాలతోపాటు జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌ పురపాలికలు ఉన్నాయి. వీటికి అనుగుణంగా డీఆర్డీవో, మెప్మా ఆధ్వర్యంలో 1417 మంది స్వశక్తి మహిళలతో 72 కుట్టు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలలో 840 కుట్టు యంత్రాలను అందుబాటులో ఉంచారు. ఇందులో పంచాయతీలలో 67 కేంద్రాలను ఏర్పాటు చేసి 988 మంది స్వశక్తి మహిళలను ఎంపిక చేసి 1,20,822 ఏకరూప దుస్తులు, మున్సిపల్‌ పరిధిలో అయిదు కేంద్రాలను ఏర్పాటు చేసి 429 మందితో 40,941 దుస్తులను తయారీ చేయనున్నారు. గత ఏప్రిల్‌లో సెలవులు రాక ముందే స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాట్లు చేశారు. గతంలో ఏజెన్సీ, స్థానిక దర్జీలకు దుస్తులు కుట్టే అవకాశం కల్పించగా ప్రస్తుతం పూర్తిగా స్వశక్తి సంఘాల మహిళలకే కేటాయించారు. కుట్టిన వస్త్రానికి కేవలం రూ.50 చొప్పున మాత్రమే చెల్లించేందుకు నిర్దేశించడంతో గిట్టుబాటు అవ్వడం కష్టంగా ఉందని మహిళలు వాపోతున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో స్వశక్తి సంఘాల్లోని మహిళలను అమ్మ ఆదర్శ కమిటీలలో సభ్యులుగా చేర్చడంతో ప్రభుత్వ పాఠశాలల్లో మహిళల భాగస్వామ్యం పెరనుందని భావిస్తున్నారు.

కుట్టు కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు

పాఠశాలల ప్రారంభానికి ముందే..

వస్త్రం అందించడంలో ఆలస్యం కావడంతో ముందుగా ఒక జత అందించేందుకు ప్రతి మండలంలో రెండు నుంచి నాలుగు కుట్టు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏటా ప్రభుత్వం ఏడాదికి రెండు జతల చొప్పున విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందిస్తున్నారు. ముందుగా ఒక జత అందించేందుకు మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించడమే కాకుండా ఎంఈవో, డీఆర్డీవో, ఏపీఎంలతోపాటు 64 మంది సీసీ క్లస్టర్ల పరిధిలో కుట్టు కేంద్రాలను పర్యవేక్షిస్తూ వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏటా అందించే ఏకరూప దుస్తులలో నాణ్యత ఉండకపోవడమే కాకుండా చిన్నపిల్లలకు పెద్ద సైజులో, పెద్ద వారికి చిన్న సైజులో అందించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుండేవారు. ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల పర్యవేక్షణ పెంచి, ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాలలు ప్రారంభానికి ముందే అందించేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఒక జత అందించేలా చర్యలు

జిల్లా వ్యాప్తంగా సెర్ప్‌ ద్వారా 67, మెప్మా ద్వారా అయిదు కేంద్రాలను ఏర్పాటు చేసి, స్వయం సహాయక సంఘాల ద్వారా ఏకరూప దుస్తుల తయారీకి చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం జిల్లాకు వస్త్రం చేరుకోవడంతో కుట్టు పనులు ప్రారంభించి, ముందుగా ఒక జత అందించేలా ప్రణాళిక తయారు చేశాం.

మల్లేశం, డీపీఎం, జగిత్యాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు