logo

ధాన్యం సేకరణపై తుపాను ప్రభావం

తుపాను ప్రభావం జిల్లాలో ధాన్యం సేకరణపై పడింది. గత రెండు రోజులుగా చినుకులు పడుతుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. విక్రయానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం అకాల వర్షంతో తడిసిపోతాయని అన్నదాతలు టార్పాలిన్‌ కవర్లు కప్పారు.

Published : 08 Dec 2023 04:41 IST

తూకాలు నిలిచి ఆందోళనలో అన్నదాతలు

వర్షం భయంతో ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్‌ కవర్లు

న్యూస్‌టుడే, వేములవాడ : తుపాను ప్రభావం జిల్లాలో ధాన్యం సేకరణపై పడింది. గత రెండు రోజులుగా చినుకులు పడుతుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. విక్రయానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం అకాల వర్షంతో తడిసిపోతాయని అన్నదాతలు టార్పాలిన్‌ కవర్లు కప్పారు. దీంతో ధాన్యంలో తేమ శాతం మరింత పెరిగి తూకాలు కాక రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి రావడంతో కర్షకులు ఆందోళనకు గురవుతున్నారు.

జిల్లాలో నెలన్నర రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ చేపడుతున్నారు. కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న తరుణంలో తుపాను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చినుకులు పడటంతో చాలా కేంద్రాల్లో ధాన్యం కుప్పలపై రైతులు టార్పాలిన్‌ కవర్లు కప్పి తూకాల కోసం ఎదురుచూస్తున్నారు. నిబంధనల ప్రకారం తేమ శాతం వస్తే గానీ ధాన్యం తూకాలు అయ్యే పరిస్థితి లేదు. జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, మెప్మా ఆధ్వర్యంలో 253 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ 248 కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరించారు. క్వింటాల్‌కు ‘ఏ’ గ్రేడ్‌కు రూ.2,203, ‘బి’ గ్రేడ్‌కు రూ.2,183ల మద్దతు ధర చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు 1,70,240 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. చాలా కేంద్రాల్లో కొనుగోళ్లు చివరి దశలో ఉన్నాయి. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావడంతో 98 కేంద్రాలను అధికారులు మూసివేశారు. ధాన్యం విక్రయించిన రైతుల్లో ఇప్పటి వరకు 20,774 మంది రైతులకు రూ.268.16 కోట్ల మేర రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు అధికారులు చెబుతున్నారు.

అకాల వర్షంతో...

వారం రోజులుగా ఆకాశంలో మబ్బులు పట్టడంతోపాటు రెండు రోజులుగా చినుకులు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులు గడిస్తే తూకం అవుతుందని ఆశతో ఉన్న రైతుల్లో తుపాను తీవ్ర నిరాశకు గురిచేసింది. అకాల వర్షంతో ధాన్యం కుప్పల్లో తేమ శాతం పెరిగిపోయి కాంటాలు కావడంలో జాప్యం నెలకొంది. కొందరు రైతులు వ్యాపారులకు ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించుకుంటున్నారు. చాలా కేంద్రాల్లో అయిదు నుంచి పది శాతం తూకాలు కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ధాన్యం కుప్పలు పూర్తయితే కేంద్రాలను మూసివేయనున్నారు. తుపాను ప్రభావం లేకుంటే ధాన్యం తూకాలు సజావుగా సాగి చాలా వరకు కొనుగోలు కేంద్రాలను మూసివేసేవారని నిర్వాహకులు చెబుతున్నారు. కేంద్రాల్లో తూకాలు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అవసరం మేరకు లారీలను సిద్ధంగా ఉంచి తూకాలు అయిన బస్తాలను ఎప్పటికప్పుడు కేటాయించిన రైస్‌ మిల్లులకు తరలించారు. వర్షం ముగిసిన వెంటనే తూకాలు పూర్తి చేస్తామని అధికారులు  పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని