logo

6 గ్యారంటీలపై ఆశల ఊసులు

కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వేళ.. ఉమ్మడి జిల్లా వాసులకు ఆరు గ్యారంటీల అమలుపై ఆశలు పెరుగుతున్నాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలి సంతకం చేయడంతోపాటు ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజున గురువారం రాష్ట్రమంత్రి వర్గం భేటీలో ఈ నిర్ణయాలపై చర్చించడంతో యంత్రాంగం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

Published : 08 Dec 2023 06:20 IST

తొలి సంతకంతో సంబురం
అమలైతే జిల్లా వాసులకు భారీగానే ప్రయోజనం

ఈనాడు, కరీంనగర్‌ : కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వేళ.. ఉమ్మడి జిల్లా వాసులకు ఆరు గ్యారంటీల అమలుపై ఆశలు పెరుగుతున్నాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలి సంతకం చేయడంతోపాటు ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజున గురువారం రాష్ట్రమంత్రి వర్గం భేటీలో ఈ నిర్ణయాలపై చర్చించడంతో యంత్రాంగం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పభుత్వం నుంచి అందనున్న మార్గదర్శకాల ప్రకారం నాలుగు జిల్లాల్లో వీటి అమలు, ఆచరణ దిశగా సరికొత్త కార్యాచరణ సిద్ధమవనుంది. డిసెంబరు 9 నుంచి రెండు గ్యారంటీలు అమలు చేస్తామని ఇప్పటికే మంత్రులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీల అర్హులు ఎవరు అవుతారనే విషయమై సంబంధిత శాఖల అధికారులు నాలుగు జిల్లాల పరిధిలో కసరత్తు ప్రారంభించనున్నారు.

వరంగా..మహాలక్ష్మి

ఆరు గ్యారంటీల్లో తొలి హామీ మహాలక్ష్మి. ప్రతి నెలా మహిళలకు రూ.2500లను అందిస్తారు. నాలుగు జిల్లాలో 49,768 స్వయం సహాయక సంఘాలుండగా 5,70,931 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. దారిద్ర]్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఎంపిక చేసి అందులో అర్హులను గుర్తిస్తే ప్రతి నెల సుమారుగా 2.50 లక్షల మందికి ఈ ప్రయోజనాన్ని అందించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబరు 9 నుంచి అమలవనున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంతో రోజుకు 40 వేల మందికి లబ్ధి చేకూరే అవకాశముందని అంచనా. ఉమ్మడి  జిల్లాలో సగటున రోజుకు 80 వేల మంది ప్రయాణాన్ని సాగిస్తుంటారు. ఇందులో మహిళలు సగం వరకుంటారు. ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌కు ప్రస్తుతం రోజుకు రూ.1.40 కోట్లు ఆదాయం సమకూరుతోంది. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల రోజుకు రూ.70లక్షల భారం పడేవీలుంది. గ్యాస్‌ సిలిండర్‌ను రూ.500లకు అందించనుండటంతో నాలుగు జిల్లాల పరిధిలో దాదాపుగా 2లక్షల మంది గృహాల్లోని మహిళల వంటింటి బడ్జెట్‌ ఆదా అవనుంది.

మరింతగా.. రైతు భరోసా

ప్రస్తుతం రైతుకు పెట్టుబడి సాయంగా అందుతున్న మొత్తం ఇక మీదట ఎకరానికి రూ.15 వేలుగా అందనుంది. నాలుగు జిల్లాల పరిధిలో  6,25,951 మంది రైతులున్నారు. వీరికి చెందిన 12,88,198 ఎకరాల భూమికి రైతుబంధు సాయం ఏడాదికి రూ.1288 కోట్లు అందాయి. ఇక మీదట పెంచిన సాయం కలిపి ఏడాదికి రూ.1932 కోట్లు అవసరమవుతాయి. వీరేకాకుండా కౌలు రైతులకు రూ.15వేలు ఇవ్వనుండటంతో సుమారుగా 40వేల మంది ఈ కోవలోకి రానున్నారు. భూమిలేని వ్యవసాయ కూలీలు మరో 50వేల మంది ఉంటారు. వీరికి కూడా ఏడాదికి రూ.12 వేలనందించే భరోసాతో మేలు జరగనుంది. వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్‌ను అందించే వెసులుబాటుతో ఎక్కువగా ధాన్యాన్ని పండించే రైతులకు మేలు జరగనుంది. తాలు రూపంలో పోయే నష్టానికి అదనంగా ఈ బోనస్‌ దక్కనుంది.

చేయూత ద్వారా పింఛన్‌ అందుకుంటున్న వారికి ప్రతి నెలా రూ.4 వేల ఆసరా అందించడమనేది ఆరో గ్యారంటీ. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో 5,32,041 మంది ఆసరా పింఛన్లను అందుకుంటున్నారు. రూ.3016 స్థానంలో రూ.4 వేలు వీరికి అందనున్నాయి. ఇప్పుడున్న వీరితోపాటు కొత్తగా అర్హులు చేరితే మరో 50 వేల మందికి కొత్తగా పింఛన్‌ అందే అవకాశం ఉంటుంది. దీంతోపాటు రాజీవ్‌ ఆరోగ్య శ్రీ బీమా కింద రూ.10 లక్షల ఆర్థిక చేయూతనందించాలనే నిర్ణయంతో పేదలకు మేలు జరగబోతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నాలుగు జిల్లాల పరిధిలో 8,256 మంది ఆరోగ్యశ్రీ సేవల్ని అందుకున్నారు. ఈ సంఖ్య ఇటీవల పెరిగింది. సగటున ఉమ్మడి జిల్లాలో 11వేల మంది ఆరోగ్యసేవల్ని పొందుతున్నారు. వీరందరికి ఆరోగ్య చేయూతతో లాభం జరగనుంది.

యువ వికాసం పేరిట ప్రవేశపెట్టే మరో గ్యారంటీతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 40 శాతం యువతకు మేలు జరిగే వీలుంది. నాలుగు జిల్లాల పరిధిలో ప్రతి ఏడాది ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులు 1.50 లక్షల మంది ఉంటారు. వీరికి రూ.5 లక్షల విద్యా భరోసా కార్డును అందించాలనే లక్ష్యంతో ఈ సర్కారు ముందుకెళ్తోంది. దీని వల్ల ప్రతి ఏడాది నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి కార్పొరేట్‌ విద్య సహా ఇతర ఫీజులకు ఉపయుక్తంగా మారేందుకు ఈ కార్డు భరోసానివ్వనుంది. ఏడాదికి నాలుగు జిల్లాల్లో దాదాపుగా 8వేల మందికిపైగా ఈ సాయం అందితే పేదింట విద్యావికాసం మరింతగా పెరగనుంది. ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయాలన్న హామీ అమలైతే నాలుగు జిల్లాల పరిధిలో 63 మండలాల విద్యార్థులకు మేలు జరగనుంది.

గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని అందించాలని నిర్ణయించారు. దీంతో నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న పేద కుటుంబాలకు మేలు జరగనుంది. ప్రస్తుతం అన్నిరకాల విద్యుత్తు కనెక్షన్లు కలిపి 16,25,205 ఉన్నాయి. ఇందులో గృహావసరాలకు సంబంధించినవి 12లక్షలకుపైగా ఉంటాయి. 200 యూనిట్ల లోపు విద్యుత్తును వాడే వారి సంఖ్య గ్రామాల్లోనే ఎక్కువగా ఉండనుంది. దీంతో ఈ కేటగిరీలో ఎంతమంది వస్తారనే కోణంలో ప్రభుత్వ సూచనల ప్రకారం ముందుకెళ్లే పనిలో విద్యుత్తు శాఖ అధికారులున్నారు.

ఇందిరమ్మ ఇళ్లు అర్హులకు అందించాలనే ఆశయం కొత్త సర్కారుది. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలోనే చాలా గ్రామాల్లో ఈ ఇందిరమ్మ ఇళ్లు నిర్మితమయ్యాయి. ప్రస్తుతం ప్రతి గ్రామంలో 100 నుంచి 200 మంది లబ్ధిదారులుగా మారే అవకాశముంది. ఈ లెక్కన 1,218 పంచాయతీల్లో 1.21 లక్షల నుంచి 2లక్షలకుపైగా లబ్ధిదారులకు వీటిని అందించాల్సి ఉంటుంది. విడతల వారీగా ఈ ఎంపిక ప్రకియ ఉండే వీలుంది. ఇదే కాకుండా అసలు పూర్తిగా నివాస గృహం లేని వారికి స్థలం ఇవ్వడంతోపాటు రూ.5 లక్షల సాయం గూడుకు భరోసానివ్వనుంది. ఉద్యమకారుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలనే నిర్ణయంతో నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న సుమారు 100కుపైగా కుటుంబాలకు సొంత జాగా రూపంలో అండ దొరకనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు