logo

సైబర్‌ కేటుగాళ్లు

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. సాంకేతికతతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి.

Updated : 28 May 2024 06:13 IST

అవగాహన కల్పిస్తున్నా తగ్గని కేసులు
న్యూస్‌టుడే, జగిత్యాల, జగిత్యాల గ్రామీణం

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. సాంకేతికతతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి. అత్యాశకు పోయి చాలా మంది ఖాతాలోని డబ్బులు పోగొట్టుకొంటున్నారు. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులోపడి మోసానికి గురవుతున్నారు. ఇటీవల జిల్లాలో నమోదైన సైబర్‌ కేసులపై కథనం..

జిల్లాలో ఈ మధ్య కాలంలో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జిల్లాలోని కోరుట్లకు చెందిన శంకరయ్యను బెదిరించి రూ.4.23 కోట్లు కాజేశారు. ఇందులో పోలీసులు కొందరిని గుర్తించి పట్టుకుని జైలుకు పంపారు. ఇంకా కొంత మందిని అరెస్టు చేయాల్సి ఉంది. జిల్లా ఈ ఏడాది భారీగా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 546 సైబర్‌ కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇందులో యూపీఐ ద్వారా నగదు దోచుకున్నవి 288 కేసులు నమోదు కాగా డెబిట్, క్రెడిట్‌ కార్డు పేరుతో దోచుకున్నవి 66, ఇంటర్‌ నెట్‌ బ్యాంకింగ్‌ పేరుతో మోసపోయినవి 62 కేసులు ఉండగా, ఫోన్‌ కాల్‌ ఆధారంగా మోస పోయినవి 36, బ్యాంకు డిపాజిట్లు తదితర 12, ఈ వ్యాలెట్‌ పేరతో 10, ఇతర 12 కేసులు నమోదైనట్లు పోలీసు గణంకాల ద్వారా తెలుస్తోంది. 

 గతంలో బ్యాంకులో దాచుకున్న సొమ్ము భద్రంగా ఉండేది. ఇంటర్‌ నెట్‌ బ్యాంకింగ్, యూపీఐ వచ్చిన తర్వాత బ్యాంకు అధికారులకు సంబంధం లేకుండానే క్షణాల్లో ఇతరులకు డబ్బులు పంపించే వెసులుబాటు లభించింది. ఇదే సాంకేతికతను అడ్డం పెట్టుకుని అనేక విధానాల్లో సైబర్‌ నేరగాళ్లు సొమ్మును దోచుకుంటున్నారు. తక్షణం పోలీసులకు సమాచారం ఇచ్చిన కేసుల్లో మాత్రమే సొమ్ము తిరిగి ఇప్పిస్తున్నారు. ఆలస్యమైతే నేరగాళ్లు ఖాతానే మూసి వేసి ఆధారాలు లేకుండా చేస్తున్నారు.

  • సైబర్‌ నేరాలకు: 1930కు సమాచారం ఇవ్వాలి
  • జిల్లాలో ఈ  ఏడాది నమోదైన సైబర్‌ కేసులు: 546

ఓటీపీ వివరాలు చెప్పవద్దు..

బ్యాంకు ఖాతాల వివరాలను ఎవరికి చెప్పకూడదు. ఒక వేళ మోసపోయామని గుర్తిస్తే వెంటనే 1930కు ఫోన్‌ చేసి చెప్పాలి. సైబర్‌ మోసాలపై జిల్లాలో ఇప్పటికే అవగాహన కల్పించాం. చాలా మంది అత్యాశకు పోయి సైబర్‌ నేరగాళ్ల మాటలు నమ్మి సొమ్ము పోగొట్టుకుంటున్నారు. ఇతరులకు బ్యాంకు ఓటీపీ వివరాలు చెప్పవద్దు.

 రఘు చందర్, డీఎస్పీ, జగిత్యాల 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని