logo

పొదుపు పద్దులో అక్రమాలకు అడ్డుకట్ట

స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీలో పారదర్శకత పాటించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) అవసరమైన చర్యలు తీసుకుంటోంది.

Updated : 21 May 2024 05:26 IST

గ్రామైక్య సంఘాల రుణాల పంపిణీపై ఆరా
లెక్కలు తేల్చే పనిలో ఆడిట్‌ సిబ్బంది

సుల్తానాబాద్‌లో దస్త్రాలను పరిశీలిస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీలో పారదర్శకత పాటించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) అవసరమైన చర్యలు తీసుకుంటోంది. మహిళా సాధికారతకు వినియోగించే ప్రతి పైసాకు లెక్క చూపేందుకు కార్యాచరణ చేపట్టింది.

అతివల పొదుపు ప్రాతిపదికన బ్యాంకర్లు లింకేజీ రుణాలు మంజూరు చేస్తున్నారు. సభ్యులు వాటిని నెల వారీ కిస్తుల రూపంలో తిరిగి చెల్లిస్తున్నారు. లింకేజీతో పాటు స్త్రీనిధి, గ్రామైక్య, మండల సమాఖ్యల నుంచి కూడా మహిళలు రుణాలు పొందుతున్నారు. బ్యాంకు లింకేజీ రుణాల విషయంలో పెద్దగా సమస్య లేదు. గ్రామైక్య, స్త్రీనిధి రుణాలకు మాత్రం ప్రతి సంవత్సరం ఆడిట్‌ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన ఆడిటర్లు దస్త్రాలతో కుస్తీ పడుతున్నారు. ఈ నెలాఖరులోగా శత శాతం ఆడిట్‌ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

నెలాఖరులోగా పూర్తికి ఆదేశాలు

గ్రామైక్య సంఘాల రుణాల పంపిణీపై ఆడిటర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రతి వీవోకు అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి ఉంటారు. క్షేత్ర స్థాయిలో వీవోఏ(విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌) ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో దస్త్రాలను నమోదు చేస్తున్నారు. కొన్ని చోట్ల వీవోఏలు, సంఘాల కార్యవర్గ సభ్యులతో కుమ్మక్కై సొమ్ము స్వాహా పర్వానికి పాల్పడుతున్నారు. దీంతో సంఘాల నగదు నిల్వ, జమ, ఖర్చులపై ఆడిటర్లు ఆరా తీస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ పరిశీలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 61 మండల సమాఖ్య, 1,955 గ్రామైక్య సంఘాల పరిధిలో 49,448 స్వశక్తి సంఘాల లావాదేవీలు నిర్వహిస్తున్నారు. నెలాఖరులోపు ఆడిట్‌ నివేదికలు పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయి. కాగా ఆడిట్‌ ప్రక్రియపై ఎండల తీవ్రత ప్రభావం చూపింది. దస్త్రాల తనిఖీల్లో వ్యత్యాసం ఉంటే ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. అవకతవకలు తేలితే బాధ్యుల నుంచి సొమ్ము రికవరీ చేయాల్సి ఉంటుంది.

ప్రతి పైసాకూ లెక్క

స్వశక్తి సంఘాల మహిళలు పొదుపులో ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి ఆర్థిక అభ్యున్నతికి మండల, గ్రామైక్య సంఘాలు కూడా రుణాలు ఇస్తున్నాయి. పలు చోట్ల నిధులు పక్కదారి పడుతున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకు లింకేజీ రుణాలను నెలవారీగా సంఘం ఖాతాలో జమ చేస్తుండటంతో అక్రమాలకు అవకాశం ఉండదు. మండల సమాఖ్య, గ్రామైక్య సంఘాలకు సంబంధించి డబ్బులు జమ, విడుదల ప్రక్రియలో తప్పులు చోటుచేసుకుంటున్నాయి. వెచ్చించే ప్రతి పైసా వృథా కాకుండా ఆడిటర్లను నియమించి లెక్కలు తీస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామైక్య సంఘాల దస్త్రాలు మండలకేంద్రానికి తెప్పించుకొని ఒకే చోట పరిశీలిస్తూ, లోపాలను గుర్తిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని