logo

ప్రాదేశిక సమరంపై సందిగ్ధత

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగియగా ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది. మరోవైపు స్థానిక సమరంలో కీలకమైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడంతో ప్రస్తుతం అందరి దృష్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పడింది.

Updated : 21 May 2024 05:24 IST

జులై 4తో ముగియనున్న సభ్యుల కాలపరిమితి
ఎన్నికల ఏర్పాట్లపై యంత్రాంగానికి అందని ఆదేశాలు
ఈనాడు, కరీంనగర్‌

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగియగా ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది. మరోవైపు స్థానిక సమరంలో కీలకమైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడంతో ప్రస్తుతం అందరి దృష్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పడింది. మరో నెలన్నర రోజుల్లో ప్రస్తుత సభ్యుల పదవీ కాలం గడువు ముగియనుండగా ఇప్పటివరకు ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల విషయంలో జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది.

అయిదేళ్ల కిందట ప్రాదేశిక ఎన్నికల సమయంలో దాదాపు మూడు నెలల ముందు నుంచే ఉమ్మడి జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు కనిపించాయి. ఈసారి పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కాగా ఇటీవల అధికారులు ముందస్తు ఏర్పాటు ప్రక్రియలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సహా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో అవసరమైన విధి విధానాలపై దృష్టి సారించారు. ఇదే సమయంలో జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులకు సంబంధించి మాత్రం ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. ప్రస్తుత ప్రజాప్రతినిధుల కాలపరిమితి ముగిసిన తర్వాతే ఎన్నికల తంతు ప్రారంభం కానుంది. అదే జరిగితే మండల, జిల్లా పరిషత్తులూ ప్రత్యేక అధికారుల పాలనలోకి వస్తాయి.

నాడు రెండు నెలల తర్వాతే బాధ్యతలు

ప్రాదేశిక నియోజకవర్గాల ప్రస్తుత పాలకవర్గాల కాలపరిమితి జులై 4తో ముగియనుంది. 2019లో మే నెలలోనే పోలింగ్‌ పూర్తి చేయగా, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు జులై 5న ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఏర్పాటైన మండలాల్లోనూ జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఎన్నికయ్యారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించింది. అయితే మే నెలలోనే సార్వత్రిక ఎన్నికల ఫలితాలుండటంతో గెలిచిన వారు బాధ్యతలు చేపట్టేందుకు సమయం తీసుకోవాల్సి వచ్చింది.

పాత రిజర్వేషన్ల వర్తింపుపై ఉత్కంఠ

జులైలో ఎన్నికలు నిర్వహించాలంటే ఈపాటికే జిల్లాల్లో ఓటరు ముసాయిదా జాబితాలు సిద్ధం చేయడంతో పాటు పోలింగ్‌ బూత్‌ల ఎంపిక, సామగ్రి సమకూర్చుకోవడం తదితర ప్రక్రియకు సంబంధించి సిద్ధమవ్వాల్సి ఉంది. కాగా ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో మరో మూడు నెలల పాటు ప్రాదేశిక పోరు ఉండదనేది స్పష్టమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను వరుసగా నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ పంచాయతీ ఎన్నికల నిర్వహణకే మూడు విడతల సమయం పడుతుంది. వాటి తరువాత ప్రాదేశిక పోరు నిర్వహించాలన్నా ఏర్పాట్లకు ఇప్పటి నుంచే సన్నద్ధమవ్వాలి. మరోవైపు రిజర్వేషన్ల ఖరారులోనూ స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పాటు బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించడం, కొత్త మండలాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు మార్చాల్సి ఉండటంతో సందిగ్ధం నెలకొంది. గత ప్రభుత్వం మాత్రం పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం రిజర్వేషన్లు రెండు పర్యాయాలు వర్తిస్తాయని చెప్పడంతో ఈసారి నిర్ణయంపై ఆశావహ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని