logo

గుర్తింపు సరే.. నిధులు ఏవీ?

జిల్లాలో నాణ్యత ప్రమాణాలు, వైద్య సేవలు బాగున్న ఆరోగ్య కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహకాలు అందజేస్తోంది.

Published : 21 May 2024 03:05 IST

ఎన్‌క్వాస్‌ ఆసుపత్రుల ఎదురుచూపులు

మానకొండూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రమిది. ఇది 2022 మే నెలలో ఎన్‌క్వాస్‌కు ఎంపికైంది. రెండేళ్లు కావస్తున్నా కేంద్రం ప్రకటించిన నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. నాణ్యత ప్రమాణాలు మెరుగుపడాల్సి ఉంది.

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం: జిల్లాలో నాణ్యత ప్రమాణాలు, వైద్య సేవలు బాగున్న ఆరోగ్య కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహకాలు అందజేస్తోంది. ఆ నిధులతో ఆసుపత్రుల పనితీరును మరింత మెరుగుపరుస్తారు. కానీ రావాల్సిన ప్రోత్సాహకాలు ఏటా విడుదల కాకపోతే ప్రమాణాలు ఎలా మెరుగు పడుతాయనేది గుర్తించడం లేదు. ఇదిలా ఉండగా.. మళ్లీ కొత్త ఆసుపత్రుల ఎంపికకు కసరత్తు చేయడం గమనార్హం. మరిన్ని వివరాలతో కథనం.

కేంద్ర బృందం పరిశీలించి..

ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యత ప్రమాణాలతో వైద్య సేవలు అందించడం, అవసరమైన మందులు నిల్వలు, రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం వంటి ఎనిమిది విభాగాలను పరిశీలించి నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్స్‌(ఎన్‌క్వాస్‌)కు ఎంపిక చేస్తారు. కేంద్ర బృందం వచ్చి ఈ అంశాలను పరిశీలన జరిపి, ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపికైన వాటికి మూడేళ్లపాటు ఏటా నిధులు విడుదల చేస్తారు. కానీ రెండేళ్లుగా నిధులు రావడం లేదు. ఆయా ఆసుపత్రుల పరిధిలో వీటిని ఖర్చు చేస్తారు.

రామడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రమిది. 2021లో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎన్‌క్వాస్‌కు ఎంపికైంది. దీనికి   రావాల్సిన ప్రోత్సాహక నిధులు నేటికీ రాలేదు.

ప్రోత్సాహకాలు ఇలా..

  • ప్రతి ఆరోగ్య కేంద్రానికి ఏడాదికి రూ.3 లక్షల చొప్పున మూడేళ్లలో రూ.9 లక్షలు కేటాయిస్తారు.
  • పట్టణ ఆరోగ్య కేంద్రానికి ఏటా రూ.2 లక్షలు, మూడేళ్లకు రూ.6 లక్షలు ఇస్తారు.
  • పల్లె దవాఖానాలు, సబ్‌సెంటర్లకు ఏటా రూ.1.50 లక్షల చొప్పున రూ.4.50 లక్షలు మంజూరు చేస్తారు.

జిల్లాలో అర్హత సాధించిన ఆసుపత్రులు..

  • 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు: రామడుగు(డిసెంబరు 2021), చల్లూరు(ఏప్రిల్‌ 2022), గంగాధర(ఏప్రిల్‌ 2022), శంకరపట్నం(జనవరి 2023), మానకొండూర్‌ (మే 2022), కొత్తపల్లి (డిసెంబరు 2022), గుండి (ఏప్రిల్‌ 2023), తిమ్మాపూర్‌(ఆగస్టు 2023).
  • 7 సబ్‌సెంటర్లు, పల్లె దవాఖానాలు: ఎలబాక, దుర్శేడ్‌(సెప్టెంబరు 2023), కొండ పలకల, ములకనూర్‌ (నవంబర్‌ 2023), జమ్మికుంట-2(అక్టోబరు 2023), బూరుగుపల్లి(మార్చి 2024), అన్నారం (ఫిబ్రవరి 2024)కేంద్రాలు ఉన్నాయి.
  • పట్టణ ఆరోగ్య కేంద్రాలు: కరీంనగర్‌లోని మోతాజ్‌ఖాన(జూన్‌ 22), బుట్టిరాజరాంకాలనీ(ఫిబ్రవరి 23) ఆరోగ్య కేంద్రాలు ఎంపికయ్యాయి.
  • వీటిలో గంగాధర, చల్లూరు, శంకరపట్నం, బుట్టిరాజరాంకాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రానికి మాత్రమే ప్రోత్సాహక నిధులు వచ్చాయి. మిగతా వాటికి రాలేదు.
  • ఎంపిక కోసం ముస్తాబు : వీణవంక, చిగురుమామిడి, చామన్‌పల్లి ఆరోగ్య కేంద్రాలు, ఎరడపల్లి, గన్నేరువరం, గర్షకుర్తి పల్లె దవాఖానాలు ఎన్‌క్వాస్‌ ఎంపికకు ముస్తాబవుతున్నాయి.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

జిల్లాలో ఎన్‌క్వాస్‌కు ఎంపికైన ఆసుపత్రులకు రావాల్సిన ప్రోత్సాహకాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. కొన్నింటికి విడుదల చేశారు. మిగిలిన వాటికి నిధుల విడుదలయ్యే అవకాశముంది. వీటితో సంబంధం లేకుండా కొత్త ఆసుపత్రుల ఎంపిక కోసం చర్యలు చేపట్టాం.

డాక్టర్‌ సుజాత, డీఎంహెచ్‌వో, కరీంనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని