logo

సర్కారు బడుల్లో సాంకేతిక సేవలు

ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక సేవలకు పెద్దపీట వేస్తున్నారు. ఆధునిక విద్యా బోధనకు ప్రాధాన్యమిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల బోగస్‌ హాజరుకు చెక్‌ పెట్టేందుకు ముఖ గుర్తింపు(ఫేషియల్‌ రికగ్నయిజ్డ్‌ అటెండెన్స్‌), యూడైస్‌ విద్యా సమాచారం, డిజిటల్‌ తరగతులు, పాఠశాలల అభివృద్ధి నిధుల వివరాల నమోదులో పారదర్శకత పెంచారు.

Updated : 25 May 2024 05:53 IST

ఈ ఏడాది నుంచి ముఖ గుర్తింపు హాజరు విధానం
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ట్యాబ్‌లు, సిమ్‌లు పంపిణీ

మంథని మండలం గద్దలపల్లి ఉపాధ్యాయుడికి సిమ్‌తో కూడిన ట్యాబ్‌ అందజేస్తున్న అధికారి

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక సేవలకు పెద్దపీట వేస్తున్నారు. ఆధునిక విద్యా బోధనకు ప్రాధాన్యమిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల బోగస్‌ హాజరుకు చెక్‌ పెట్టేందుకు ముఖ గుర్తింపు(ఫేషియల్‌ రికగ్నయిజ్డ్‌ అటెండెన్స్‌), యూడైస్‌ విద్యా సమాచారం, డిజిటల్‌ తరగతులు, పాఠశాలల అభివృద్ధి నిధుల వివరాల నమోదులో పారదర్శకత పెంచారు. ఇందుకోసం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో గతేడాది ట్యాబ్‌లు సరఫరా చేయగా ఇటీవల వాటి నిర్వహణకు కొత్త సిమ్‌ కార్డులు అందజేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని సేవలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం కానున్నాయి. అంతర్జాల సమస్య తొలగడంతో సాంకేతిక పరికరాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రానున్నాయి. 

డిజిటల్‌ బోధనకు మార్గం

సమగ్ర శిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 393 ట్యాబ్‌లు, సిమ్‌కార్డులు పంపిణీ చేశారు. సర్కారు బడుల్లో సాంకేతిక విద్యా బోధనకు ప్రత్యేక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ‘మన ఊరు-మన బడి’లో ఎంపికైన పాఠశాలల్లో డిజిటల్‌ తెరలతో బోధన సాగుతోంది. కొన్ని చోట్ల అంతర్జాల సమస్య ఎదురవడంతో డిజిటల్‌ తరగతుల నిర్వహణ సక్రమంగా అమలు కావడం లేదు. మరికొన్ని చోట్ల పరికరాలు అలంకారప్రాయంగానే ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సమస్య ఇబ్బందికరంగా మారింది. ఎట్టకేలకు ట్యాబ్‌లకు సిమ్‌కార్డులు రావడంతో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లయింది. పాఠ్యాంశాలకు సంబంధించి లోతైన విజ్ఞానం విద్యార్థులకు అందనుంది. ప్రయోగ పాఠాలపై పట్టు సాధించనున్నారు. 

అన్ని వివరాలూ ఆన్‌లైనే..

ప్రభుత్వ పాఠశాలల్లో చేతిరాతతో వివరాల నమోదుకు కాలం చెల్లింది. యూడైస్, విద్యా కార్యక్రమాల వివరాలు, విద్యాశాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తొలిమెట్టు, ఉన్నతి సామర్థ్యాల నివేదికలు, మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల సంఖ్య, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, బడిబాట, నిర్వహణ నిధులు తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయనున్నారు. వీటితో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల ముఖ గుర్తింపు హాజరును పకడ్బందీగా అమలు చేయనున్నారు. గతేడాది చాలా చోట్ల విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు అమలు చేసినప్పటికీ కొన్ని చోట్ల ఆచరణకు నోచుకోలేదు. వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తప్పనిసరిగా ముఖ గుర్తింపు హాజరు అమలు చేసేందుకు ట్యాబ్‌లకు సిమ్‌ కార్డులు అందజేశారు. 

పకడ్బందీగా అమలు చేస్తాం

జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ సేవల అమలు కోసం ట్యాబ్‌లు, సిమ్‌ కార్డులను పంపిణీ చేశాం. విద్యా నివేదికలు, హాజరు ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం కానున్నాయి.

మాధవి, జిల్లా విద్యాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని