logo

భగీరథ వచ్చినా.. అదే భారం

మిషన్‌ భగీరథ వచ్చినా పురపాలికలు, పంచాయతీలకు విద్యుత్తు బిల్లుల భారం తప్పడం లేదు. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధుల్లో 20-30 శాతం వీటికే చెల్లిస్తున్నారు.

Published : 26 Mar 2023 05:05 IST

పంచాయతీలు, పురపాలికల్లో పాత పథకాల కొనసాగింపు
జిల్లా వ్యాప్తంగా నెలకు రూ.65 లక్షల విద్యుత్తు బిల్లులు

హన్మాజీపేటలోని నీటిని సరఫరా చేసే బోరుబావి


‘‘వేములవాడ మండలం హన్మాజీపేట పంచాయతీలో ఎత్తున ఉన్న 30 గృహాలకు భగీరథ నీరు అందడం లేదు. పంచాయతీలోని మూడు అశ్వసామర్థ్యం ఉన్న బోరు మోటారు ద్వారా ఈ కాలనీకి నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు భగీరథ నీరు అందని సమయంలో మరో బోరును ఉపయోగిస్తున్నారు. ఈ రెండింటికీ నెలకు రూ.9 వేల వరకు విద్యుత్తు బిల్లు చెల్లిస్తున్నారు. ఈ గ్రామం భగీరథ ప్రధాన గ్రిడ్‌ అగ్రహారానికి 15 కిలోమీటర్లలోపు ఉంటుంది. దీన్ని బట్టి ఇక జిల్లాలోని శివారు గ్రామాలు, కాలనీల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు’’


ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: మిషన్‌ భగీరథ వచ్చినా పురపాలికలు, పంచాయతీలకు విద్యుత్తు బిల్లుల భారం తప్పడం లేదు. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధుల్లో 20-30 శాతం వీటికే చెల్లిస్తున్నారు. అవికూడా నాలుగు నెలలుగా రావడం లేదు. ప్రజలకు ఇంటింటా శుద్ధజలం సరఫరా చేయడానికి మిషన్‌ భగీరథ పథకంలో నల్లాలు అమర్చారు.  వేములవాడ మండలం అగ్రహారంలో మూడు నియోజకవర్గాలకు (సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి) ప్రధాన గ్రిడ్‌ శుద్ధికేంద్రాన్ని నిర్మించారు. దీనికి రూ.1,085 కోట్లు కేటాయించారు. రెండు పురపాలికలు (సిరిసిల్ల, వేములవాడ)లకు ప్రత్యేకంగా అర్బన్‌ భగీరథలో రూ.60.76 కోట్లు కేటాయించారు. 2019లోనే ప్రధాన గ్రిడ్‌ పనులు పూర్తయ్యాయి. అగ్రహారంలోని 120 ఎంఎల్‌డీ (రోజుకు మిలియన్‌ లీటర్ల) సామర్థ్యం ఉన్నా.. ప్రస్తుతం రోజుకు గరిష్ఠంగా 90 ఎంఎల్‌డీలు మాత్రమే సరఫరా జరుగుతోంది. జనాభా పెరిగినకొద్ది నీటి విడుదల సామర్థ్యం పెంచుకునేలా ముందే ప్రణాళిక చేశారు. భగీరథ ఇంట్రావిలేజ్‌లో మూడేళ్లుగా దశలవారీగా గ్రామాలు, పట్టణాలకు నీటిని సరఫరా జరుగుతోంది. అయితే నిరంతరాయ సరఫరాలో తలెత్తుతున్న లోపాల కారణంగా పంచాయతీలు, పురపాలికలు యథావిధిగా స్థానిక బోరుబావులపైనే ఆధారపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నీటి పథకాల విద్యుత్తు బిల్లు నెలకు రూ.60 లక్షల సెస్‌కు చెల్లించాలి. వీటిలో ప్రతినెలా కొద్దిమొత్తంలో చెల్లించినప్పటికీ సెస్‌కు రూ.175 కోట్ల బకాయి ఉంది.


రెండింటికీ ఖర్చు

జిల్లాలో భగీరథ పనులు శతశాతం పూర్తయినట్లు ఉన్నతాధికారుల సమీక్షలో.. జిల్లా పరిషత్తు.. మండలాలవారీగా జరుగుతున్న సమావేశాల్లోనూ చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు మాత్రం ‘పనులు అసంపూర్తిగా ఉన్నాయి. నల్లాలు బిగించలేదు. నిరంతరాయంగా సరఫరా కావడంలేదంటు’న్నారు. అందుకోసమే స్థానిక పథకాలను వాడుతున్నామని చెబుతున్నారు. వాస్తవానికి భగీరథ పనులు పూర్తయిన గ్రామాల్లో బోరుబావులకు విద్యుత్తు కనెక్షన్లను క్రమంగా తొలగించాలి. అత్యవసరానికి ఒకట్రెండు మాత్రమే ఉంచాలి కానీ.. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఎప్పటిలాగే నడుస్తున్నాయి. వీటిని తొలగించేందుకు అధికారులు.. ప్రజాప్రతినిధులు సాహసించడం లేదు. భగీరథ నీరు స్వచ్ఛమైనదని ప్రజల్లో అవగాహన కల్పించడంలోనూ విఫలమవుతున్నారు. ఇప్పటికీ తాగడానికి స్థానికంగా ఉన్న నీటి కేంద్రంలోని నీటిని కొనుగోలు చేస్తూ.. భగీరథ శుద్ధజలాన్ని ఇతర అవసరాలకు వాడుకోవడం గమనార్హం. ఫలితంగా పంచాయతీల్లోని బోరుబావులకు ఇటు భగీరథ ఫథకం నిర్వహణకు ప్రభుత్వానికి ఖర్చు తప్పడం లేదు.


‘‘వేములవాడలో అర్బన్‌ భగీరథ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. బాలనగర్‌, సంతోష్‌నగర్‌ ప్రాంతాలకు బోరుబావుల ద్వారా సరఫరా జరుగుతోంది. ఇటు విలీన గ్రామమైన తిప్పాపూర్‌లోనూ బోరుబావుల నుంచే సరఫరా. వీటికి ప్రతినెలా పురపాలక సంఘం రూ.6 లక్షల విద్యుత్తు బిల్లులు చెల్లిస్తోంది. వాస్తవానికి అర్బన్‌ భగీరథ పనులు గతేడాది మేలోనే పూర్తికావాల్సి ఉంది.’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని