logo

కుక్క కాటు బాధితులు ఏటా 25వేలు

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి ఆస్పత్రికి గత నెల రోజుల్లో దాదాపు 127 మంది కుక్క కాటు చికిత్స కోసం వెళ్లారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా గ్రామసింహాల బారిన పడి రోజుకు సగటున 50 నుంచి 100 మంది ప్రభుత్వాసుపత్రుల మెట్లెక్కుతున్నారు. 

Updated : 25 May 2024 05:47 IST

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కేసులు
అందుబాటులో వ్యాక్సిన్‌ 

ఈనాడు, కరీంనగర్‌

  • కరీంనగర్‌ జిల్లా చొప్పదండి ఆస్పత్రికి గత నెల రోజుల్లో దాదాపు 127 మంది కుక్క కాటు చికిత్స కోసం వెళ్లారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా గ్రామసింహాల బారిన పడి రోజుకు సగటున 50 నుంచి 100 మంది ప్రభుత్వాసుపత్రుల మెట్లెక్కుతున్నారు. 
  • గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ నెలాఖరు వరకు 1,316 మంది యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారు. ఈ నెలలో వందకుపైగా కేసులొచ్చాయి. 
  • కరీంనగర్‌ జనరల్‌ ఆసుపత్రిలో 2023లో 2,297 మంది యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. రోజుకు సగటున 76 మంది కుక్క కాటుకు చికిత్స కోసం ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. 
  • జగిత్యాల జిల్లాలో గడిచిన ఏడాది కాలంగా 4,761 మందికి 23,505 యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్లను ఇచ్చారు. కుక్కతోపాటు కోతి, పిల్లి ఇతర జీవాలు కరిచాయని బాధితులు జిల్లాసుపత్రితోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది 2,170 మంది కుక్కకాటుతో, 522 మంది కోతి చేసిన గాయం వల్ల వచ్చి వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 
  • నాలుగు నెలల కిందట గొల్లపల్లి మండలం ఆత్మకూర్‌ గ్రామంలో ఓ చిన్నారిని కుక్క కరవడంతో ఆస్పత్రి పాలైంది. పది రోజులపాటు అక్కడ చికిత్సనందుకుని ఇంటికొచ్చిన తరువాత చనిపోయింది. ఇది జరిగిన వారం రోజుల వ్యవధిలోనే దమ్మన్నపేటలో ఓ వృద్ధురాలిని కరవడంతో ఆమె కూడా చికిత్స అనంతరం ప్రాణాలు కోల్పోయింది. 

వ్యాక్సిన్‌ 

అవగాహన కల్పిస్తూ..

 జిల్లా, ప్రాంతీయ, ప్రాథమిక, బస్తీ, పల్లె దవాఖానాల్లో యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్లు సమృద్ధిగానే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కేసులు ఏ ఆస్పత్రి పరిధిలో ఎక్కువగా వస్తున్నాయో.. అక్కడ వీటిని అందుబాటులో ఉంచారు. ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహనను కల్పిస్తున్నారు. దీంతో ఆస్పత్రులకు వెళ్లి నిర్ణీత డోసులను తీసుకుంటుండటంతో చాలా మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి కుక్క కాటు ప్రమాదకరంగా మారి ప్రాణాల్ని బలిగొంటోంది. వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నా.. కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో ఏడాదికి అయిదారు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. 

ఆస్పత్రులకు వరుస.. 

ఉమ్మడి జిల్లాలో కుక్కకాట్లు పెరుగుతుండటంతో జనం ఆస్పత్రుల బాట పడుతున్నారు. దీంతో యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ వినియోగమూ పెరుగుతోంది. ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో సగటున 10 నుంచి 40 మందిని ఒకటే కుక్క కరిచిన ఉదంతాలు ఉంటున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కుక్క కాటు వల్ల వచ్చే రేబిస్‌ వ్యాధితో సంభవిస్తున్న మరణాల జాబితాలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో ఉంది. ఇదే తరహాలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇలాంటి మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. సగటున ఏడాదికి 20వేల మంది వరకు కుక్క కాటుకు సంబంధించిన చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారి సంఖ్య దాదాపుగా 5 నుంచి 8 వేల వరకుంటుందని అంచనా. అయిదేళ్ల కిందటితో పోలిస్తే బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. శునకాలకు కు.ని. శస్త్రచికిత్సలు మొక్కుబడిగా జరుగుతుండటం వల్ల వాటి సంతతి పెరుగుతోంది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరగకపోవడం వల్ల కరిచిన వారికి ప్రాణాంతకమవుతోంది. పంచాయతీ మొదలు పుర, నగరపాలక సంస్థల్లో శునకాల నియంత్రణ, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను అంతగా పట్టించుకోకపోవడంతో ప్రజలు వీధుల్లో భయం భయంగా నడవాల్సి వస్తోంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని