logo

పంచాయతీలకు నిధుల లేమి!

నిధుల లేమితో గ్రామపంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. అభివృద్ధి పనులు, మరమ్మతులకు ఆటంకంగా మారుతోంది. సర్పంచుల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 2తో ముగిసిపోగా నాలుగు నెలలుగా ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది.

Updated : 25 May 2024 05:50 IST

అభివృద్ధి పనులు, మరమ్మతులకు ఆటంకం

మానకొండూర్‌లో రోడ్డు పక్కన చెత్త  

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కలెక్టరేట్‌: నిధుల లేమితో గ్రామపంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. అభివృద్ధి పనులు, మరమ్మతులకు ఆటంకంగా మారుతోంది. సర్పంచుల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 2తో ముగిసిపోగా నాలుగు నెలలుగా ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. వీరి పాలనకు ముందే పంచాయతీ ఖాతాలు ఖాళీ అయ్యాయి. సర్కారు నుంచి కొన్ని నెలలుగా నిధులు జమ కాకపోవటంతో పాలన మొక్కుబడిగా సాగుతోంది. కొందరు గ్రామ కార్యదర్శులు అక్కడక్కడా జేబు నుంచి పెట్టి చిన్నచిన్న పనులను లాక్కొస్తున్నారు. రానున్న వర్షాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే ప్రజలు జబ్బుల బారిన పడే అవకాశముంది.

చేతులెత్తేసిన ప్రత్యేకాధికారులు..

పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, పైపుల లీకేజీకి మరమ్మతు, బోర్ల మరమ్మతు పనులు పంచాయతీ ట్రాక్టర్‌ నెలవారి బ్యాంకు వాయిదా, గ్రామంలో విద్యుద్దీపాలు, నెలనెలా విద్యుత్తు బకాయిలు.. ఇవ్వన్నీ కచ్చితంగా చెల్లించాల్సిందే. ఈ బరువు బాధ్యతల గురించి ప్రత్యేక అధికారులు చేతులెత్తేసే తరహాలో ఉండటంతో గ్రామ కార్యదర్శులే భుజాన వేసుకొని వారికి వచ్చే జీతంలో కొద్దో, గొప్పో కార్మికులకు సగం సగం జీతం సర్దుబాటు చేస్తున్నట్లు కరీంనగర్‌ గ్రామీణ మండలంలోని ఓ గ్రామ కార్యదర్శి ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికే ఒక్కో గ్రామ పంచాయతీ రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు అప్పు చేసి ఖర్చు చేసినట్లు సమాచారం. పంచాయతీల ప్రత్యేకాధికారులు ఖర్చుల విషయంలో చేతులెత్తేస్తుండటంతో భారమంతా కార్యదర్శులపైనే పడుతోంది. నాలుగు రోజులు ఉండి పోయే వాళ్లమని ప్రత్యేక అధికారులు దాట వేస్తున్నారని పలువురు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఖాతాలు ఖాళీ..

గ్రామ పంచాయతీకి మూడు రకాల ఖాతాలు ఉంటాయి. ఒకటి ఆస్తి పన్ను జమ చేసుకునే ఖాతా... గ్రామాల్లో ఆస్తి పన్ను వసూలు అంతంత మాత్రంగా జరగటం, ఖర్చులు నాలుగింతలు ఉండటంతో ఇది ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. రెండో ఖాతా ఎస్‌ఎఫ్‌సీ (స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌) ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు జమ చేస్తారు. ఈ రెండు ఖాతాల్లో జమయ్యే మొత్తం ట్రెజరీ ద్వారా డ్రా చేయాల్సి ఉంటుంది. కానీ గత సర్కారు హయాంలో ఎస్‌ఎఫ్‌సీ నిధులు అరకొర మంజూరుతోనే సరిపెట్టింది. మూడో ఖాతా.. 15వ ఆర్థిక సంఘం నిధులు ఇందులో జమ అవుతాయి. కేంద్ర సర్కారు నేరుగా పంచాయతీలకు గ్రామ జనాభా ప్రాతిపదికన జమ చేస్తుంది. ప్రతి నాలుగు నెలలకోసారి వీటిని అందజేస్తోంది. కేవలం ఈ నిధులు మాత్రమే పంచాయతీలకు అందుతుండటం.. వీటిని ప్రత్యేక పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు ఖర్చు చేయని నిధులు ఆయా ఖాతాల్లో మిగిలిపోగా మార్చిలో వాటిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.

నేటికీ బిల్లులు చెల్లించలేదు

పంచాయతీల పాలక మండలి గడువుకు ముందే అధికారుల ఒత్తిడితో పలు అభివృద్ధి పనులు చేశాం. వాటి బిల్లులు నేటికీ అందలేదు. ట్రాక్టర్‌ బ్యాంకు రుణ వాయిదాలు, డీజిల్‌ బిల్లులు చాలా పంచాయతీలు చెల్లించలేదు.

జక్కం నర్సయ్య, మాజీ సర్పంచి, మొగ్దుంపూర్, కరీంనగర్‌ గ్రామీణం 

త్వరలో సమస్య పరిష్కారం

క్షేత్రస్థాయిలో కొంత సమస్య ఉన్న వాట వాస్తవమే. ఏడాదిన్నరగా ఎస్‌ఎఫ్‌సీ నిధులు అందలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ నడుస్తోంది. జూన్‌లో సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. 

రాంబాబు, డీఎల్‌పీవో, కరీంనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని