logo

ప్రాణాలు మింగేస్తున్న కోల్‌బెల్టు రహదారి

కొత్తగా నిర్మించిన కోల్‌బెల్టు రహదారిపై వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. గనులకు వెళ్లే కార్మికులతో పాటు మంథనికి వెళ్లే ప్రధాన రహదారి ఇదే కావడంతో వాహనాల రద్దీ పెరిగింది.

Published : 28 May 2024 04:07 IST

వరుస ప్రమాదాలతో భయాందోళనలు
న్యూస్‌టుడే, గోదావరిఖని

జీడీకే ఒకటో గనినుంచి మంథనికి వెళ్లే రహదారి

  • గత ఏడాది నవంబరు నెలలో జీడీకే-11 గనిలో రెండో షిఫ్టు విధులకు వెళ్తున్న సింగరేణి కార్మికుడు సంపత్‌ లారీ టైరు కింద పడి దుర్మరణం చెందాడు. రహదారిపై వెళ్తున్న అతనిపై లారీ పైనుంచి బొగ్గు పెళ్ల మీద పడటంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పి లారీ వెనుక టైరు కింద పడ్డాడు. అతని తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
  • ఈ ఏడాది మార్చి 21న గోదావరిఖని నుంచి మంథనికి వెళ్తున్న యువకుడు మంద కిరణ్‌ ఇదే రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో దుర్మరణం చెందాడు. వెనుక కూర్చున్న మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గోదావరిఖనికి ద్విచక్ర వాహనంపై వచ్చిన వీరు రాత్రి సమయంలో తిరిగి మంథని వెళ్తుండగా జీడీకే-2 గని సమీపంలో రహదారిపై ప్రమాదం జరిగింది. చీకట్లో ఆగిఉన్న లారీ కనిపించకపోవడంతో దానికి ఢీకొని మృతి చెందాడు.

కొత్తగా నిర్మించిన కోల్‌బెల్టు రహదారిపై వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. గనులకు వెళ్లే కార్మికులతో పాటు మంథనికి వెళ్లే ప్రధాన రహదారి ఇదే కావడంతో వాహనాల రద్దీ పెరిగింది. పరిసర గ్రామాలను అనుసంధానం చేస్తూ నిర్మించడంతో గ్రామస్థుల రాకపోకలు అధికమయ్యాయి. రహదారి నిర్మాణంలో కనీస ప్రమాణాలు పాటించకపోవడతో ఎక్కువగా ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఏర్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో రోడ్డు పక్కన నిలిపిన లారీలు కనిపించక ద్విచక్ర వాహనదారులు వాటికి ఢీకొని దుర్మరణం చెందుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నలుగురు మృత్యువాత పడ్డారు. సింగరేణిలో కొత్తగా ఓసీపీ-5 ఏర్పాటు చేయడంతో ఈ రహదారిని కొత్తగా నిర్మించారు. జీడీకే-1, 2, 2-ఎ గనుల సమీపంతో పాటు జీడీకే-11 గనులకు ఇదేమార్గం ద్వారా వెళ్లాలి. వీటితో పాటు మంథనికి వెళ్లేందుకు ప్రధాన రహదారి ఇదే. జనగామ, సుందళ్ల, ముస్త్యాల, గడ్డంపల్లి గ్రామాలను కలుపుతూ నిర్మించిన కొత్త రహదారి నిర్మాణంలో సరైన ప్రమాణాలు పాటించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికులు ఈ రహదారిపై ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది.

తెరచుకోని 11వ గని పాత రహదారి

కార్మికులకు అందుబాటులో ఉండే జీడీకే-11 గని పాత రహదారిని తెరవాలని కార్మికులు ఆందోళన చేస్తున్నా సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదు. గోదావరిఖని పట్టణం నుంచి కేవలం అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న జీడీకే-11 గనికి ప్రస్తుతం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల 15 కిలోమీటర్ల దూరాభారం పెరిగింది. ఎలాంటి వాహనాల రద్దీ లేకుండా కేవలం కార్మికులు మాత్రం వెళ్లే రహదారిని ప్రారంభించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. జీడీకే-11 గని కార్మికుడు సంపత్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ గనికి చెందిన కార్మికులు ఆందోళన చేపట్టారు. లారీలను కదలనివ్వకుండా అడ్డుకున్నారు. గతంలో ఉన్న పాత రహదారిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులు పాత రహదారిని కొనసాగించారు. తాజాగా మళ్లీ దానిని మూసివేశారు. వర్షాలు కురియడంతో రహదారి బురదమయంగా మారిందని, దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయని కారణంగా పేర్కొంటూ అప్పట్లో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో ఈ గనిలో పనిచేసే 1200 మంది కార్మికులు, ఉద్యోగులు మళ్లీ 15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళుతున్నారు.

లారీ డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నాం

రహదారి ప్రమాదాలను నివారించేందుకు లారీ డ్రైవర్లకు గతంలో అవగాహన కల్పించాం. మళ్లీ సింగరేణి అధికారులతో కలిసి బొగ్గు రవాణా కాంట్రాక్టర్లు, లారీ డ్రైవర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తాం. లారీలను రోడ్డు పక్కన పార్కింగ్‌ చేసే సమయంలో కనీస జాగ్రత్తలు పాటించాలి. పార్కింగ్‌ లైట్లు వేయాలి. లారీ డ్రైవర్లకు ఈ విషయాన్ని చెప్పాం. కోల్‌బెల్టు రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటాం.

రమేశ్, ఏసీపీ, గోదావరిఖని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని