logo

ఆసరా ఆలస్యం.. పేదల దైన్యం

మలి వయసులో ఆర్థికంగా అండగా ఉండాల్సిన ‘ఆసరా’ ఆలస్యమవుతోంది. దీంతో పింఛను లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగిలాయి.

Updated : 04 Dec 2022 06:08 IST

రెండు నెలలుగా తప్పని ఎదురుచూపులు
ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

పింఛను కోసం కలెక్టరేట్‌ వద్దకు వీల్‌చైర్‌లో వచ్చిన దివ్యాంగుడు

మలి వయసులో ఆర్థికంగా అండగా ఉండాల్సిన ‘ఆసరా’ ఆలస్యమవుతోంది. దీంతో పింఛను లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగిలాయి. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీతకార్మికులు, నేతకార్మికులు తదితర వర్గాలకు ప్రభుత్వం ప్రతి నెలా ఆసరా పథకం కింద అందిస్తున్న పింఛను సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తోంది. అయితే అక్టోబరు, నవంబర్‌ నెలలకు సంబంధించిన పింఛను ఇప్పటివరకూ అందకపోవడంతో పేదలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అధికారుల అంచనా ప్రకారం లబ్ధిదారుల ఖాతాల్లో పింఛను సొమ్ము జమ అయ్యేందుకు మరో రెండు వారాలకు పైగా సమయం పట్టే అవకాశముంది. ఈ లెక్కన నెలాఖరు వరకు నిరీక్షణ తప్పేలా లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, వితంతువులు గ్రామాల్లో తరచూ తపాలా కార్యాలయాలకు, బ్యాంకు ఏటీఎంల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నారు. మరోవైపు కొత్తగా 57 ఏళ్లు నిండిన వారిని వృద్ధాప్య పింఛనుకు ఎంపిక చేయగా వారికి కూడా రెండు నెలల పింఛను సొమ్ము రావాల్సి ఉంది.

నిత్యావసరాలకు ఇబ్బందులు

నిత్యావసర సరకుల కొనుగోలుకు, వృద్ధులు క్రమం తప్పకుండా తీసుకునే ఔషధాలకు పింఛను సొమ్ము అండగా ఉంటోంది. అయితే ప్రతి నెలా ఇవ్వకపోవడంతో అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,09,976 మందికి ఆసరా పథకం కింద నెలనెలా పింఛన్లు అందిస్తున్నారు. ఇందులో కొత్తగా 25,801 మంది 57 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, బోదకాలు, ఎయిడ్స్‌, డయాలసిస్‌ వ్యాధిగ్రస్థులు, గీత, బీడీకార్మికులు, ఒంటరి మహిళలకూ పించన్లు అందిస్తున్నారు. ప్రతి నెలా ఆలస్యంగానే వస్తున్నాయి. ఏ నెల పింఛను ఆ నెల రావడం లేదు. ఒక్కోసారి నెలాఖరులోనూ జమ అవుతున్నాయి. రెండు నెలలు కలిపి జిల్లాలో దాదాపు రూ.60 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది.

నిధుల్లేక ఆలస్యం: శ్రీధర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

రాష్ట్ర ఖజానా శాఖ నుంచి ఇంకా నిధులు జమ కాలేదు. త్వరలో పింఛను మొత్తాలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. అర్హులైనవారందరికీ పింఛను డబ్బులు జమ చేయనున్నారు.్చ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని