logo

మెరుగైన విద్య.. నాణ్యమైన వైద్యం

వైద్య విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తుండడంతో పాటు సార్వజనిక ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని గోదావరిఖని ప్రభుత్వ వైద్య కళాశాల (సింగరేణి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ప్రిన్సిపల్‌ డాక్టర్‌ హిమబిందుసింగ్‌ అన్నారు.

Updated : 25 May 2024 05:55 IST

వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌  హిమబిందుసింగ్‌

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం: వైద్య విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తుండడంతో పాటు సార్వజనిక ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని గోదావరిఖని ప్రభుత్వ వైద్య కళాశాల (సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ప్రిన్సిపల్‌ డాక్టర్‌ హిమబిందుసింగ్‌ అన్నారు. వైద్య కళాశాలలో ఎం.బి.బి.ఎస్‌. రెండు బ్యాచ్‌లకు ప్రవేశాలు లభించగా మూడో బ్యాచ్‌ అనుమతికి ఇటీవలే జాతీయ వైద్య కమిషన్‌ ‘వర్చువల్‌’ విధానంలో కళాశాల నిర్వహణ తీరును పరిశీలించారన్నారు. త్వరలోనే అనుమతులు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఆమె ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎం.బి.బి.ఎస్‌. ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలుంటాయన్నారు. వైద్య కళాశాల, సార్వజనిక ఆసుపత్రి నిర్వహణ, పురోగతిని ఆమె ‘న్యూస్‌టుడే’ నిర్వహించిన ముఖాముఖిలో వివరించారు.

ప్ర: ‘ఫ్యామిలీ అడాప్షన్‌’ కార్యక్రమం ఎలా సాగుతుంది ?

జ : వైద్య విద్యార్థుల ఫ్యామిలీ అడాప్షన్‌ కార్యక్రమం నిరంతరంగా సాగుతోంది. ఒక్కో విద్యార్థి గ్రామీణ ప్రాంతాల్లోని అయిదు కుటుంబాలను దత్తత తీసుకొని ఎం.బి.బి.ఎస్‌. పూర్తయ్యేంత వరకు వారికి మెరుగైన వైద్య సేవలకు చర్యలు తీసుకుంటారు. పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో విద్యార్థులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ ఆయా ప్రాంతాల్లో వస్తున్న వ్యాధులు, నివారణకు ఆయా వైద్యులు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేస్తున్నారు. వైద్య పరిశోధనలో కీలకమైన ‘ఎథిక్స్‌ కమిటీ’ని ఇటీవలే రూపొందించాం. తద్వారా వారిలో పరిశోధన శక్తి పెరగడంతో పాటు వైద్య రంగంలో మరింత మెరుగైన ఫలితాలు వెలువడనున్నాయి.

ప్ర : మెరుగైన వైద్య సేవలకు తీసుకుంటున్న  చర్యలేమిటి ? 

జ : ఆసుపత్రిలో దశలవారీగా వైద్య సేవలు మెరుగుపడుతున్నాయి. వివిధ విభాగాల్లో శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ.ఎన్‌.టి. శస్త్ర చికిత్సలు మొదలుపెట్టాం. నేత్ర శస్త్ర చికిత్సల కోసం ఆపరేషన్‌ థియేటర్‌ సిద్ధం చేస్తున్నాం. చర్మ వ్యాధుల చికిత్సకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. కార్పొరేట్ తరహాలో అత్యాధునిక లేబరేటరీలో వివిధ రకాల పరీక్షలు చేస్తున్నాం. న్యూరాలజీ, యూరాలజీ సేవలందిస్తున్నాం. గుండె వ్యాధులకు సంబంధించిన వైద్య సేవలను మొదలు పెట్టాల్సి ఉంది. ఇందుకోసం ఆసుపత్రిలో క్యాథల్యాబ్‌ ఏర్పాటుకు ఉన్నతాధికారులకు నివేదించాం.

ప్రశ్న : కళాశాలలో విద్యార్థుల పురోగతి ఎలా ఉంది ?

జవాబు : ఎం.బి.బి.ఎస్‌. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 300 మంది విద్యార్థులున్నారు. విద్యతో పాటు వివిధ రంగాల్లో వారికి మెరుగైన బోధన అందిస్తున్నాం. ఇటీవలే జాతీయ వైద్య కమిషన్‌ పరిశీలన పూర్తికావడంతో త్వరలోనే రానున్న విద్యా సంవత్సరంలో ఎం.బి.బి.ఎస్‌. ప్రవేశాలకు అనుమతులు రానున్నాయి. మొదటి సంవత్సరం కొంత ఇబ్బంది పడినా కొద్ది రోజుల్లోనే సర్దుకొని ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. క్రీడల్లోనూ రాష్ట్ర స్థాయి బహుమతులను అందుకున్నారు. 

ప్ర : విద్యార్థుల్లో మనోధైర్యాన్ని పెంచేందుకు ఏం చేస్తున్నారు ?

జ : విద్యార్థుల్లో మనోధైర్యాన్ని పెంచుతూ కుంగుబాటుతనం నుంచి తప్పించేందుకు ‘మెంటార్‌’ కార్యక్రమం చేపడుతున్నాం. కళాశాలలోని ఒక్కో ఆచార్యుడు అయిదేసి విద్యార్థులను దత్తత తీసుకొని గార్డియన్‌గా వ్యవహరిస్తారు. ఎప్పటికప్పుడు ఆయా విద్యార్థులతో చర్చిస్తూ, బాగోగులు చూసుకుంటూ ప్రోత్సహిస్తుంటారు. ర్యాగింగ్‌నకు పాల్పడితే ఎలాంటి శిక్షలుంటాయో అవగాహన కలిగిస్తున్నాం.

ప్ర : సమయపాలనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?

జ : సమయపాలన కోసం బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాం. అక్కడక్కడ అక్రమాలకు పాల్పడ్డ వారిని విధుల్లోంచి తొలగించాం. ఇటీవల నర్సింగ్‌ సిబ్బంది వేతనాల స్థిరీకరణ కోసం వసూళ్లు చేస్తున్నట్లుగా దృష్టికి రాగానే వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆదేశించాం. వేతనాల స్థిరీకరణకు హైదరాబాద్‌ వెళ్లాల్సి వస్తే ఖర్చులను ఆసుపత్రి భరిస్తుందని చెప్పాం. సమయపాలన పాటించకుండా వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు