logo

యువత భవితకు దిక్సూచి.. మై భారత్‌

దేశాభివృద్ధిలో కీలకమైన యువత అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖ ‘మన భారత్‌’ పేరిట పోర్టల్‌ అందుబాటులోకి తెచ్చింది.

Updated : 28 May 2024 06:17 IST

విభిన్న రంగాల్లో రాణించేలా ప్రోత్సాహం
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్, కరీంనగర్‌ కలెక్టరేట్‌

దేశాభివృద్ధిలో కీలకమైన యువత అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖ ‘మన భారత్‌’ పేరిట పోర్టల్‌ అందుబాటులోకి తెచ్చింది. 15 ఏళ్ల నుంచి 29 ఏళ్లలోపు యువతీ యువకులను దీనిలో భాగస్వామ్యం చేసింది. ఈ పోర్టల్‌లో చేరిన యువత ఉజ్వల భవితకు బాటలు వేయనుంది. నిరుద్యోగ యువతను అభివృద్ధి వైపు మళ్లించడం, సాధికారత సాధించడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంచేందుకు గతేడాది అక్టోబరు 31న ప్రధాని నరేంద్రమోదీ ఈ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ-లర్నింగ్‌ పోర్టల్‌ ద్వారా వివిధ రకాల అంశాలకు సంబంధించి తర్ఫీదు ఇస్తున్నారు. దేశ వ్యాప్తంగా విద్య, ఉద్యోగ అవకాశాలు, పలు రకాల కోర్సులు, సంబంధిత అంశాలపై ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ వేదికగా నైపుణ్యం సమాచారం లభ్యమవుతోంది.

మై భారత్‌ పోర్టల్‌

ఉద్దేశం ఇదే..

డిగ్రీలు చేతపట్టుకున్న యవత ఉద్యోగ వేటలో అలసిపోతున్నారు. నైపుణ్యం ఉన్నప్పటికీ ప్రోత్సాహకం కరవైంది. ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నా పొందలేకపోతున్నారు. ఆర్థిక స్థోమత లేక పరిశ్రమలు స్థాపించడంలో ఔత్సాహికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేటులో నిలదొక్కుకునేందుకు ‘మన భారత్‌’ పోర్టల్‌ వేదిక కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఇతర ఉన్నత విద్య చదువుతున్న వారి ప్రతిభ ఆధారంగా ఉపాధి పొందేందుకు మార్గనిర్దేశనం చేయనున్నారు.

ఆన్‌లైన్‌లో నమోదు ఇలా..

యువతీ, యువకులు స్వయం ఉపాధికి సాధించిన సమాచారం పొందాలంటే ప్లే స్టోర్‌లోకి వెళ్లి ‘మై భారత్‌’ పోర్టల్‌లో చేరేందుకు లాగీన్‌ కావాలి. పుట్టిన రోజు, నెల, సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, గ్రామం, పట్టణం ఇలా సమాచారం నమోదు చేయాలి. తర్వాత ఈ-మెయిల్‌ ఐడీతో పాటు ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, ఎన్‌వైకే, ఇతరులు ఇలా ఏ కేటగిరిలో ఉన్నారో దాన్ని క్లిక్‌ చేయాలి. 15-29ఏళ్లలోపు యువత దీనిలో సభ్యత్వం తీసుకునే వెసులుబాటు కల్పించారు.

నాలుగు అంశాలతో అనుసంధానం

  •  ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై అవగాహన. వీటిని సద్వినియోగం చేసుకునేందుకు అర్హతలు వివరించనున్నారు.
  •  ఎంచుకున్న రంగంలో ప్రతిభా నైపుణ్యాలు పెంపొందించుకునే అవకాశాలు, నైపుణ్య సాధనకు అందుబాటులో ఉన్న వాటిపై అవగాహన.
  •  సామాజిక బాధ్యతను చేర్చి యువత ఉజ్వల భవితకు బాటలు వేసే సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమాల అమలు.
  •  వ్యాపారంలో రాణించేలా యువతను ప్రోత్సహించడం, వ్యాపారాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రామ్‌ (పీఎంఈజీపీ)లో రాయితీ, ఎలా రుణం పొందాలో దీనిలో ఉంటుంది. వ్యాపార, పారిశ్రామికవేత్తలతోనూ మాట్లాడే అవకాశం కల్పించి, సందేహాలను నివృత్తి చేస్తారు.

ఉపాధి అవకాశాలకు చక్కటి వేదిక

మన భారత్‌ పోర్టల్‌ ప్రయోజనాలపై విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో అవగాహన కల్పిస్తున్నాం. యువకులు సద్వినియోగం చేసుకోవాలి. 15-29 ఏళ్లలోపు యువత ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. విద్యార్హత, ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్య విలువలు అందుబాటులో ఉంటాయి.

 రాంబాబు, ఎన్‌వైకే ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి

పోర్టల్‌ ఉపయుక్తం

ఇటీవల పోర్టల్‌లో పేరు నమోదు చేసుకున్నా. ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలుగా ఎదగటానికి ఇది దోహదపడుతుంది. ఇందులో యువతకు విలువైన సమాచారం అందుబాటులో ఉంది. చదువుతోపాటు సామాజిక అంశాలు నేర్చుకోవచ్చు.

ఎ.పూజిత, బీఎస్సీ, ఎస్సారార్‌ కళాశాల

నాయకత్వ లక్షణాలు..

అధ్యాపకుల సూచనలతో పోర్టల్‌లో చేరా. ఇందులో యువత భవిష్యత్తుకు అవసరమైన ఎన్నో అంశాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ వేదికగా విద్యార్థులు సామాజిక సేవా, నాయకత్వ లక్షణాలు అలవరచుకోవచ్చు.

జి.సుస్మిత, బీకాం, ఎస్సారార్‌ కళాశాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని