logo

యువ కార్మికులే నిర్ణయాత్మకం

సింగరేణి ఎన్నికల్లో ఈసారి యువ కార్మికులే కీలకం కానున్నారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత ఓట్లు ప్రాధాన్యత చాటుకోనున్నాయి. సింగరేణి ఎన్నికల్లో మొత్తం 39,832 మంది కార్మికులున్నారు. ఇందులో 16 వేల మంది వరకు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత ఉన్నారు.

Updated : 08 Dec 2023 06:18 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని : సింగరేణి ఎన్నికల్లో ఈసారి యువ కార్మికులే కీలకం కానున్నారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత ఓట్లు ప్రాధాన్యత చాటుకోనున్నాయి. సింగరేణి ఎన్నికల్లో మొత్తం 39,832 మంది కార్మికులున్నారు. ఇందులో 16 వేల మంది వరకు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత ఉన్నారు. అంటే 45 శాతం మంది యువ కార్మికులే ఉండటంతో వారి ఓట్లు పొందేందుకు కార్మిక సంఘాలు కసరత్తు చేస్తున్నాయి. గతంలో సీనియర్‌ కార్మికులు ఎక్కువగా ఉండటంతో సంఘాల పనితీరు.. యూనియన్‌ విధానాలను చూసి ఓటు వేసే వారు. ఏ సంఘాన్ని గెలిపించుకోవాలో నిర్ణయించే వారు. ఈసారి కొత్త కార్మికుల సంఖ్య పెరిగింది. ఐదేళ్లలో వారసత్వ ఉద్యోగాలతో పాటు కొత్త నియామకాలు చేపట్టడంతో సింగరేణిలో 16 వేల మంది కొత్తగా చేరారు. వారికి ఈ ఎన్నికలు మొదటిసారి. గతంలో కార్మిక సంఘాలకు ఓటు వేసిన అనుభవం లేదు. ఆరేళ్ల తర్వాత వస్తున్న ఎన్నికల్లో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు ఎటు మొగ్గు చూపుతారో వారికే విజయవకాశాలుంటాయి. ఒక్కో డివిజన్‌లో 500 నుంచి 1000 వరకు కొత్త ఉద్యోగులు పనిచేస్తున్నారు.

16 వేల మంది వారే...

ఈ ఎన్నికల్లో కొత్తగా 16 వేల మంది యువ ఉద్యోగులున్నారు. వారసత్వం ద్వారా 15 వేల వరకు ఉద్యోగాల్లో చేరారు. వీరితో పాటు క్లరికల్‌, ఐటీఐ, డిప్లొమా ద్వారా కొత్త ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టారు. ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, ఫోర్‌మెన్‌, జేఎంఓ, వెల్డర్‌లను ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ఉన్న తక్కువ మంది ఉద్యోగుల్లో కొత్తగా వచ్చిన వారి సంఖ్య సగం వరకు ఉండటంతో వారే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. మొత్తం 11 డివిజన్‌లతో పాటు కార్పొరేట్‌ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఓటు వేస్తారు. డివిజన్‌ స్థాయి ప్రాతినిథ్య సంఘంగా కూడా వారి ఓటుపైనే ఆధారపడి ఉంటుంది. గతంలో అయితే ప్రతి కార్మికుడు ఏదో ఒక సంఘానికి సభ్యత్వం చేసి ఉండేవారు. కొత్తగా వచ్చిన ఉద్యోగులకు యూనియన్‌ నాయకత్వంతో సంబంధాలు అంతంత మాత్రమే. దీంతో పక్కాగా ఏ సంఘానికీ ఓట్లు పడతాయన్న నమ్మకం లేదు. ఎన్నికల సమయంలో యువ కార్మికులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో ఆ సంఘానికి గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

సమస్యల పరిష్కారానికి హామీలు

కార్మిక సంఘాలు కూడా నిర్ణయాత్మక శక్తి కావడంతో యువ కార్మికులను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కొత్తగా చేరిన వారికున్న సమస్యలను ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని నాయకులు హామీలు ఇస్తున్నారు. యువ కార్మికులతో సమావేశాలు నిర్వహించి తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. దీంతో పాటు వారసత్వంగా ఉద్యోగాల్లో చేరిన యువ ఉద్యోగుల తండ్రులు ఎవరన్నది ఆరా తీస్తూ వారి ద్వారా తమకు ఓటు వేసే విధంగా పాత తరం కార్మికులను రంగంలోకి దింపుతున్నారు. గతంలో సీనియర్‌ కార్మికుడు పనిచేసే సమయంలో ఏ సంఘానికి అనుకూలంగా ఉన్నాడో అతని వారసుడిని కూడా అదే సంఘం నాయకులు తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాని కోసం సీనియర్‌ కార్మికులను సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని