logo

మనం ఎంత భద్రం!

వచ్చేది వానాకాలం.. తుపాన్ల కారణంగా బలమైన గాలులు వీస్తాయి. వారం రోజుల కిందట సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఆసుపత్రి వద్ద చెట్టు కూలడంతో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి.

Published : 28 May 2024 04:36 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కలెక్టరేట్‌

వచ్చేది వానాకాలం.. తుపాన్ల కారణంగా బలమైన గాలులు వీస్తాయి. వారం రోజుల కిందట సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఆసుపత్రి వద్ద చెట్టు కూలడంతో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆ ఘటన మరవకముందే ఆదివారం గాలివాన బీభత్సానికి రాష్ట్ర వ్యాప్తంగా స్తంభాలు, చెట్లు, హోర్డింగ్‌లు కూలడంతో 13 మంది దుర్మరణం చెందారు. ఆ ఘటనలను చూసి.. ఎంతోమంది అయ్యో అని ఆవేదన వ్యక్తం చేశారు. మన కరీంనగర్‌ జిల్లాలోనూ కూలడానికి సిద్ధంగా చెట్లు, స్తంభాలు, బోర్డులు ఉన్నాయి. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం అప్రమత్తం కాకుంటే మన వద్ద కూడా ఇలాంటివి చోటు చేసుకునే అవకాశముంది. అధికారులు మేల్కొని పడిపోవడానికి సిద్ధంగా ఉన్న వాటిని తొలగిస్తే ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుంది. ఈ విషయంపై ‘న్యూస్‌టుడే’ జిల్లా పంచాయతీ అధికారి ఎ.రవీందర్‌ను వివరణ కోరగా.. ప్రమాదకర ఇళ్లు, చెట్లు, విద్యుత్తు స్తంభాలు, హోర్డింగ్‌లను మూడు రోజుల్లోగా గుర్తించాలని క్షేత్రస్థాయి అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. అవసరమైన చోట వాటిని తొలగించాలని సూచించామని తెలిపారు.


రహదారిపై ఒరిగిన చెట్టు

రామడుగు మండలం వెదిర అనుబంధ గ్రామం వెంకటగిరి రైల్వే గేటు సమీపంలో చింతచెట్టు రోడ్డు వైపు ఒరిగింది. రెండేళ్ల కింద చెట్టు అడుగు భాగంలో పిడుగుపడి క్రమంగా రోడ్డు వైపు ఒరుగుతోంది. నిత్యం వందలాది వాహనాలు వెళ్లే దారిలో చెట్టు ఎప్పుడు పడిపోతుందోనని భయంగా జనం వెళ్తున్నారు. 

న్యూస్‌టుడే,రామడుగు


ఎండిన వృక్షం

శంకరపట్నం మండలం మొలంగూర్‌ అడ్డరోడ్డు నుంచి వీణవంక, జమ్మికుంట వెళ్లే దారిలో ఓ విత్తన కంపెనీ ముందు ఎండిన చెట్టుతో ప్రమాదం పొంచి ఉంది. నిత్యం ఈ రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీలు నిలుపుతుంటారు.

న్యూస్‌టుడే, శంకరపట్నం


గాలులు వీస్తే..

మానకొండూర్‌ చెరువు కట్ట కింద రహదారి వెంబడి ఓ చెట్టు ఎండిపోయి కూలడానికి సిద్ధంగా ఉంది. బలమైన గాలులు వేస్తే విరిగే ప్రమాదం ఉంది. జాతీయ రహదారి కావడంతో నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.

న్యూస్‌టుడే, మానకొండూర్‌


శిథిలావస్థలో హోర్డింగ్‌

చొప్పదండి శివారులోని గుమ్లాపూర్‌ అడ్డరోడ్డు సమీపంలో ఉన్న ఓ హోర్డింగ్‌ కొంతభాగం విరిగి ప్రమాదకరంగా తయారైంది. అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, చొప్పదండి


ఆధారం లేని పాఠశాల బోర్డు..

కరీంనగర్‌ రూరల్‌ మండలం దుర్శేడు ప్రాథమిక ఉన్నత పాఠశాల ముందు ఉన్న నామఫలకమిది. కింద స్తంభాలకు ఎలాంటి ఆధారం లేదు.  ప్రహరీ ఆధారంగా బోర్డు నిలిపారు. గాలి దుమారం వస్తే.. ఎగిరి మీద పడే ప్రమాదముంది.

న్యూస్‌టుడే, కరీంనగర్‌ గ్రామీణం


ప్రమాదకరంగా..

చొప్పదండి మండలంలోని రుక్మాపూర్‌ గ్రామశివారులో రాష్ట్ర రహదారికి ఆనుకుని పలు చెట్లు ఎండిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి. నెల కిందట కొన్ని చెట్లను నరికివేసినా వీటిని మాత్రం అలాగే వదిలేశారు. అవి ఎప్పుడు విరిగి రహదారిపై పడుతాయోనని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.

న్యూస్‌టుడే, చొప్పదండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని