logo

అడ్డంకులు అధిగమిస్తేనే ఆరోగ్య పరిరక్షణ

ఏటా వ్యాధులు ముసురుతున్నాయి. రోగాల బారిన పడి ఒళ్లు హూనమవుతోంది. సకాలంలో ప్రభుత్వ వైద్యం అందకపోవడంతో పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా చితికిపోతున్నారు.

Published : 28 May 2024 04:11 IST

సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై వైద్య శాఖ ప్రణాళిక
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది

ఏటా వ్యాధులు ముసురుతున్నాయి. రోగాల బారిన పడి ఒళ్లు హూనమవుతోంది. సకాలంలో ప్రభుత్వ వైద్యం అందకపోవడంతో పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా చితికిపోతున్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడంతో డెంగీ, మలేరియా కోరలు చాచుతున్నాయి. ఈ క్రమంలో వానాకాలం వ్యాధులపై అప్రమత్తంగా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళిక రూపొందించింది. గతంలో ఎదురైన అనుభవాలను అధిగమించేందుకు పలు శాఖల సహకారంతో నియంత్రణ చర్యలు చేపట్టనుంది. గ్రామస్థాయి నుంచి జిల్లా వరకు ర్యాపిడ్‌ యాక్షన్‌ బృందాలను నియమించేందుకు సిద్ధమవుతోంది.

ఇవిగో సమస్యలు..

  • ప్రతి సీజన్‌లో విష జ్వరాలతో ఊళ్లకుఊళ్లు మంచం పడుతున్నాయి.
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యానికి సరిపడా మందులు లేవు.
  • రక్త, మూత్ర పరీక్షల పరికరాలు మూలనపడటంతో ప్రైవేటులో రూ.500 వెచ్చిస్తున్నారు.
  • సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు జ్వరాలతో డెంగీ, చికెన్‌గున్యా బాధితుల సంఖ్య పెరుగుతోంది.
  • పల్లె, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపిస్తోంది. దోమల నియంత్రణ నామమాత్రంగా ఉంది.
  • స్థానికంగా వైద్యం లేక కరీంనగర్, హన్మకొండ, హైదరాబాద్‌ నగరాల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు.

సమన్వయం ఫలించేనా?

జిల్లాలో 266 పంచాయతీలు, రామగుండం నగరపాలకసంస్థ, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల్లో సుమారు 8 లక్షలపైనా జనాభా ఉంది. జిల్లా ఆసుపత్రి, రామగుండం సార్వజనిక ఆసుపత్రి, మంథని, సుల్తానాబాద్‌ సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 18 ప్రాథమిక, 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. జిల్లాలో పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో వైద్యఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గ్రామస్థాయిలో ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్త, మండలంలో వైద్యాధికారి, హెల్త్‌ అసిస్టెంట్, ఇతర సిబ్బంది, జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులతో ర్యాపిడ్‌ బృందాలను నియమిస్తుంది. ఎక్కడ జ్వరాలు సోకిన వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స చేయనున్నారు. పరిసరాల పరిశుభ్రత, దోమలు నిల్వ లేకుండా మురుగునీరు తొలగింపుపై అవగాహన కల్పించనున్నారు.

వ్యాధుల నియంత్రణకు ప్రణాళిక

జిల్లాలో సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై ప్రణాళిక సిద్ధం చేశాం. గత అనుభవాలను అధిగమించేలా సన్నద్ధమవుతున్నాం. ప్రభుత్వ వైద్యశాలల్లో మందులు, సిబ్బంది కొరత లేదు. పరీక్ష పరికరాల సమస్య లేదు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.

ప్రమోద్‌కుమార్, జిల్లా వైద్యాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని