logo

పొదుపు చేద్దాం.. గృహజ్యోతిని వెలిగిద్దాం

నగరానికి చెందిన గౌతం కుటుంబం ఏప్రిల్‌లో 202 యూనిట్ల విద్యుత్తును వినియోగించుకోవడంతో గృహజ్యోతి పథకం వర్తించలేదు. దీంతో రూ.1100లకు పైగా బిల్లు చెల్లించాల్సి వచ్చింది.

Updated : 23 May 2024 05:41 IST

విద్యుత్తు ఆదాపై దృష్టి అవసరం
న్యూస్‌టుడే,  భగత్‌నగర్‌

నగరానికి చెందిన గౌతం కుటుంబం ఏప్రిల్‌లో 202 యూనిట్ల విద్యుత్తును వినియోగించుకోవడంతో గృహజ్యోతి పథకం వర్తించలేదు. దీంతో రూ.1100లకు పైగా బిల్లు చెల్లించాల్సి వచ్చింది.

గృహజ్యోతి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్లు.. ఆ లోపు విద్యుత్తు వాడిన గృహ వినియోగదారులకు జీరో బిల్లు అవకాశం ఇస్తోంది. ఒక్క యూనిట్‌ ఎక్కువైనా ఈ పథకం వర్తించదు. పై ఘటనలో వినియోగదారుడు రెండు యూనిట్లు అదనంగా వాడుకోవడంతో రూ.1100 ఖర్చు చేయాల్సి వచ్చింది. అవగాహన లేక.. ఆపై వేసవికావడంతో ఇష్టారీతిగా విద్యుత్తు వినియోగిస్తూ జీరో బిల్లుకు దూరమవుతున్నారు. దీనికి అర్హత పొందాలంటే విద్యుత్తు పొదుపు చేయడమే మార్గం. అటు కాలుష్యాన్ని తగ్గించిన వారవుతారూ.. ఇటు ఆర్థిక భారం తగ్గుతుంది.

తగ్గిన లబ్ధిదారులు

వేసవి కావడంతో ప్రజలు ఏసీలు, కూలర్లు ఎక్కువగా వినియోగించడంతో విద్యుత్తు బిల్లు పెరిగి పథకానికి దూరమవుతున్నారు. గత నెలలో 1,34,554 మంది వినియోగదారులకు జీరో బిల్లు వస్తే.. ఈ నెలలో 1,28,921 మందికే వచ్చింది. అంటే 5,633 మంది వినియోగదారులు పథకం రాయితీకి దూరమయ్యారు.

ఇలా చేస్తే మేలు..

  •  ప్రజలు పాతకాలం నాటి ఫ్లోరోసెంట్‌ బల్బులు వాడటంతో కరెంట్‌ వినియోగం పెరుగుతుంది. వీటికి బదులు ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లను  వినియోగించడం మేలు. వీటితో విద్యుత్తును పొదుపు చేయొచ్చు. ఫ్లోరోసెంట్‌ బల్బుల సామర్థ్యం 40 వాట్స్‌ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగే అవకాశముంది.
  • ఏసీలు మైనస్‌ 24 నుంచి 29 డిగ్రీల మధ్య ఉపయోగిస్తే చల్లదనంతోపాటు బిల్లు ఆదా అవుతుంది. ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెంచినా ఆరు శాతం విద్యుత్తు వినియోగం పెరిగే అవకాశముంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఇన్‌వర్టర్‌తో కూడిన ఏసీలు లభిస్తున్నాయి. ఇవి గది చల్లబడగానే ఆటోమెటిక్‌గా ఆఫ్‌ అవుతాయి. సాధారణ ఏసీలు పునః ప్రారంభమయ్యే సమయంలో భారం పడుతుంది. ఇది విద్యుత్తు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇన్‌వర్టర్స్‌తో కూడిన ఏసీలతో ఈ ఇబ్బంది తొలిగి కొంత విద్యుత్తు పొదుపు అయ్యే అవకాశముంది.
  • సీజన్‌ మేరకు ఫ్రీజ్‌లో ఫ్రీజర్‌ దశలు మార్చుతూ ఉండాలి. వేసవిలో ఎక్కువ ఉంచినా మిగిలిన కాలాల్లో తగ్గించుకోవాలి. మంచు పొరలు పావు వంతు పెరిగినట్లు గమనిస్తే వెంటనే డిఫ్రోస్ట్‌ అనే ఆప్షన్‌ ద్వారా తొలగించాలి.
  • ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఎల్‌ఈడీ బల్బులు, రిఫ్రిజిరేటర్లు తదితర విద్యుత్తు గృహోపకరణాలు బీఈఈ రేటింగ్‌ 1 నుంచి 6 స్టార్లతో విక్రయిస్తున్నారు. వీటిల్లో 5 స్టార్‌ అంతకు మించి ఉంటే విద్యుత్తు వినియోగం గణనీయంగా తగ్గుతూ బిల్లు ఆదా అవుతుంది. కంప్యూటర్లు, టీవీలు, ఫ్యాన్లు అవసరంలేని సమయంలో స్విచ్ఛాఫ్‌ చేయాలి. ఛార్జింగ్‌ పూర్తయ్యాక ప్లగ్‌ నుంచి ఛార్జర్‌ను తొలగించాలి.

స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తులు

గృహజ్యోతి పథకానికి వినియోగదారులు వారి నివాస ప్రాంతం పరిధిలోని ప్రభుత్వ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. నగర పాలక, పురపాలక సంస్థలు, ఎంపీడీవో కార్యాలయం దేని పరిధిలో నివాసముంటే అక్కడ దరఖాస్తు చేయొచ్చు.

వడ్లకొండ గంగాధర్, ఎస్‌ఈ, కరీంనగర్‌ సర్కిల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని