logo

వృత్తి నైపుణ్యం.. మార్కెటింగ్‌ వ్యూహం

ఒకప్పుడు జిల్లాలో ఉత్పత్తి అయ్యే కాటన్‌ వస్త్రాలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉండేది. ప్రభుత్వ ఆర్డర్ల కేటాయింపులు, వాటిలోనూ పూర్తిగా పాలిస్టర్‌వి కావడంతో తొమ్మిదేళ్లు కాటన్‌ పరిశ్రమ కుదేలైంది.

Published : 25 May 2024 02:21 IST

సొంతంగా ఆర్డర్లు తెచ్చుకుంటున్న నేతన్నలు

మరమగ్గాలపై దోమ తెరల ఉత్పత్తులు

ఈనాడు డిజిటల్, సిరిసిల్ల : ఒకప్పుడు జిల్లాలో ఉత్పత్తి అయ్యే కాటన్‌ వస్త్రాలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉండేది. ప్రభుత్వ ఆర్డర్ల కేటాయింపులు, వాటిలోనూ పూర్తిగా పాలిస్టర్‌వి కావడంతో తొమ్మిదేళ్లు కాటన్‌ పరిశ్రమ కుదేలైంది. ఎప్పుడూ ఒకే రకమైన వస్త్రోత్పత్తులతో రాష్ట్రంలో సిరిసిల్లకు ప్రైవేటు మార్కెట్‌ తగ్గింది. పరోక్షంగా వస్త్రపరిశ్రమలో సంక్షోభం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో చేనేత జౌళిశాఖ ఉత్పత్తి వైవిధ్యాన్ని (ప్రొడక్ట్‌ డైవర్సిఫికేషన్‌) ప్రోత్సహించేలా నిపుణులతో అధ్యయనం చేయించి, అందుకు అవసరమైన ప్రత్యామ్నాయాలు సూచించాలి. కానీ ఈ పద్ధతి చేనేతలోనే ఉంది. మరమగ్గాల్లో లేదు. దీంతో జిల్లా నేతన్నలు ప్రైవేటు ఉత్పత్తులతో ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. మార్కెట్‌లో డిమాండ్, వస్త్రోత్పత్తుల్లో నైపుణ్యంతో ఇప్పటికే ముఫ్పై శాతం మంది సొంత ఉత్పత్తులను ప్రారంభించారు.

పేరుతో నేసిన కండువా 

ప్రభుత్వ ఆర్డర్ల కోసం అయిదు నెలలుగా ఆసాములు, కార్మికుల ఎదురుచూపులతోనే కాలం కరిగిపోయింది. తొమ్మిదేళ్లలో మరమగ్గాలకు డాబీ, జకార్డులు అమర్చుకోవడంతోపాటు వాటితో వివిధ రకాల డిజైన్లతో ఉత్పత్తి చేయడం నేర్చుకున్నారు. ఆ నైపుణ్యమే ఇప్పుడు ప్రైవేటు ఆర్డర్లతో కొంత మేరకు ఆదుకుంటోంది. తువాళ్లు, చేతిరుమాళ్లు, లుంగీలు, దోమతెరలు, కండువాలు, టెంటుకు ఉపయోగించే వస్త్రం వంటి తదితర ఆర్డర్లు వస్తున్నాయి. వీటిలో కొందరు సొంతంగా వస్త్రోత్పత్తులు తయారు చేసుకుని చుట్టుపక్కల జిల్లాల్లో మార్కెట్లకు వెళ్లి విక్రయాలు చేస్తున్నారు. స్థానిక ఉత్పత్తులకు తోడు మహారాష్ట్ర, సూరత్, చెన్నైల నుంచి కాటన్, పాలిస్టర్‌ ఆర్డర్లు వస్తున్నాయి. రెండు నెలలుగా జిల్లా పరిశ్రమలో 30 శాతం పరిశ్రమ వర్గాలు సొంత మార్కెటింగ్‌ వైపు వెళ్లడంతో ఆసాములు, కార్మికుల జీవనం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ఇంకా సగానికిపైగా ఆసాములు, కార్మికులకు ఉపాధి లేక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

నవీకరణతోనే మనుగడ

ప్రభుత్వ ఆర్డర్లు అనేవి ఎప్పుడూ ఉంటాయనే నమ్మకంతో ఉంటే ఇబ్బందులు తప్పవని ముందే గ్రహించాను. నాకున్న 12 సాంచాలపై ఎలాంటి ఉత్పత్తులనైనా చేసేలా నవీకరణ చేసుకున్నాను. వ్యాపారులు తమకు అవసరమైన కాటన్‌ ఉత్పత్తుల ఆర్డర్లు ఇస్తున్నారు. వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా నాణ్యతతో వస్త్రాలు ఉత్పత్తి చేసి ఇస్తున్నాను. నాతోపాటు మరో ముగ్గురు కార్మికులు ఉపాధి పొందుతున్నారు. 

మారుతి, ఆసామి, పద్మనగర్, సిరిసిల్ల

ముడి సరకుతో ఆసాములకు ఉపాధి

నేను వరుసగా నాలుగేళ్లు బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేశాను. ప్రభుత్వ ఆర్డర్లు జనవరిలోనే రావాల్సి ఉండేది. వాటికోసం వేచిచూడకుండా ముడి సరకు తెచ్చుకుని సొంతంగా ఉత్పత్తి చేయడం మొదలు పెట్టాను. ఇలా ఉత్పత్తి చేసిన వాటిని కరీంనగర్, వరంగల్‌ మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయిస్తున్నాను. అక్కడి ఉత్పత్తులకు భిన్నంగా చేయాలనే ఆలోచనతో నాతో పాటు మరో పదిహేను మంది ఆసాములకు ముడిసరకు ఇచ్చి వస్త్రోత్పత్తులు నేయిస్తున్నాను. ఇప్పటికే దాదాపు 70 మగ్గాలపై 30 మంది కార్మికులకు నాలుగు నెలలుగా ఉపాధి లభిస్తుంది.

వంగ రవీందర్, ఆసామి,జేపీనగర్, సిరిసిల్ల

వచ్చిన పని చేయడం ఉత్తమం

- తొర్ర రవి, కార్మికుడు, రాజీవ్‌నగర్‌

నేను పని చేస్తున్న కార్ఖానాలో మా యజమాని ప్రైవేటు ఆర్డర్లు తీసుకొచ్చారు. వాటితో మూడు నెలలుగా ఉపాధి పొందుతున్నాను. బతుకమ్మ చీరల ఉత్పత్తిలో రోజుకు సుమారు రూ.900 వరకు కూలి గిట్టుబాటు అయ్యేది. ఈ ఉత్పత్తులతో రూ.600 వరకు లభిస్తుంది. ప్రభుత్వ ఆర్డర్ల కోసం వేచిచూడటం కన్నా ఇదే నయం. నాతో పాటు పని చేసే చాలా మంది కార్మికులు నెలల తరబడి పని లేక ఖాళీగా ఉన్నారు. 

దోమతెరల ఆర్డర్లు వస్తున్నాయి

ప్రభుత్వ ఆర్డర్లనే పూర్తిగా నమ్ముకుంటే ఎప్పుడో ఒకసారి పస్తులు తప్పవని ముందే గ్రహించాను. మా యజమాని మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దోమతెరల ఆర్డర్లు తీసుకొచ్చి ఇస్తుంటారు. ఆరు మగ్గాలపై నేను, నా భార్య ఇద్దరం రెండు షిప్టుల్లో ఉత్పత్తి చేస్తాం. ఏడాదిలో రెండు నెలలు కొద్దిగా తక్కువ ఉంటుంది. రెండు సంవత్సరాలుగా నిరంతరాయంగా పని లభిస్తోంది.

- ఎనుగుల లక్ష్మణ్, ఆసామి, రాజీవ్‌నగర్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు