logo

కొత్త వారు రాక.. ఉన్నవాళ్లు చదవలేక

సిరిసిల్లలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలను ప్రారంభించి మూడేళ్లవుతుంది. దీనిలో టెక్స్‌టైల్‌ టెక్నాలజీలో రెండేళ్లుగా ఒక్కరూ ప్రవేశాలు పొందలేదు. తొలి ఏడాది ఎంసెట్‌, ఈసెట్‌ ద్వారా వచ్చిన 14 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ కోర్సుకు రెండేళ్లుగా అగ్రహారం పాలిటెక్నిక్‌ డిప్లొమా, ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాల అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తున్నారు.

Updated : 08 Dec 2023 06:18 IST

టెక్స్‌టైల్‌ కోర్సులో సిలబస్‌ లేక విద్యార్థుల అవస్థలు
సిరిసిల్ల జేఎన్‌టీయూలో ఇదీ పరిస్థితి

జేఎన్‌టీయూ కళాశాల

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల : సిరిసిల్లలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలను ప్రారంభించి మూడేళ్లవుతుంది. దీనిలో టెక్స్‌టైల్‌ టెక్నాలజీలో రెండేళ్లుగా ఒక్కరూ ప్రవేశాలు పొందలేదు. తొలి ఏడాది ఎంసెట్‌, ఈసెట్‌ ద్వారా వచ్చిన 14 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ కోర్సుకు రెండేళ్లుగా అగ్రహారం పాలిటెక్నిక్‌ డిప్లొమా, ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాల అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తున్నారు. జేఎన్‌టీయూలోనే కొత్త కోర్సు కావడం, మూడేళ్లుగా కనీసం సిలబస్‌ను రూపొందించకపోవడం చూస్తుంటే బోధన ఏ తీరున సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. సివిల్‌, మెకానికల్‌, ఈఈఈ, ఈసీఈ, సీఎస్‌ఈ కోర్సుల ప్రయోగాల కోసం కొండగట్టు జేఎన్‌టీయూకు పంపుతున్నారు. 2021లో ప్రారంభమైన కళాశాల భవన నిర్మాణాలకు ప్రభుత్వం ఇటీవల తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో స్థలం కేటాయించింది. ప్రస్తుతం అగ్రహారం డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని కొంత భాగాన్ని జేఎన్‌టీయూ కళాశాలకు వినియోగిస్తున్నారు.

ఏమిటీ సమస్య?

ప్రపంచ వ్యాప్తంగా రొబోటిక్స్‌, ఐవోటీ, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ, డేటాసైన్స్‌, ఏఐ తదితర ఎమర్జింగ్‌ కోర్సులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈక్రమంలో కోర్‌ బ్రాంచిలైన మెకానికల్‌, సివిల్‌ తదితర బ్రాంచిల్లో ప్రవేశాలు తగ్గాయి.  ఈ బ్రాంచిలకు క్రమంగా డిమాండ్‌ తగ్గుతోంది. టెక్స్‌టైల్‌ విభాగానిది కూడా అదే పరిస్థితి. జేఎన్‌టీయూలో మూడేళ్ల క్రితం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ కోర్సుపై శీతకన్ను వేశారు. ప్రవేశాలు పొందే సమయంలో కళాశాల అధ్యాపకులు ఉస్మానియాలోని టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌ విభాగంతో ఎంవోయూ చేసుకుని బోధన కొనసాగిస్తామని విద్యార్థులకు చెప్పారు. ఇప్పటికీ మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టినా ఆ ఊసేలేదు. ఇటు జేఎన్‌టీయూ కూడా కోర్సుకు సిలబస్‌ను రూపొందించలేదు. దీంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు.

ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాలలోని 2018 సంవత్సరం టెక్స్‌టైల్‌ కోర్సు సిలబస్‌ను ఒప్పంద అధ్యాపకులతో రెండో ఏడాది బోధించారు. కళాశాలలో ఆరు కోర్సులకు గాను రెగ్యులర్‌ అధ్యాపకులు ముగ్గురు, ఒప్పంద ప్రాతిపదికన నలుగురు, పీరియడ్‌ లెక్కన బోధించేవారు 26 మంది ఉన్నారు. టెక్స్‌టైల్‌ మినహా మిగతా అయిదు కోర్సులు, మూడు సంవత్సరాలకు కలిపి 787 మంది విద్యార్థులున్నారు. క్యాంపస్‌ సెలక్షన్స్‌ కోసం పలు కంపెనీల బృందాలు ఈ ఏడాది కళాశాలలను సందర్శించనున్నాయి. ఆయా కంపెనీలు విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసుకుంటాయి. అన్ని కోర్సుల విద్యార్థులకు ఈ సంవత్సరం ఎంతో కీలకం. ఇక టెక్స్‌టైల్‌ కోర్సులోని విద్యార్థులు మూడో సంవత్సరంలోకి వచ్చినా ఇప్పటికీ వీరికి కనీసం ల్యాబ్‌లు లేవు. స్టడీ టూర్ల ఊసేలేదు. దీనిపై విద్యార్థులు రెండు నెలల క్రితం జేఎన్‌టీయూ ఉప కులపతికి ఆన్‌లైన్‌లో వినతి పత్రం సమర్పించారు. అయినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఇలా చేస్తే మేలు..

సంప్రదాయ కోర్సులు కనుమరుగవుతున్న వేళ విద్యార్థులకు మంచి ఉపాధి కల్పించే టెక్స్‌టైల్‌ కోర్సులను ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆధునికతకు తగ్గట్టుగా దుస్తుల తయారీలో యువతను ఆకట్టుకోవడంతో పాటు ఈ రంగంలో దీర్ఘకాలం ఆదరణ పొందవచ్చు. దానివల్ల జిల్లాలోని వస్త్ర పరిశ్రమ మరింత విస్తరించడంతోపాటు వృద్ధి చెందుతుంది. ఇవన్నీ జరగాలంటే కళాశాల స్థాయిలోనే విద్యార్థులకు ఈ రంగంపై పూర్తి పట్టు తీసుకురావాలి. అప్పుడే యువత వస్త్ర పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తారు. పాలిటెక్నిక్‌ కళాశాలలోని డిప్లొమా, జేఎన్‌టీయూలోని ఇంజినీరింగ్‌ కోర్సులతో ఈ రంగంలోని అవకాశాల గురించి విద్యార్థులకు తెలియజేయాలి. దానికి అవసరమైన నూతన పాఠ్య ప్రణాళిక, బోధన సిబ్బంది, మౌలిక సదుపాయాలను కల్పించేలా చొరవ చూపాలి. అవసరమైతే టెక్స్‌టైల్‌ పార్కు, అపరెల్‌ పార్కులోని పరిశ్రమలతో సమన్వయం చేసుకోవాలి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో సిరిసిల్లలో వస్త్రోత్పత్తి రంగంలో విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉంటుంది. ఫలితంగా ఇక్కడ జేఎన్‌టీయూలో టెక్స్‌టైల్‌ కోర్సు ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుంది.

ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం

కోర్సుల వారీగా విద్యార్థులకు బోధనలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒప్పంద ప్రాతిపదికన అన్ని కోర్సులకు పూర్తిస్థాయి అధ్యాపకులు ఉన్నారు. కళాశాల భవనం, ల్యాబ్‌ల నిర్మాణంపై జేఎన్‌టీయూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

శ్రీనివాస్‌, ప్రిన్సిపల్‌, జేఎన్‌టీయూ, సిరిసిల్ల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు