logo

ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలేవీ?

ఏటా వర్షాకాలంలో జగిత్యాల పట్టణంలోని దిగువ ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. కాలనీల్లో పురపాలక నిబంధనలకు విరుద్ధంగా ఏర్పడుతున్న నూతన భవనాలు, సెట్‌బ్యాక్‌ లేకపోవడంతోపాటు రహదారులు ఇరుకుగా మారడంతో వరదనీరు మురుగు కలిసి దిగువ ప్రాంతాల్లోని కాలనీలను చుట్టేస్తున్నాయి.

Published : 25 May 2024 02:03 IST

వెంకటాద్రినగర్‌లో గతేడాది వరద  

న్యూస్‌టుడే, జగిత్యాల పట్టణం: ఏటా వర్షాకాలంలో జగిత్యాల పట్టణంలోని దిగువ ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. కాలనీల్లో పురపాలక నిబంధనలకు విరుద్ధంగా ఏర్పడుతున్న నూతన భవనాలు, సెట్‌బ్యాక్‌ లేకపోవడంతోపాటు రహదారులు ఇరుకుగా మారడంతో వరదనీరు మురుగు కలిసి దిగువ ప్రాంతాల్లోని కాలనీలను చుట్టేస్తున్నాయి. పురపాలక అధికారులు ముందస్తు చర్యలపై పూర్తిస్థాయిలో ప్రణాళిక చేపట్టకపోవడంతో ముంపునకు గురయ్యే కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి వేసవిలోనూ పలువురు ప్రజాప్రతినిధులు పురపాలక అధికారులకు ఫిర్యాదు చేసినా ముంపు సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఈసారి వేసవి ముగియకముందే వర్షాలు కురుస్తున్నాయి. చిన్నవానకే పలుకాలనీల్లోని కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాకాలానికి ముందే ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఎత్తయిన వంతెన నిర్మించాలి

గట్ల సాయికృష్ణ, వెంకటాద్రినగర్‌

వెంకటాద్రినగర్‌ కాలనీలో వానోస్తే చాలు వరద ఉప్పొంగి రోడ్లను ముంచెత్తుతోంది. రెండు వైపులా రాకపోకలు నిలిచిపోయి నిత్యావసరాలకు సైతం ఇబ్బంది పడాల్సి వస్తోంది. వర్షాల సమయంలో వచ్చే ప్రజాప్రతినిధులు చర్యలు చేపడతామని హామీ ఇచ్చి ఆ తరువాత ఇటువైపు రావడంలేదు. ఎత్తయిన వంతెన నిర్మించాలి.

శాశ్వత పరిష్కారం అవసరం

పిప్పరి రజనీకాంత్, సార్గమ్మవీధి

వర్షాకాలంలో చిన్నపాటి వానకే పట్టణంలో ముందుగా మునిగిపోయే కాలనీ సార్గమ్మవీధి. ఎగువ భాగంలో రోడ్డు ఉండటం కింది భాగంలో కాలనీ ఉండటంతో కొత్తబస్టాండు నుంచి వచ్చే వరదనీరంతా మా వీధిని ముంచెత్తుతోంది. వర్షాకాలంలో మా వ్యాపారాలు సజావుగా సాగడంలేదు. పురపాలక అధికారులు శాశ్వత చర్యలు చేపడితే బాగుంటుంది.

సమస్య ప్రాంతాలివే..

  • స్థానిక వెంకటాద్రినగర్‌లో ఏటా నూతన నిర్మాణాల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ వాగు అవతల కాలనీలు పెరిగినా మౌలిక సదుపాయాలు విస్తరించలేదు. వర్షాకాలంలో వాగుతోపాటు వరదనీరు కాలనీని ముంచెత్తుతోంది. రాకపోకలు స్తంభించిపోతున్నాయి. వరదతోపాటు వచ్చిన వ్యర్థాలతో దుర్గంధం వ్యాపిస్తోందని స్థానికులు చెబుతున్నారు.

సరస్వతీనగర్, మహాలక్ష్మీనగర్, నాగేంద్రకాలనీ తదితర ప్రాంతాల్లోనూ వర్షాకాలం వచ్చిందంటే స్థానికులు ఆందోళన చెందాల్సి వస్తోంది. వ్యర్థాలతో కూడిన వరద¢ జనావాసాల్లోకి చేరడంతో దోమలు, ఇతరత్రా వ్యాధులు పొంచి ఉంటున్నాయని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. వరదనీరు వెళ్లినా వారం పదిరోజులపాటు వ్యర్థాలు తొలగించడంలేదని స్థానికులు వాపోతున్నారు.

  • గడియారం సార్గమ్మవీధి చిన్నవానకే ఇళ్లు, దుకాణాల్లోకి నీరు చేరి స్థానికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయిదారు అడుగుల మేరకు వరద ప్రవాహం కాలనీని జలమయం చేస్తోంది. పుర అధికారులు తాత్కాలిక మరమ్మతు చేపట్టి వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

చిన్నవానకే ఇళ్లలోకి నీరు

అల్లె హరీశ్‌కుమార్, సరస్వతీనగర్‌

చిన్నవానకే సరస్వతీనగర్‌ జలమయమవుతోంది. అన్ని వీధుల్లోనూ వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎత్తులో ఉన్న బైపాస్‌రోడ్డు నీరు, నాలా నీరు కలిసి ఇళ్లలోకి చేరుతాయి. వారంరోజులైనా పురపాలక సిబ్బంది చెత్త తొలగిస్తూనే ఉంటారు. ఎక్కడెక్కడో వ్యర్థాలన్నీ వచ్చి మా ఇళ్లలో చేరుతున్నాయి. పుర అధికారులు వేసవిలోనే తగిన చర్యలు చేపట్టాలి.
కాల్వల శుభ్రతకు టెండర్లు పిలిచాం

అనిల్‌బాబు, పుర కమిషనర్‌

పట్టణంలో వరదముంపు ప్రాంతాలపై ముందస్తు చర్యల కోసం మురుగుకాల్వలపై మార్చిలోనే సర్వే నిర్వహించాం. ఇందుకు అనుగుణంగా చిన్న, పెద్ద కాల్వలతోపాటు నాలాలను విభజించి పూడిక తొలగించేందుకు టెండర్లు పిలిచాం. ఇందులో కొన్ని చిన్న కాల్వలను పురపాలక సిబ్బందితో షిఫ్టులవారీగా శుభ్రం చేయించాం. స్తానికులు ఫిర్యాదు చేసినా వెంటనే కాల్వలను శుభ్రం చేయిస్తున్నాం. పెద్ద నాలాలను యంత్రాల సాయంతో తొలగించేందుకు రెండు టెండర్లు పిలిస్తే ఒకటి ఖరారుకాగా మరొక పనికి ఎవరూ ముందుకు రాలేదు. నాలాల శుభ్రతకు పెండింగ్‌ అప్రూవల్‌ ద్వారా రూ.5 లక్షల చొప్పున రెండు పనులకు టెండర్లు చేపట్టాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని