logo

సీఎంఆర్‌ నిబంధనలు కఠినతరం

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) విధానంపై ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. డిఫాల్టర్లు (బకాయిదారులు)గా గుర్తించిన మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి చేస్తూ పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్‌ చౌహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 25 May 2024 05:52 IST

డిఫాల్టర్లకు బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి
లేకుంటే ధాన్యం కేటాయించొద్దని  ప్రభుత్వం ఉత్తర్వులు 

న్యూస్‌టుడే, హుజూరాబాద్‌: కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) విధానంపై ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. డిఫాల్టర్లు (బకాయిదారులు)గా గుర్తించిన మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి చేస్తూ పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్‌ చౌహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ధాన్యం కేటాయించవద్దని స్పష్టం చేశారు. అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. గతంలో మాదిరిగా ఇష్టారీతిన మిల్లులకు ధాన్యం కేటాయించకుండా కట్టడి చేశారు. తాజా నిబంధనలకు అనుగుణంగానే సీఎంఆర్‌ ధాన్యం కేటాయింపులు జరపాలని స్పష్టం చేశారు.

బకాయిల వసూలే లక్ష్యంగా.. 

సీఎంఆర్‌ కింద కేటాయించిన ధాన్యాన్ని మరాడించి తిరిగి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా మిల్లర్లు తప్పించుకుంటున్నారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని పక్కదారిపట్టించి సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రభుత్వ విచారణలో వెల్లడి కావడంతో చర్యలకు ఉపక్రమించింది. ఉమ్మడి జిల్లాలో 2022-23 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి సీఎంఆర్‌ కింద 24.89 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయించారు. వానాకాలం సీఎంఆర్‌ సేకరణ లక్ష్యం పూర్తయినా యాసంగికి సంబంధించి గడువులోగా మరాడించిన బియ్యాన్ని తిరిగివ్వలేదు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో మార్చిలో మిల్లర్ల వద్ద 8.63 లక్షల ధాన్యంలో 60 శాతం వేలం ద్వారా విక్రయించారు. ఒక్క కరీంనగర్‌ జిల్లాలోనే 1.94 లక్షల ధాన్యాన్ని వేలం వేశారు. ఉమ్మడి జిల్లాలో అనేకమంది మిల్లర్లు సీజన్ల వారీగా బకాయిపడటంతో డిఫాల్టర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎంఆర్‌ ధాన్యాన్ని పక్కదారి పట్టించి బియ్యం తిరిగివ్వని కారణంగా వందకు పైగానే మంది మిల్లర్లను డిఫాల్టర్లుగా గుర్తించినట్లు తెలిసింది. ప్రతీ సీజన్‌లో పలుమార్లు గడువులు పొడిగించినా సీఎంఆర్‌ సేకరణ లక్ష్యం పూర్తి కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం జిల్లాల వారీగా మిల్లర్ల బకాయిల వివరాలను తెప్పించుకొని 25 శాతం జరిమానాతో సీఎంఆర్‌ను వసూలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 60 రోజుల్లోగా బకాయిలు వసూలు చేయాలని, గడువులోగా ఇవ్వని మిల్లర్లపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ రికవరీ(ఆర్‌ఆర్‌) చట్టాన్ని ప్రయోగించడం వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

తాజా విధానంతో లొసుగులకు కళ్లెం

ప్రస్తుతం 2023-24 యాసంగి సీజన్‌కు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 1,310 కేంద్రాల్లో 15.65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించేలా పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్‌ కింద మిల్లర్లకు కేటాయిస్తున్నారు. కానీ గత సీజన్లలో బకాయిపడిన మిల్లర్లకు సీఎంఆర్‌ ధాన్యం కేటాయిస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. పైగా కొందరు మిల్లర్లకు అత్యధికంగా ధాన్యం కేటాయించడం, నిల్వ చేసే స్థలం లేని మిల్లులకు, మిల్లింగ్‌ సామర్థ్యం లేని మిల్లులకు సీఎంఆర్‌ కేటాయిస్తున్నట్లు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. బడా మిల్లర్లు కొందరు నడపకుండా మూలనపడిన, వివిధ కారణాలతో ఆగిన మిల్లులను లీజుకు తీసుకొని ధాన్యం కేటాయింపులు జరిపేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపనలున్నాయి. ప్రధానంగా డిఫాల్టర్లకు సీఎంఆర్‌ ధాన్యం కేటాయించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. వంద శాతం సీఎంఆర్‌ బకాయిలు ఇచ్చిన మిల్లర్లకే ఎలాంటి షరతులు లేకుండా యాసంగి సీజన్‌ సీఎంఆర్‌ కేటాయింపులు జరపాలని తాజాగా పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్‌ చౌహాన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2019-20 నుంచి 2022-2023 వరకు మొదటిసారి డిఫాల్టర్‌గా ఉన్న మిల్లర్లకు సీఎంఆర్‌ ధాన్యం కేటాయించవచ్చని స్పష్టం చేశారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు డిఫాల్టర్లుగా గుర్తించిన మిల్లర్లు పెండింగ్‌ బకాయిలతో కలిపి అదనంగా 25 శాతం జరిమానా (125 శాతం)తో బ్యాంకు గ్యారంటీ తీసుకోవడంతో పాటు జిల్లా రైస్‌ మిలర్స్‌ అసోసియేషన్‌తో పాటు మరో ఇద్దరు మిల్లర్ల ద్వారా హామీ పత్రం సమర్పించాలని ఆదేశించారు. బ్యాంకు గ్యారంటీ ఇవ్వని డిఫాల్టర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంఆర్‌ ధాన్యం కేటాయించవద్దని, ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 2024 లోగా పెండింగ్‌ బకాయిలను నూరు శాతం వసూలు చేయాలని, గడువులోగా ఇవ్వని మిల్లర్ల (డిఫాల్టర్లు) బ్యాంకు గ్యారంటీ జప్తు చేయాలని స్పష్టం చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు