logo

ఎన్నికల్లో మద్యం కిక్కు!

 శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో మద్యం ఏరులై పారింది. మద్యం ప్రియులకు కిక్కు ఇవ్వగా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు వరకు రూ. వంద కోట్లకు పైగా విక్రయాలు సాగాయి.

Published : 08 Dec 2023 04:37 IST

మూడు నెలల్లో రూ. వంద కోట్లకు పైగా విక్రయాలు

న్యూస్‌టుడే, ఎల్లారెడ్డిపేట : శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో మద్యం ఏరులై పారింది. మద్యం ప్రియులకు కిక్కు ఇవ్వగా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు వరకు రూ. వంద కోట్లకు పైగా విక్రయాలు సాగాయి. గడిచిన రెండేళ్లలో వచ్చిన మొత్తం ఆదాయంలో సింహభాగం ఈ మూడు నెలల్లోనే వచ్చింది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో మద్యం గొలుసు దుకాణాలను మూసివేసినప్పటికీ మద్యానికి గిరాకీ మరింత పెరగడం కొసమెరుపు. జిల్లాలో సెప్టెంబరు నుంచి నవంబరు 30 వరకు రూ. 100.82 కోట్ల విలువైన మద్యాన్ని అమ్మడం ఎన్నికల పండగలో మద్యం ప్రియులకు ఇచ్చిన కిక్కు ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది.

కట్టడి చేసినా...

జిల్లాలో 48 మద్యం దుకాణాలు, 8 బార్లను నిర్వహిస్తున్నారు. శాసనసభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాగానే మద్యం అమ్మకాలపై ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా గ్రామాల్లోని బెల్టుషాపులను మూసివేయడంతోపాటు నిర్వాహకులను తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేశారు. అంతేకాకుండా మద్యం అక్రమంగా తరలించకుండా వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. అక్రమంగా మద్యం సీసాలను తరలించేవారిపై కూడా కేసులు నమోదు చేశారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో దుకాణాల్లో మాత్రమే నిబంధనల మేరకు మద్యం కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఒక వ్యక్తి ఆరు మద్యం బాటిళ్లు (లిక్కర్‌), 12 బీర్లను మాత్రమే వెంట తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఎన్నికల్లో మద్యం రవాణాను అధికారులు కట్టడి చేసినప్పటికీ అమ్మకాలు భారీగా పెరిగాయి. జిల్లాలో 2021 డిసెంబరు 1 నుంచి 2023 నవంబరు 30 వరకు 8,99,130 మద్యం పెట్టెలు, 19,10,668 బీరు పెట్టెలను విక్రయించగా రూ.1,002.53 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు వరకు మూడు నెలల వ్యవధిలోనే రూ.100.82 కోట్ల అమ్మకాలు జరగడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని