logo

ఆలయ భూముల చిక్కుముడి వీడేనా?

మంత్రి ఆదేశాలతో అధికారుల కసరత్తున్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం, జగితాల విద్యానగర్‌దేవాదాయ శాఖకు చెందిన భూములు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Published : 28 May 2024 03:38 IST

మంత్రి ఆదేశాలతో అధికారుల కసరత్తు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం, జగితాల విద్యానగర్‌

దేవాదాయ శాఖకు చెందిన భూములు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అన్యాక్రాంతమై భూములను స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాల విభజనతో భూములను గుర్తించడంలో సమస్యలు వస్తున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతం వీటిని గుర్తించే పనిలో పడ్డారు. ఇటీవల రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రెండ్రోజులు అధికారులతో ఆలయ భూములు, రెవెన్యూ, ఆదాయ, వ్యయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కొన్ని చోట్ల వివాదాస్పద భూములపై ట్రిబ్యూనల్, హైకోర్టులలో కేసులు నడుస్తున్నాయి.

ధరణిలో సగమే నమోదు

ధరణి పోర్టల్‌ రాకముందు ఆలయ భూములు.. మిగులు భూములుగా రికార్డుల్లో ఉండేవి. కొని ఆక్రమణదారులు, అర్చకులు, సంరక్షకులు, కౌలుదారులు పేరు మీద కొనసాగుతున్నాయి. ధరణి రావడంతో  గత ప్రభుత్వం సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయించింది. సమస్యాత్మకంగా ఉన్న వాటిల్లో, అధికారులు అందుబాటులో లేకపోవడంతోనో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. ఆలయ భూములన్నీంటికి పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని సమీక్షలో మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమణదారులు, స్వాధీనం చేసుకున్న వారిలో ఆందోళన నెలకొంది. ఉమ్మడి జిల్లాలో దేవాదాయ శాఖ భూములు 3634.65 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 1932.46 ఎకరాలు ఆలయాల పేరు మీద ధరణిలో నమోదు చేశారు. ఇంకా 1702.19 ఎకరాలు నమోదు కావాల్సి ఉంది. 423 ఆలయాల్లో.. 55 ఆలయాలకు చెందిన 572.29 భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయి. ఇంకా 368 ఆలయాలకు చెందిన 3062.36 భూమికి పుస్తకాలు జారీ చేయాల్సి ఉంది.

సాంకేతిక కారణాలే సమస్య..

ఆలయాల పేరు మీద ఉన్న భూమికి పట్టాదారు పాసు పుస్తకం ఎవరి పేరు మీద జారీ చేయాలన్నదే సమస్యగా మారింది. ధరణి పోర్టల్‌ నిబంధనల ప్రకారం ఆధార్‌ ఉంటేనే పాసు పుస్తకం ఇవ్వడం కుదురుతుంది. ఒక వేళ కస్టోడియన్‌గా దేవాదాయ అధికారుల పేరుతో పాసుపుస్తకాలు ఇవ్వాలంటే నిబంధనల మేరకు కుదరదు. అయితే ఆలయాలన్నింటికి పాన్‌ కార్డు ఉంది. ఇది ఆయా ఆలయ బ్యాంకు ఖాతాలతో అనుసంధానమై ఉంటుంది. ఈ అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలించాలని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా పాలనాధికారులకు బాధ్యతలు అప్పగించి భూములకు కస్టోడియన్‌గా వాళ్ల పేరు మీద పాసుపుస్తకం జారీ చేస్తే ఎలా ఉంటుందన్న అంశం కూడా అధికారులు చర్చిస్తున్నారు. ఏది ఏమైనా సాంకేతిక సమస్యలు అధిగమిస్తేనే ఆలయ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసే అవకాశముంది.

విధివిధానాల తర్వాతే..

ఆలయ భూములకు పట్టాదారు పుస్తకాలు జారీ అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాంకేతిక సమస్యలు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది చర్చిస్తోంది. దీనిపై విధివిధానాలు వచ్చిన తర్వాత అన్ని భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసే అవకాశముంది.

 ఆకునూరి చంద్రశేఖర్, అసిస్టెంట్‌ కమిషనర్, ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని