logo

రిజర్వాయర్‌ నిర్మించి... కాలువలు విస్మరించి

జలాశయం నిండా నీరున్నా ఆయకట్టుకు అందని పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి ఈ సమస్య కొనసాగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. కర్షకుల కళ్లెదుటే నీరు వృథాగా పోతున్నా ఏమీ చేయలేదని పరిస్థితి ఏర్పడింది.

Published : 28 May 2024 03:37 IST

నీరున్నా దక్కని ఫలితం  
న్యూస్‌టుడే, రుద్రంగి

నాగారం రిజర్వాయర్‌

జలాశయం నిండా నీరున్నా ఆయకట్టుకు అందని పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి ఈ సమస్య కొనసాగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. కర్షకుల కళ్లెదుటే నీరు వృథాగా పోతున్నా ఏమీ చేయలేదని పరిస్థితి ఏర్పడింది. మండల కేంద్రంలో ఎగువన ఉన్న నాగారం చెరువు సామర్థ్యం పెంచడం ద్వారా ఆయకట్టు ప్రాంతం సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో దానిని రిజర్వాయర్‌గా మార్పు చేశారు. ఇది జరిగి దశాబ్దం దాటింది. రిజర్వాయర్‌ దిగువన ఆయకట్టుకు సాగునీరు అందించే డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో సుమారు 2 వేల ఎకరాలకు పైగా భూములకు సాగునీరు అందడం లేదు. దీంతో జలాశయం ఉన్నా ప్రయోజనం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జలాశయంలో నీరు పూర్తి స్థాయిలో నిల్వ ఉన్నా దిగువ ఆయకట్టుకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. దీంతో ఏటా వందల సంఖ్యలో నూతనంగా బావులు, బోరుబావులు తవ్వుతూ అధిక పెట్టుబడులను రైతులు వెచ్చించాల్సి వస్తోంది. కాలువల నిర్మాణానికి భూసేకరణ, నిర్మాణ పనులను పూర్తి చేయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు రిజర్వాయర్‌కు ఇరువైపులా ఏర్పాటు చేసిన తూముల ద్వారా నీటిని దిగువన ఉన్న మత్తడి నీరు వెళ్లే మార్గం నుంచి అయినా విడుదల చేస్తే సమీపంలోని కనీసం 200 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరేది. కానీ తూములను ఎత్తైన ప్రాంతంలో నిర్మించడంతో రిజర్వాయర్‌లో నీరున్నా ఆయకట్టుకు అందించలేని దుస్థితి నెలకొంది.

కుడి వైపు తూము లీకేజీతో...

రిజర్వాయర్‌కు కుడి, ఎడమ వైపు రెండు తూములను ఏర్పాటు చేశారు. గతేడాది వర్షాకాలంలో కుడి వైపు ఉన్న తూము లీకేజీకి గురికావడంతో రిజర్వాయర్‌లోని నీరు వృథాగా దిగువకు వెళ్లిపోయింది. దీంతో కొద్ది రోజుల్లోనే నీటి మట్టం తగ్గిపోయింది. ఈ తూముకు మరమ్మతులు చేస్తే కనీసం ఈ వర్షాకాలంలో అయినా నీరు వృథా కాకుండా ఉంటుంది.

మోటార్ల ఏర్పాటుతో...

మండల కేంద్రంలోని రైతులు వానాకాలం, యాసంగి సీజన్‌ల్లో ఎక్కువగా వరి పండిస్తారు. ఆ తర్వాత మొక్కజొన్న, పసుపు, కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇస్తారు. వరి పండించే రైతులు అధికంగా బావులు, బోరుబావులపై ఆధారపడి సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో రిజర్వాయర్‌లోని నీరు పంటలకు అందించే డిస్ట్రిబ్యూటరీ కాలువలు లేకపోవడంతో రైతులే సొంతంగా వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ 500 మీటర్ల దూరం నుంచి 1.5 కి.మీ.ల దూరం వరకు పైప్‌లైన్‌ వేసుకుని మోటార్ల ద్వారా నీటిని పంటలకు మళ్లించుకుంటున్నారు.

దశాబ్దం అయినా...

నాగారం రిజర్వాయర్‌ దిగువన డిస్ట్రిబ్యూటరీ కాలువలు నిర్మిస్తే ఆయకట్టు రైతులకు మేలు జరుగుతుంది. ఇప్పటికే రిజర్వాయర్‌ నిర్మించి దశాబ్దం అవుతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే కాలువ నిర్మాణానికి చర్యలు చేపట్టాలి.

ఉప్పులూటి గణేశ్, రైతు, రుద్రంగి

త్వరలో నిర్మాణానికి చర్యలు

ఎల్లంపల్లి ప్యాకేజీ-2లో భాగంగా నాగారం రిజర్వాయర్‌ కింద ఉన్న ఆయకట్టుకు సాగునీటి కాలువల ఏర్పాటు పనులను అతి త్వరలో చేపడతాం. అలాగే కుడివైపు తూము నుంచి లీకేజీ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.

 సంతుప్రకాశ్, ఈఈ, ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు