logo

అక్రమాల ఆట.. కాసుల వేట!

కరీంనగర్‌లోని ఓ క్రీడా దుకాణానికి ఇద్దరు వ్యక్తులు ఇలా క్యారమ్‌ బోర్డులను మెట్లెక్కి తీసుకెళ్తున్నారు. జిల్లా యువజన, క్రీడల కార్యాలయానికి సంబంధించిన వీటిని దొడ్డిదారిన అందులోని సిబ్బంది విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Published : 25 May 2024 02:33 IST

చేయని పనికి వేతనం
పక్కదారి పడుతున్న సామగ్రి?

కరీంనగర్‌లోని ఓ క్రీడా దుకాణానికి ఇద్దరు వ్యక్తులు ఇలా క్యారమ్‌ బోర్డులను మెట్లెక్కి తీసుకెళ్తున్నారు. జిల్లా యువజన, క్రీడల కార్యాలయానికి సంబంధించిన వీటిని దొడ్డిదారిన అందులోని సిబ్బంది విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుకాణంలో నుంచి కొనుక్కొచ్చే వారు కిందకు దిగుతూ వస్తారు. కానీ వీరు అందుకు భిన్నంగా పైకి తీసుకెళ్తున్నారు. పైగా క్రీడాశాఖకు సంబంధించిన సామగ్రి ఎన్నడూ ఇలా ఒక్కోటి వచ్చిన దాఖలాలు లేవు. కొటేషన్‌ ఇచ్చిన దుకాణం నుంచే నేరుగా ప్యాకింగ్‌ రూపంలో సామగ్రి కార్యాలయానికి వస్తుంది. ఈ చిత్రంలో కనిపిస్తున్నదాన్ని బట్టి క్యారమ్‌ బోర్డులు విక్రయానికి తీసుకెళ్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

హాజరు రిజిస్టర్‌లో సగం రోజులే పనిచేసిన ఆధారాలిలా.. 

జిల్లా యువజన, క్రీడల కార్యాలయంతోపాటు అంబేడ్కర్‌ మైదానంలో స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఊడ్చేందుకు కొన్నాళ్ల కిందట ఓ వ్యక్తిని విధుల్లోకి తీసుకున్నారు. ఆయన మార్చి నెలలో కేవలం 10 రోజులు మాత్రమే విధుల్ని నిర్వర్తించారు. వేతనం మాత్రం నెల రోజులకు రూ.7,800లు చెల్లించారు. ఇలా పూర్తి వేతనం ఇచ్చినందుకుగానూ ఆయనకు కార్యాలయం సిబ్బంది ఒకరు ఫోన్‌ చేసి సగం డబ్బులను తన బ్యాంక్‌ ఖాతాకు మళ్లించాలని డిమాండ్‌ చేయడం, ఆ ఉద్యోగి రూ.3 వేలు మాత్రమే చెల్లిస్తానన్న ఆడియో బయటకు వచ్చింది.

ఈనాడు, కరీంనగర్‌: జిల్లా క్రీడా శాఖలో రోజుకో వివాదం ఆ శాఖ ప్రతిష్ఠను దిగజారుస్తోంది. క్రీడాకారుల భవిష్యత్తుకన్నా.. తమకేంటి లాభమనే పంథాతో కొందరు వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖకు మచ్చ తెస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉంటుండటం, ఇక్కడ ఏళ్ల తరబడి పనిచేసిన కొందరి ఆధిపత్యమే కొనసాగుతుండటంతో కొన్ని విషయాల్లో వారు ఆడిందే ఆటగా మారిపోయింది. అధికారులు మారుతున్నా.. ఆరోపణలు ఆగడం లేదు. 

అసలేం జరుగుతోంది..?

జిల్లా యువజన, క్రీడల కార్యాలయం పరిధిలో అంబేడ్కర్‌ మైదానంతోపాటు స్విమ్మింగ్‌ ఫూల్, క్రీడా పాఠశాల, క్రీడా మైదానాల నిర్వహణ సహా అప్పుడప్పుడు పలు టోర్నీలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అడపాదడపా వస్తున్న నిధుల వినియోగం విషయంలో తరచూ ఆరోపణలు వస్తున్నాయి. పైగా తాత్కాలిక సిబ్బంది పని చేయకున్నా వారికి పూర్తి వేతనాలు చెల్లిస్తూ నిధులు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గత నెలలో ఓ ఉద్యోగికి చెల్లించిన వేతనంపై రగడ జరుగుతోంది. అవసరమైన క్రీడా సామగ్రిని గతంలో ఒక దుకాణం నుంచే కొన్నారనే ఆరోపణలున్నాయి. ఇదే సమయంలో ఇటీవల నగరంలోని ఓ దుకాణంలో ఇక్కడి క్రీడా పరికరాల్ని అమ్ముకున్నారనే ఆరోపణలు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. గతంలోనూ ఇక్కడ జరిగిన పలు అభివృద్ధి పనుల విషయంలోనూ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. నిధుల ఖర్చు విషయంలోనూ లెక్కాపత్రం సరిగ్గా ఉండటం లేదని ఆరోపణలున్నాయి. కాని కఠిన చర్యలు లేకపోవడంతో కొద్ది రోజులకే మరో వివాదం వస్తోంది. ఉన్నతాధికారులు స్పందించాలని, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. 

విచారణ జరుపుతాం

ఇటీవలే నాకు ఈ విషయాలపై ఫిర్యాదులు అందాయి. తక్షణమే విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాం. క్రీడా దుకాణానికి క్యారమ్స్‌ తీసుకెళ్తున్న వారు మా సిబ్బందిలాగే ఉన్నారు. ఒకవేళ ఏవైనా సామగ్రి బాగాలేకుంటే మార్చడానికి తీసుకెళ్లారా.. కారణమేంటనేది విచారణ చేయిస్తాను. ఇది ఇటీవల జరిగింది కాదు. నేను నెల రోజుల కిందటే బాధ్యతలు చేపట్టాను. సిబ్బంది తక్కువగా ఉండటంతో కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నా.. సేవల పరంగా ఎక్కడ లోటుపాట్లు లేకుండా శ్రద్ధను కనబరుస్తున్నాం. ఇక మీదట పర్యవేక్షణ పెంచుతా. 

శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా యువజన, క్రీడల అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని