logo

అనుమతి గోరంత... తోడేస్తున్నారు వాగంతా

ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలకు కొన్ని నిబంధనలతో ఇసుక తీతకు రెవెన్యూ అధికారులు అనుమతులిస్తే ఇదే అదనుగా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. మూడు ట్రిప్పులకు అనుమతి పొంది పదికి పైగా ట్రిప్పుల ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు.

Published : 25 May 2024 02:06 IST

ఆగని ఇసుక దందా

మూలవాగులో ఇసుక తీయడంతో ఏర్పడిన గోతులు 

న్యూస్‌టుడే, వేములవాడ : ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలకు కొన్ని నిబంధనలతో ఇసుక తీతకు రెవెన్యూ అధికారులు అనుమతులిస్తే ఇదే అదనుగా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. మూడు ట్రిప్పులకు అనుమతి పొంది పదికి పైగా ట్రిప్పుల ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు. కొందరు ఇసుకను డంప్‌ చేసి జల్లెడ పట్టి సన్నపు ఇసుకను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల నుంచి కొంత మేర అనుమతి పొంది ఏకంగా మూలవాగును తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు ప్రభుత్వ పనుల పేరుతో అనుమతి తీసుకొని ప్రైవేటు భవన నిర్మాణాల వద్ద డంప్‌ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా మారింది.

రెవెన్యూ అధికారులు కొన్ని షరతులు విధించి నిబంధనల ప్రకారం వారంలో మూడు రోజులు ట్రాక్టర్‌కు మూడు ట్రిప్పుల చొప్పున అనుమతి ఇస్తున్నారు. ఇందుకు వాగు వద్ద రెవెన్యూ సిబ్బందిని నియమిస్తున్నారు. వారి కళ్ల ముందే ట్రాక్టర్లు ఎలాంటి అనుమతి లేకుండానే వాగులోంచి ఇసుకను తరలిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులు వస్తున్నారని ముందస్తుగా సమాచారం అందితే అనుమతి పత్రాలు ట్రాక్టర్ల వెంట పెట్టుకుంటున్నారు. లేకుంటే ఇష్టారాజ్యంగా మూలవాగులో ఇసుకను తోడేస్తున్నారు. గతంలో రెండు సార్లు అక్రమార్కులపై రెవెన్యూ అధికారులు కొరడా ఝళిపించినప్పటికీ వారిలో మార్పు రాలేదు. 

భయాందోళనకు గురిచేస్తూ...

ఇసుక అనుమతి పొందిన ట్రాక్టర్లు పట్టణంలోని రహదారులపై వాయువేగంగా పరుగులు తీస్తుంటే ఇతర వాహనదారులు, రోడ్లపై వెళ్లే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూడు ట్రిప్పులకు అనుమతి తీసుకున్న ట్రాక్టర్ల యజమానులు ఎక్కువ ట్రిప్పులు తరలించేందుకు ట్రాక్టర్లను అతి వేగంగా నడిపిస్తూ రహదారులపై దడ పుట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గతంలో ఇసుక ట్రాక్టర్లు అతివేగంగా వెళ్లడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

అనుమతుల్లోనే అక్రమాలు

ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలకు మూలవాగులో ఇసుక తీసుకునేందుకు ఒక ట్రాక్టర్‌ ట్రిప్పునకు రూ.300 డీడీ కట్టి అనుమతి పొందుతున్నారు. అనుమతి పొందుతున్నవారు ఎక్కడ ఏ నిర్మాణం చేస్తున్నారనే వివరాలు లేకుండానే డీడీలు కట్టి ఇసుక తీసుకెళ్తున్నారు. ఏ నిర్మాణానికి ఎంత ఇసుక అవసరమవుతుందనేది ఇంజినీరింగ్‌ అధికారుల నిర్ధారణ పత్రం లేకుండానే అనుమతులు ఇస్తుండటం వారికి వరంగా మారింది. ఇదే వారికి కాసుల వర్షం కురిపిస్తుందనే విమర్శలు  వినిపిస్తున్నాయి. నిర్మాణ పనులకు ఎలాంటి నిర్ధారణ పత్రాలు లేకుండానే డీడీలు చెల్లించిన వారికి ఇసుక తరలింపునకు అనుమతించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇసుక అక్రమ రవాణాలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, గుత్తేదారులు కీలకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక అవసరాల పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్న రెవెన్యూ అధికారులు అది ఎంత వరకు సక్రమమనేది పరిశీలన చేయకపోవడం అక్రమార్కులకు కలిసొస్తుంది.  

అక్రమంగా తరలిస్తే ట్రాక్టరు స్వాధీనం

నాగేంద్రచారి, డీఎస్పీ, వేములవాడ

వేములవాడ డివిజన్‌ పరిధిలో కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను ఎవరు తరలించినా ట్రాక్టర్లను పట్టుకొని సీజ్‌ చేస్తున్నాం. మూలవాగులో ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ప్రాంతాల్లోనే ఇసుక తీయాలి. ఇసుక అక్రమంగా తరలిస్తే ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని