logo

ఈసారైనా వరద ముప్పు తప్పేనా..!

రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో ఏటా గోదావరి వరదల వల్ల తీర ప్రాంత ప్రజలు సర్వం కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంటోంది.

Published : 28 May 2024 04:21 IST

ప్రతిపాదనల్లోనే కరకట్టనిర్మాణం
న్యూస్‌టుడే, ధర్మపురి

గత ఏడాది నీట మునిగిన మంగళిగడ్డ ప్రాంతం (పాతచిత్రం)

రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో ఏటా గోదావరి వరదల వల్ల తీర ప్రాంత ప్రజలు సర్వం కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. వర్షాకాలంలో నదిలోకి వరద నీరు చేరిందంటే చాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఈసారైనా వరద నివారణతో పాటు, వరదల నుంచి తీరప్రాంత ప్రజలను ముందస్తు ప్రణాళికలతో అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. వరద నివారణ కోసం కరకట్ట నిర్మాణానికి సర్వేలు చేశారు. రూ.4 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. నిధులు మంజూరుచేసి పనులు ప్రారంభించి తమ ఇబ్బందులు తీర్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

కంటి మీద కునుకు కరవు

ధర్మపురి పై ప్రాంతంలో నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పరిధిలో దట్టమైన అడవులు ఉండటంతో అధికంగా వానలు కురుస్తుంటాయి. రెండు భారీ వర్షాలతో కడెం రిజర్వాయర్‌ నిండుకుండగా మారుతోంది. ఇంకా ఎక్కువగా వానలు కురిస్తే వరద ఒక్కసారిగా పోటెత్తుతుంది. ఆ ప్రభావం ధర్మపురి పట్టణంపై పడుతోంది. తీరప్రాంత ప్రజలు ఒక్కోసారి సర్వం కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. గతంలో వరదల ప్రభావానికి కేవలం మగళిగడ్డ ప్రదేశంలోనే సుమారుగా 50 చిరు వ్యాపారులకు చెందిన దుకాణాలన్నీ నీట మునిగిపోయాయి. ఒక్కో వ్యాపారికి సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టం వాటిల్లింది.

వరద ముంపు ప్రదేశాలివే...

ధర్మపురిలో తెనుగువాడ, కుమ్మరివాడ, బ్రాహ్మణసంఘం, తెలుగు కళాశాల, రామాలయం, మంగళిగడ్డ, బోయవాడ, ఒడ్డెర కాలనీ, విద్యుత్తు సబ్‌స్టేషన్, బ్రాహ్మణవాడ, వైశ్యసత్రాలను ముంపు ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. రెండు లక్షల క్యూసెక్కులపైన వరద నీరు కడెం నుంచి వదిలితే  ధర్మపురి పట్టణంలోకి వరద నీరు చేరుతుంది. వరదల సమయంలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసేలా యోచిస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం దిశగా పాలకులు, అధికారులు చొరవ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధర్మపురిలో కరకట్ట నిర్మాణం ద్వారానే పట్టణంలోకి వరద రాకుండా ఆరికట్టవచ్చు. హన్మాండ్ల గడ్డ నుంచి కింది ప్రాంతంలో ఉన్న మహాలక్ష్మీఘాట్‌ వరకు రెండు కిలోమీటర్లకు పైగా కరకట్ట నిర్మాణం చేపట్టాలంటే కనీసం రూ.4 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు ప్రతిపాదించారు. నిధులు మంజూరయితేనే ఈ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది.

నిధులు మంజూరు చేయాలి

మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. వానాకాలం వచ్చిందంటే చాలు నదీ తీర ప్రాంతాల్లో ఉండేవారు భయం భయంగా గడపాల్సిన దుస్థితి నెలకొంది. వరదల నుంచి కాపాడాలంటే తప్పకుండా కరకట్ట నిర్మాణం చేపట్టాలి. దీనితోనే స్థానికంగా ఇబ్బందులు తీరే అవకాశం ఉంది. కరకట్ట నిర్మించేందుకు ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలి.

 ధరణి, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, ధర్మపురి

శాశ్వత చర్యలు కరవు

ఏటా గోదావరినదికి వరదలు వచ్చాయంటే స్థానికులకు కంటిమీద కునుకు ఉండటం లేదు. తీర ప్రాంతాల్లో వరదల నివారణ కోసం ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టాలి. వరదలతో నష్టపోయే ప్రదేశాలను పుర అధికారులు గుర్తించాలి. వానాకాలం కంటే ముందే ప్రణాళికలను తయారు చేసి, నివారణ కోసం నిధులు కేటాయించాలి.

రంగు లక్ష్మీ నరహరి, ధర్మపురి

ప్రణాళికలు సిద్ధం

ధర్మపురిలో వరదల వల్ల నష్టం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. గత ఏడాది అనుభవాల దృష్ట్యా వరదల వల్ల ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ప్రజలను అప్రమత్తం చేస్తాం. ముంపు తలెత్తే ప్రాంతాల్లో అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. కరట్ట నిర్మాణానికి గతంలోనే మున్సిపల్‌ తరఫున ప్రతిపాదలను ప్రభుత్వానికి పంపించాం. పాలకమండలిలో చర్చించి చర్యలు తీసుకుంటాం.

శ్రీనివాస్‌రెడ్డి, పుర కమిషనర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని