logo

మెరుగైన భద్రతా చర్యలు ముఖ్యం

దిల్లీలోని బేబీకేర్‌ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో రెండు భవనాలు ధ్వంసం కావడంతో పాటు పలువురు చిన్నారులు మృతిచెందారు.

Published : 28 May 2024 04:09 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

నూతన భవనంలో రక్తశుద్ధి కేంద్రం పక్కన భద్రపరిచిన ఆక్సిజన్‌ సిలిండర్లు

దిల్లీలోని బేబీకేర్‌ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో రెండు భవనాలు ధ్వంసం కావడంతో పాటు పలువురు చిన్నారులు మృతిచెందారు. మరికొందరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు భద్రపరచడం, అగ్నిప్రమాద నియంత్రణ చర్యలు తీసుకోవడంపై అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్యకాలంలో నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రుల్లో మినహా గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో అగ్నిప్రమాద నివారణకు ఏర్పాట్లు నామమాత్రమే. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా 15 అడుగులకంటే ఎత్తులో ఉండే భవనాలకు అగ్నిమాపక కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో కలిపి 15 అడుగుల లోపు ఎత్తు కలిగిన భవనాలకు అగ్నిమాపక కేంద్రం అనుమతి అవసరం లేకపోయినా నివారణకు తగు ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దిల్లీలోని ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన మొదలుపెట్టారు. చాలాచోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అగ్నిప్రమాద నియంత్రణకు చర్యలు లేకపోవడం గమనార్హం. గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో పాత భవనంలోని కొన్ని వార్డుల్లో మాత్రమే ప్రమాద నియంత్రణ చర్యలు ఉండగా కొన్నిచోట్ల లేవు. సార్వజనిక ఆసుపత్రిగా స్థాయి పెరగగానే ఆసుపత్రిలో అగ్నిమాపక నివారణ చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆధునికీకరించిన విభాగాల్లో మాత్రం ఆయా చర్యలు కనిపించడం లేదు. ప్రధానంగా పిల్లల ఐ.సి.యు.లోనే అగ్నిప్రమాద నివారణకు ఏర్పాట్లు లేవు. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఇటీవల నిర్మించిన 85 పడకల సామర్థ్యం గల భవనంలో అగ్నిప్రమాద నివారణ చర్యలు చేపట్టలేదు. ప్రమాదం జరిగినప్పుడు ఏవైపునుంచి బయటకు వెళ్లాలనే కనీస సూచికలు సైతం ఏర్పాటు చేయలేదు.

సిలిండర్ల నిల్వలపై నిర్లక్ష్యం

జిల్లాలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సిలిండర్లను భద్రపరుస్తున్న తీరు ఆందోళనలకు తావిస్తోంది. చాలా వరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వార్డులు, ఆపరేషన్‌ థియేటర్లలోనే ఓ పక్కన సిలిండర్లను ఉంచుతున్నారు. ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో సిలిండర్లను భద్రపరచడంలో ప్రమాణాలను పాటించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటు చేయకముందు పాత భవనంలో మెట్ల కింద వార్డులకు అతి సమీపంలో ఆక్సిజన్‌ సిలిండర్లను ఉంచి అక్కడి నుంచి పైపులైను ద్వారా వార్డులకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తుండేవారు. ప్లాంటు ఏర్పాటు తర్వాత నేరుగా ప్లాంటు నుంచి వార్డులకు పైపులైను ద్వారా సరఫరా చేస్తున్నారు. 85 పడకల సామర్థ్యంతో నిర్మించిన నూతన భవనం ఆక్సిజన్‌ ప్లాంటుకు దూరంగా ఉండడంతో పైపులైను ద్వారా సరఫరా చేసే పరిస్థితులు లేవు. సిలిండర్ల ద్వారా ఐ.సి.యు.తో పాటు వివిధ వార్డులకు ఆక్సిజన్‌ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకు అవసరమైన సిలిండర్లను రక్తశుద్ధి కేంద్రం పక్కనే భద్రపరిచి అక్కడి నుంచి పైపులైను ద్వారా వార్డులకు సరఫరా చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఏదైనా ఘటన జరిగితే పరిస్థితి ఏమిటన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నూతన భవనంలోకి ఆక్సిజన్‌ సరఫరా చేసేలా పైపులైను ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించారు. దీని కోసం ప్రత్యేక నిధులు విడుదల చేస్తే తప్ప నిర్మాణం జరిగే అవకాశం లేదు. దీనికంటే ప్రత్యేకంగా లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటు ఉత్తమమని సంబంధిత ఉన్నతాధికారులు సూచించడంతో దానినే ఏర్పాటు చేయాలంటూ ఆసుపత్రి వర్గాలు ఉన్నతాధికారులకు నివేదించాయి.

లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంటు కోసం నివేదించాం

కొవిడ్‌ సమయంలో గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన పి.ఎస్‌.సి. ఆక్సిజన్‌ ప్లాంటు కంటే అవసరమైన ఒత్తిడితో పాటు తక్కువ వ్యయంతో ఉత్పత్తి జరిగేలా లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించాం. పి.ఎస్‌.సి. ప్లాంటు నిర్వహణ వ్యయం ఎక్కువ కావడం, ఆక్సిజన్‌ ప్లాంటు నుంచి పైపులైను నిర్మాణానికి నిధులు ఎక్కువ అవసరం కానున్న నేపథ్యంలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటు ఉత్తమమని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటాం.

 డాక్టర్‌ హిమబిందుసింగ్, ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్య కళాశాల, గోదావరిఖని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని