logo

అదనపు కట్టడాలకు మదింపు

జిల్లాలోని కరీంనగర్‌ నగర పాలక సంస్థతోపాటు పురపాలికల్లో ఆస్తి పన్ను పరిధిలోకి రాని అదనపు కట్టడాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.

Published : 28 May 2024 04:26 IST

క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారుల కొలతలు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌

నగరంలో అదనపు కట్టడాలకు కొలతలు తీసుకుంటున్న నగర పాలిక రెవెన్యూ ఉద్యోగులు

జిల్లాలోని కరీంనగర్‌ నగర పాలక సంస్థతోపాటు పురపాలికల్లో ఆస్తి పన్ను పరిధిలోకి రాని అదనపు కట్టడాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. అయిదారు ఏళ్లుగా ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో నిర్వహించకపోగా, భువన్‌ సర్వే సమయంలో కొన్ని ఇళ్లను ఆన్‌లైన్‌ ద్వారా మదింపు చేశారు. ఏటా పాత ఇళ్లను కూల్చి కొత్తగా నిర్మించుకోవడం, ఉన్న భవనాలపైనే అంతస్తులు నిర్మించుకుంటున్నారు. నివాసిత భవనాలను ఆధునికీకరించి వాణిజ్య భవనాలుగా మార్చుకుంటున్నారు.  వీటన్నింటికి పాత ఆస్తిపన్ను మాత్రమే ఉంటుంది. పురపాలికలకు ఆదాయం రాకుండా పోతుండగా, పన్ను మదింపులో తేడాలు ఉంటుండటంతో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అదనపు కట్టడాలకు ఆస్తి పన్ను మదింపు చేయడంతోపాటు ఆన్‌లైన్‌లో నమోదు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు.

16 బృందాల ఏర్పాటు

కరీంనగర్‌ నగర పాలక సంస్థ పరిధిలో ఏటా వెయ్యి ఇళ్లకు పైగా కొత్తగా నిర్మించుకుంటున్నారు. 70 శాతం పట్టణ ప్రణాళిక ద్వారా అనుమతులు తీసుకుంటుండగా మిగతా 30 శాతం అనధికారిక, అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. అనుమతులు తీసుకున్న వాటికి, అనధికారికంగా ఉన్న వాటికి ఇంటి నంబర్ల కోసం వస్తుండగా వాటికి భవన విస్తీర్ణం మేరకు పన్ను మదింపు చేస్తున్నారు. పాత ఇళ్లు, అదనపు కట్టడాలకు సంబంధించినవి మాత్రం ఆస్తి పన్ను పరిధిలోకి రావడం లేదు. ఇలాంటివి గుర్తించేందుకు నగర వ్యాప్తంగా 16 బృందాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ముగ్గురు ఉద్యోగులు ఉంటున్నారు. వీరంతా  రెవెన్యూ డివిజన్ల వారీగా సర్వే చేస్తున్నారు. కొలతలు నిర్వహించి ఆస్తి పన్ను మదింపు చేయనున్నారు.

పెరగనున్న ఆదాయం

పాత ఇళ్లకు ఎప్పటిలాగే ఆస్తిపన్ను ఉండనుండగా అదనంగా నిర్మించుకున్న భవనాలు, అంతస్తులు, నివాసితం నుంచి వాణిజ్య అవసరాలకు మార్చుకున్న భవనాలకు తిరిగి కొలతలు నిర్వహిస్తుండటంతో వీటికి సంబంధించిన పన్ను పెరగనుంది. నగర, పురపాలికలకు సైతం ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. నగరంలో ఇలాంటి కట్టడాలు అనేకం ఉండగా వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని కార్పొరేటర్లు పలుమార్లు కౌన్సిల్‌ సమయాల్లో ప్రస్తావించారు. తద్వారా మరో రెండు కోట్ల ఆదాయం పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. ఇప్పటికే విలీన కాలనీల్లో పన్ను మదింపు పూర్తయ్యింది. భువన్‌ యాప్‌లో ఇళ్లను నిక్షిప్తం చేయడంతో కొలతల ఆధారంగా పన్ను చెల్లిస్తున్నారు.

15 రోజుల్లో పూర్తికి ఆదేశించాం

అదనపు కట్టడాల మదింపు అనేది నిరంతర ప్రక్రియ. నగర వ్యాప్తంగా ఒకేసారి సర్వే చేసేందుకు బృందాలు ఏర్పాటు చేశాం. 15 రోజుల్లో పూర్తి చేసేలా ఆదేశించాం. ఇప్పటివరకు 220 అదనపు కట్టడాలు గుర్తించి ఆన్‌లైన్‌లో కొలతలు నమోదు చేశాం.

ఆంజనేయులు, ఆర్వో, కరీంనగర్‌ నగరపాలిక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని